Saturday, December 21, 2024

జయహో.. జై భీమ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా….హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. రాజ్యాంగ నిర్మాత జయంతి రోజు శుక్రవారం 125 అడుగుల బాబా సాహెబ్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కెటిఆర్, హరీశ్‌రావు,మహమూద్ అలీ, గంగుల కమలాకర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళితబంధు పథకం లబ్దిదారుల విజయగాధలతో రూపొందించిన సిడిని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ..నిజంగా పని చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుందని అన్నారు.

కొన్ని విషయాలు చెప్పేందుకు ఆత్మవిశ్వాసం కావాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తానని చెప్పి వెళ్లానని, పార్లమెంట్‌లో బిల్లు పాసై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు తిరిగిరావచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు పార్టీని జాతీయంగా విస్తరించారని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారని పేర్కొన్నారు. మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రికి ఉండాలని ఆయన మీకు చెప్పారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. తప్పకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే అని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చని…. కానీ, ఒక చిన్న మినుగురు చాలు అంటుకోవడానికి అని పేర్కొన్నారు. ఇటీవల తాను మహారాష్ట్రకు వెళితే కలలో కూడా ఊహించని విధంగా ప్రోత్సాహం, ఆదరణ లభించిందని, ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్లో కూడా ఇలాంటి ఆదరణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కలలు సాకారం కావాల్సిన అవసరం ఇంకా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తబొట్టు వరకు కృషిచేస్తానని అన్నారు.

దేశవ్యాప్తంగా దళితబంధు

70 సంవత్సరాల కిందట రాజ్యాంగం అమలైనా… అనేక పార్టీలు గెలవడం, ఓడడం ప్రభుత్వాల్లో మార్పులు జరిగినా… కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుపేదలు ఎవరంటే దళితుల అనే మాట ఉండడం మనందరికీ సిగ్గుచేటని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.బాధతో అయినా సరే బాధతో అందరూ అంగీకరించక తప్పదని…ఈ పరిస్థితి మారాలని అన్నారు. పార్టీలు ఓడిపోవడం, వేరే పార్టీలు గెలువడం కాదు.. ప్రజలు గెలిచే రాజకీయం దేశంలో రావాలని ఉద్ఘాటించారు. దాని కోసం దళిత మేధావివర్గం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 2024 ఎన్నికల్లో రాబోయే తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.

దళితుల కోసం రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేశాం

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు ఇక్కడ వేరే పార్టీ రాజ్యం చేసిందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో దళితుల అభివృద్ధి కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే, బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 1.25లక్షల కోట్లు ఖర్చు చేసిందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇది కంప్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ జనరల్(కాగ్) ఇచ్చిన అకౌంట్ల నిర్ధారణ అని, ఈ సమాచారం ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉందని, ఎవరైనా దీనిని చూసుకోవచ్చని తెలిపారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా గొప్ప, అద్భుతమైన కార్యక్రమం దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు.

ప్రతి సంవత్సరం 25లక్షల కుటుంబాలకు..

దేశంలో రాబోయే ప్రభుత్వం మనదే అని, తెలంగాణ దళితబంధు తరహాలో .. దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అంబేద్కర్ కలలు ఇంకా నెరవేరలేదని, ఆయన కలలు సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 వేల మందికి దళితబంధు అందిందని, ఈ సంవత్సరం మరో 1.25 లక్షల మందికి దళితబందు అందిస్తామని వెల్లడించారు.

ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం

ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం…. ఇది ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక అని అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం జయంతి నిర్వహిస్తున్నాం… పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఆక్రోషాన్ని తెలియజేస్తున్నాం… సంవత్సరాలు, శతాబ్దాలు గడిచిపోతున్నాయని..కానీ ఆయన ఆశయాలు సాకారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విశ్వమానవుడు… అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనది అని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతం ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం అంబేద్కర్ అని అన్నారు. గొప్ప ఆదర్శమూర్తి అంబేద్కర్ విగ్రహావిష్కరణతో నా జన్మ ధన్యమైందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతోందని, ఆయన చెప్పింది ఆచరించాలి… ఆ దిశగా కార్యాచరణ జరపాలని చెప్పారు. తెలంగాణ నూతన సచివాయలానికి అంబేద్కర్ పేరు పెట్టామని, సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ప్రతి రోజు సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ ప్రభావితం కావాలనే ఉద్ధేశంతోనే ఇక్కడ భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. అంబేద్కర్ సిద్ధాంతం, ఆచరణ… కళ్లలో మెదలాలని ఈ విధంగా రూపకల్పన చేశామని అన్నారు. ఎవరో డిమాండ్ చేస్తే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేని, ఈ విగ్రహ ఏర్పాటు ఒక బలమైన సందేశం ఉందని కెసిఆర్ అన్నారు. సచివాలయం సమీపంలోనే అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్థూపం, హుస్సేన్‌సాగర్‌లో బుద్దుడి విగ్రహంతో మంత్రులు, ప్రజాప్రతినిదులు, అధికారులు స్పూర్తి పొందాలనే ఉద్ధేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు.

అంబేద్కర్ పేరిట అవార్డు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అవార్డు కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నిధితో ఏటా రూ.3 కోట్ల వడ్డీ వస్తుందని, ఆ మొత్తంలో అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని, ఆయన సూచన మేరకు ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ పేరిట శాశ్వత అవార్డును ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రభుత్వం అంబేద్కర్ అవార్డు అందజేస్తుందని తెలిపారు.

జై బీమ్ అని నినదించిన సిఎం కెసిఆర్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జై బీమ్ అని నినదించారు. అనంతరం జై బీమ్ అంటూ నినదిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఘనంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే పెద్దదయిన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కణ ఘనంగా జరిగింది. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించగా, అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు. బి.ఆర్.అంబేడ్కర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సిఎం కెసిఆర్, ప్రకాశ్ అంబేద్కర్, మంత్రులు సందర్శించారు. అంబేద్కర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎన్‌టిఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతమంతా నీలిమయమైంది. ఆ ప్రాంతమంతా జై బీమ్ నినాదాలతో మారుమోగింది.

హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం

హుస్సేన్ సాగర్ తీరాన కొలువుదీరిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ పూల వర్షాన్ని సిఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సభికులు వీక్షించారు. అంబేద్కర్ విగ్రహం పూల వర్షం కురుస్తుండగా, అక్కడున్న వారు ఫోన్లలో వీడియోలు తీస్తూ చప్పట్లతో స్వాగతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News