Monday, December 23, 2024

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అంబేడ్కర్ విగ్రహం పనులు పూర్తి

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిక వేడుకలకు ఇది ప్రారంభం
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది
అంబేడ్కర్ స్థాయికి తగ్గట్టుగానే ఆయన విగ్రహం ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహం పనులు పూర్తవుతాయని, ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిక వేడుకలకు దీనిని ప్రారంభిస్తామని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద సిద్ధమవుతున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు సోమవారం పరిశీలించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్‌సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న డా.బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వారిద్దరూ పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను మంత్రులు పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ప్రదర్శించిన వీడియోను తిలకించి నిర్మాణంలో స్వల్ప మార్పులను వారు సూచించారు. నిర్మాణ ప్రాంగణం అంతా సుమారు మూడుగంటల పాటు మంత్రులు కలియతిరిగారు. సివిల్ వర్స్‌తో పాటు మెయిన్ ఎంట్రన్స్‌లో పార్లమెంట్ ఆకృతి వచ్చే ఫిల్లర్స్ రెడ్ సాండ్ స్టోన్ క్లాడింగ్ పనులు, ప్రధాన ద్వారంలో ఉండే ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. అనంతరం మొదటి అంతస్థులో విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు.

అంబేద్కర్ చూపిన బాటలోనే రాష్ట్రం సిద్ధించింది

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపార గౌరవం ఉందన్నారు. అంబేడ్కర్ స్థాయికి తగ్గట్టుగానే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ఫూర్తినిచ్చేలా అంబేడ్కర్ మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేస్తామని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ప్రకారమే రాష్ట్రం సిద్ధించిందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలోనే కెసిఆర్ రాష్ట్రాన్ని సాధించి జనరంజక పాలన అందిస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలవుతున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి నెలలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తవుతుందని, అంబేద్కర్ సేవలు స్మరించుకునే విధంగా, వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11.5 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతుందని మంత్రి వేముల తెలిపారు.

పార్లమెంట్ భవన ఆకృతి వచ్చేలా నిర్మాణం ఉండేలా….

నిర్మాణ కింది భాగం పార్లమెంట్ భవన ఆకృతి వచ్చేలా నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాన్ని మానిటరింగ్ చేస్తున్నారని మంత్రి వేముల తెలిపారు. సిఎం కెసిఆర్ సూచనల మేరకు విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం, ఆయన రాజ్యాంగ నిర్మాణం కోసం, దేశ ప్రజల కోసం చేసిన సేవలకు సంబంధించిన ఫొటో గ్యాలరీతో పాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను తెలిపే ఆడిటోరియం, థియేటర్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. అందులో ప్రస్తుత యువతకు స్ఫూర్తి నింపే విధంగా అంబేద్కర్ పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రత్యక్ష వీడియో స్పీచ్‌లు, ఆయన జీవిత చరిత్ర మీద వచ్చిన సినిమాలోని ముఖ్య వీడియోలు ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలువనుందని మంత్రి వేముల స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహంగా చరిత్ర

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు తమకు సలహాలు, సూచనలు చేస్తున్నారని, ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా దీనిని ప్రారంభం చేసుకుంటామన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు చేశారని మంత్రి కొప్పుల తెలిపారు. ఈ నిర్మాణం పూర్తైతే ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహంగా చరిత్ర సృష్టించనుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంత్రుల వెంట ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News