Thursday, January 23, 2025

ఐపిఎల్‌కు రాయుడు గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఫైనల్ తర్వాత ఐపిఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయుడు వెల్లడించాడు. తన ఐపిఎల్ కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ అని రాయుడు స్పష్టం చేశాడు. ఇక రాయుడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐపిఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. 2010లో ఐపిఎల్‌కు శ్రీకారం చుట్టిన రాయుడు సుదీర్ఘ కాలం పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో 203 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 28.29 సగటుతో 4,329 పరుగులు చేశాడు.

తన కెరీర్‌లో ఓ సెంచరీ కూడా సాధించాడు. 201017 వరకు రాయుడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ముంబై కీలక ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. పలు మ్యాచుల్లో ముంబైకి ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. రాయుడు తన కెరీర్‌లో ఐదు టైటిల్స్‌ను సాధించాడు. ఇందులో మూడు ముంబై తరఫున, రెండు చెన్నై తరఫున సాధించాడు. 2018లో సిఎస్‌కెను ఐపిఎల్ విజేతగా నిలుపడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో రాయుడు 16 మ్యాచుల్లో 602 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక రాయుడు గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

ఒకప్పుడూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాయుడు ఆ తర్వాత పేలవమైన బ్యాటింగ్‌తో జట్టుకు దూరమయ్యాడు. అంతేగాక సెలెక్టర్లపై అనుచిత విమర్శలు చేసి బిసిసిఐ ఆగ్రహానికి గురయ్యాడు. కాగా రాయుడు తీరును తీవ్రంగా పరిగణించిన బిసిసిఐ అతన్ని టీమిండియాకు దూరంగా ఉంచింది. బోర్డు తీరుపై ఆగ్రహంతో రాయుడు అర్ధాంతరంగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఓ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో తర్వాత మరోసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఐపిఎల్‌లో మాత్రం రాయుడు కొనసాగాడు. అతను ప్రస్తుతం సిఎస్‌కెకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News