Sunday, January 19, 2025

పార్లమెంట్ ప్రాంగణం రణరంగం

- Advertisement -
- Advertisement -

n అంబేద్కర్‌కు అవమానంపై ఇండియా, ఎన్‌డిఎ కూటముల
పోటా పోటీ నిరసనలు n ఇరుపక్షాల
మధ్య తోపులాట n ఇద్దరు బిజెపి
ఎంపిలకు తీవ్రగాయాలు
n రాహుల్ తోసివేయడం వల్లే
గాయపడినట్టు బిజెపి ఆరోపణ
n పోలీసులకు ఇరు పక్షాల ఫిర్యాదు

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీనికి పోటీగా అధికార పక్షం ఎంపీలు కూడా అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. అటుఇటు నిరసనల హోరులో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఘర్షణలు, ఎంపీల తోపులాటకు, గాయపడడానికి దారి తీసింది. ఇందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ముకేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ చంద్రసారంగి కిందపడి గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. పార్లమెంట్ లోని మకరద్వారం వద్ద గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీయే కూటమి ఎంపీలు అక్కడకు రాగా,

వీరిని లోపలికి వెళ్లనీయకుండా విపక్ష ఎం పీలు అడ్డుకున్నారని బిజేపీ ఆరోపించింది. దీంతో అక్కడ గందరగోళం తలెత్తి బీజేపీ ఎంపీలు కిందపడి గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌కు ఐసీయులో చికిత్స అందించారు. మరో ఎంపి ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయమైంది. ఇద్దరు ఎంపీల తలలకు దెబ్బలు తగిలాయని, సారంగి తలకు లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, తలకు కుట్టువేశామని వైద్యులు చెప్పారు. స్పృహ లేని స్థితిలో వచ్చిన ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌కు వైద్యం అందించాక కోలుకున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రికి మంత్రులు, తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెళ్లి ఎంపీలను పరామర్శించారు. వారి ఆరో గ్యం గురించి ప్రధాని మోడీ ఫోన్ ద్వారా వాకబు చేశా రు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో ఎంపీ ప్రతాప్ సారం గి మీడియాతో మాట్లాడారు. “నేను మెట్ల వద్ద నిల్చొని ఉండగా, రాహుల్ ఎంపీని నెట్టేశారని, ఆయన వచ్చి నాపై పడడంతో నేను కిందపడ్డాను ” అని ఆరోపించారు.

అధికార, విపక్ష ఎంపీల ఫిర్యాదుల వెల్లువ
ఈ సంఘటన తరువాత అధికార, విపక్ష ఎంపీలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎన్‌డిఎ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్‌తోపాటు తెలుగుదేశం ఎంపీ కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ దాడి చేయడమే కాకుండా , దాడికి ప్రేరేపించారని, ఇలాంటి వైఖరి ఆమోదయోగ్యం కాదని, నేరపూరతమైందని ఎంపీలు విలేఖరులకు వెల్లడించారు. పార్లమెంట్ లోకి శాంతియుతంగా ప్రవేశించేందుకు భద్రతాసిబ్బంది ప్రత్యామ్నాయ మార్గం చూపించారని, ఆ దారిలో వెళ్లాలని అభ్యర్థించినా, రాహుల్ వినలేదని ఎంపీ బన్సూరీ స్వరాజ్ ఆరోపించారు.

మరోవైపు రాహుల్‌పై రాజ్యసభ ఛైర్మన్‌కు బీజేపీ మహిళా ఎంపి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ వచ్చి అనుచితంగా ప్రవర్తించారని, తనపై అరిచారని, ఆయన తీరుతో పక్కకు తప్పుకోవలసి వచ్చిందని నాగాలాండ్‌కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. “రాహుల్ చర్యలతో నా గౌరవానికి , ఆత్మ విశ్వాసానికి తీవ్ర గాయమైంది. ఆదివాసీ వర్గానికి చెందిన సభ్యురాలినైన నాకు మీరే రక్షణ కల్పించాలి ”అని కోరారు. మరోవైపు బీజేపీ, ఎన్‌డిఎ ఎంపీల దురుసుతనం కారణంగా పార్లమెంట్ ప్రాంగణంలో తమకు గాయాలయ్యాయని కాంగ్రెస్ మహిళా ఎంపీలు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

తీవ్రంగా స్పందించిన రాహుల్, ఖర్గే
బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. “ జరిగిందంతా మీ కెమెరాల్లో కనబడి ఉండొచ్చు. నేను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ వారు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే రాజ్యాంగంపై వారు దాడి చేస్తున్నారు. అంబేద్కర్‌ను అవమానించారు. ” అని రాహుల్ దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకు సాక్షంగా వీడియోను కాంగ్రెస్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ సంఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. “ ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీలు నన్ను నెట్టేశారు. దాంతో నామోకాలికి గాయమైంది. ” అని తెలియజేశారు. తోపులాట సంఘటనపై విచారణ జరపాలని లేఖలో స్పీకర్‌ను కోరారు.

ఇదంతా అమిత్‌షాను కాపాడే ప్రయత్నం: ప్రియాంక గాంధీ
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కాపాడుకునేందుకే తన సోదరుడు, ఎంపీ రాహుల్‌పై ఆరోపణలు చేస్తున్నారని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. “ అంబేద్కర్ ఫోటోను పట్టుకుని జైభీమ్ అని నినాదాలు చేస్తూ శాంతియుతంగా పార్లమెంట్ లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఎవరు లోపలికి ఆయనను వెళ్లకుండా ఆపారో మీరు చూడవచ్చు. మేం చాలా రోజులుగా నిరసనలు చేస్తున్నాం. ఈ రోజు వారు ఆందోళనలకు దిగారు. అ ప్పుడే ఈ తోపులాటలు, గూండాగిరీ చోటు చేసుకుంది. అమిత్‌షాజీని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నాలు మొ దలు పెట్టారు. రాహుల్ ఎవరినో తోసేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. నా కళ్ల ముందు ఖర్గేజీని తోసేశారు. ఆయననేలపై పడిపోయారు. తర్వాత సిపిఎం ఎంపీని నె డితే ఆయన ఖర్గేజీపై పడిపోయారు. ఇదంతా ఒక కుట్ర. వారి నిజమైన సెంటిమెంట్ ఈ రోజు బయటపడింది. జైభీమ్ నినాదాలు చేయాలంటూ వారికి నేను సవాలు విసురుతున్నాను ”అని మీడియాతో మాట్లాడారు.

అంబేద్కర్ అంశంపై దేశవ్యాప్త ఉద్యమం: ఖర్గే
అంబేద్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఢిల్లీ లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే,రాహుల్ సంయుక్తంగా గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాం. అది జరగదని మాకు తెలుసు. అందుకే నిరసనలు చేపట్టాం. అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇతర అంశాలను లేవనెత్తుతోంది. ”అని ఖర్గే అన్నారు. రాహుల్ మాట్లాడుతూ బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచన రాజ్యాంగానికి , అంబేద్కర్‌కు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్‌షా క్షమాపణలు చెప్పి తీరాలని, అలాగే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News