అమరావతి: అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధంగా మాత్రమే బాబును అరెస్టు చేసి జైలుకు తరలించామని, పవన్ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పవన్ తన పార్టీని నాశనం చేసుకొని టిడిపిని బతికిస్తాడా? అని చురకలంటించారు. సుదీర్ఘ వాదనలు తరువాత కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విదించిందని, కక్షపూరిత చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అవినీతిపై ఎపిలో ఎవరిని అడిగినా చెబుతారని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయన దిట్ట అని విమర్శించారు.
హెలికాప్టర్‌లో తీసుకెళ్లామని చెప్పినా కూడా బాబు నిరాకరించారని, చంద్రబాబు అవినీతి చేయలేదని ఆయన లాయర్లే వాదించలేదని, అసలు స్కామ్ జరగలేదని కూడా వాదించలేదన్నారు. కొందరు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని, నేరాలు చేయడం చంద్రబాబు కొత్తకాదని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. స్కామ్‌లలో సంపాదించడం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం బాబుకు అలవాటుగా మారిందని, ఎపిని చంద్రబాబు అవినీతి మయం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదా? అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, ముద్రగడను ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని, అవినీతికి పాల్పడిన బాబును పవన్ భుజాన వేసుకుంటున్నాడని మండిపడ్డారు. పవన్ ప్రజాస్వామ్య బాటలో ఉన్నాడా? విప్లవ బాటలో ఉన్నాడా? అని తేల్చుకోవాలని సూచించారు.