డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని అంబావాడేలో జనించాడు. బాల్యం నుండే కుల వివక్షతను, అణిచివేతను అడుగడుగునా ఎదుర్కొన్న అంబేద్కర్, తోటి మానవులను కులం పేరిట వెలివేసే కుల వ్యవస్థను ధిక్కరిం చాడు. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందు కు, అధ్యయనం, ఐక్యత, పోరాటం అవసరా న్ని తెలియజేసేందుకు జీవితపర్యంతం అలు పెరుగని నిరంతర కృషిని చేసాడు. అంబేద్కర్ స్కాలర్. గొప్ప మేధావి. భారత రాజ్యంగ రూపశిల్పి. అన్నింటికన్నా మిన్నగా దళిత దృక్పధం అనే దివిటీని ఆయన మనకి అందించాడు. ఈ దృక్పధం, ఈ కొత్త చూపు, అవగాహన అనేక రంగాలను, వ్యవస్థలను, మానవ సంబంధాలను, సిద్ధాంతాలను తిరిగి మూల్యాంకనం చేసితీరాల్సిన, కొత్త దారులను వేయాల్సిన అవసరాన్ని భారతీయ సమాజం ముందుకు తెచ్చింది. ఈ దృక్పధం, దళిత ఈస్తటిక్స్ తెలుగు సాహిత్యాన్ని కూడా పెను మంటై అంటుకుంది.
చూడని, లేదా చూడ నిరాకరించిన అనేక అంశాలను సాహిత్య వస్తువును చేయడమే కాదు వెలివేసిన, మూ సిన ఆగ్రహరాల పాండిత్యపు దర్వాజాలను ఫెడేలున ఒక్క తాపుతాన్ని, శరవేగంతో తమ దైన అద్బుత సాహిత్యా సృజనకి దారులు వేసింది. ‘నోరులేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాలను బలి ఇవ్వరు గుర్తుంచుకొండి . మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి.అందుకు దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు’ అన్నాడు అంబేద్కర్. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో దేశంలో దళి తుల జీవన స్థితిని, అస్తిత్వ పోరాటాన్ని అద్భుతంగ అక్షర బద్ధం చేసిన తెలుగు సాహిత్యం ఎంతో వుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇప్పటికే ప్రాచుర్యం పొందిన కవితల్లోని కొన్ని భాగా లను మెహఫిల్ పాఠకుల కోసం అంది స్తున్నాం.
మెహఫిల్
నెత్తుటి ప్రశ్న
నేనింకా నిషిద్ధమానవుణ్నే
నాది బహిష్కృత శ్వాస
నా మొలకు తాటాకు చుట్టి
నా నోటికి ఉమ్మి ముంత కట్టి
నన్ను నలుగురిలో అసహ్య జంతువుని చేసిన
మనువు నా నల్లని నుదుటి మీద బలవంతంగా
నిషిద్ధముద్ర వేసినప్పుడే
నా జాతంతా క్రమంగా హత్య చేయబడింది
మా చావుకి వెల కూడా నిర్ణయించబడుతుంది
మాకు ఇప్పుడు కావలసింది నెత్తుటి రొక్కం కాదు
మాకేం కావాలో కోరుకునే నిర్భయ గొంతుక
కొత్త రాజ్యాంగం, కొత్త దేశం,
కొత్త భూమి, కొత్త ఆకాశం
ఎండ్లూరి సుధాకర్
వెలిగుడి
సాటి మనిషి నెలివేసి
వేటికంత ఎగిసేవు
నీకు నీవే ఎక్కువ అని
ఎలా పొంగిపొయ్యేవు
చాయ తాగితే గ్లాసులు
మైలవడినవి అంటివి
మొక్కినందుకే దేవుని
మహిమ తొలిగెనంటివి
గుడిలోకి వచ్చినరని
గుడినే వెలివేస్తివి
గాలి పీల్చి వదిలిరని
గాలిని వెలివేస్తవ
వెలుగులో నడయాడిరని
పొద్దున వద్దంటావ
సేలకు సెమటోంపిరని
గింజల తిననంటవా
గాలికి పొద్దుకు గింజకు
లేని అంటు రాని అంటు
తోటి మనుషుల కం ట్టుకున్న
తోవకెందుకు ఉంటది
గోరటి వెంకన్న
పిడికెడు ఆత్మగౌరవం కోసం
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం చంపబడ్డాను
తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి
అవమానాలకు, అత్యాచారాలకు, మానభంగా
లకు, చిత్రహింసకులకు గురై
పిడికెడు ఆత్మగౌరవం కోసం తల ఎత్తిన వాణ్ణి
ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాణ్ణి
బతికేందుకు పదే పదే చస్తున్న వాణ్ణి
నన్ను బాధితుడని పిలవకండి
నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి
లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు
క్షామాన్ని మింగిన
గరళ కంఠుణ్ణి నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
సూర్యుడి నెత్తి మీద ఈడ్చితన్నిన వాణ్ణి
రగిలి గుండె కొలిమిలో నినాదాలు
కురిపిస్తున్న వాణ్ణి నాకు జాలిజాలి మాటలొద్దు
కన్నీటి మూటలొద్దు నేను బాధితుడిని కాదు
అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని
నా కోసం కన్నీరు కార్చకండి మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురువనాన్నయి
వికసిస్తాను నా శవాన్ని ఈ దేశం
ముఖచిత్రంగా ముద్రించండి చరిత్ర పుటల్లోకి
సుందర భవిష్యత్తును పరివాప్తిస్తాను
ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను
కలేకూరి ప్రసాద్
మట్టి తల్లి
నేల నాదంటే ఇక్కడ సవర్ణపాములు
బుసకొడతాయి సాగు నాదంటే
పెద్ద కులం జెర్రిపోతయి ఒళ్లంతా పాకుతుంది
నీరు పాడు చేయొద్దంటే
ఊరి చెరువులో మా నెత్తురుతో నిండుతాయి
మర్చిపోయావా?
జానెడు నేలకు హక్కుదారైనందుకు
ఖైర్లాంజి భయ్యాలాల్ భార్యాబిడ్డలు
కుల భూస్వామ్యపు వ్యధశిలకు
వేలాడిన కథ
ఇంకా మా చెవిలో పచ్చి పచ్చిగా
సలపరిస్తూనే ఉంది
చల్లపల్లి స్వరూప రాణి