భారతదేశంలో పాతుకుపోయిన కులవ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షలు బడుగు, బలహీన వర్గాలను దిగజార్చాయి. ఇలాంటి వివక్షాపూరిత సమాజంలో పుట్టిన ధ్రువతార డా. బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబేవాడలో జన్మించారు. మహర్ కులంలో పుట్టి బాల్యంలోనే అనేక అవమానాలకు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పట్టుదలతో గొప్ప చదువులు చదివారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఆస్థానంలోనే ఉద్యోగంలో చేరారు. అక్కడ కూడా అంబేడ్కర్‌ను నౌకర్లు అస్పృశ్యుడుగా చూడడం పెద్ద అవమానంగా భావించారు.
దీంతో సామాజిక వివక్షపై అలుపెరగని పోరాటం చేశారు. దళిత జాతులకు కులం పేరుతో మంచినీటికి దూరం చేసిన అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ‘మహాద్ చెరువు’ పోరాటం అందరి దృష్టిని ఆకర్షించించింది. ఇది భారత దేశంలోనే మొదటి మానవ హక్కుల ఉద్యమం. ఆలయాల ప్రవేశాలు, పాఠశాలలో చదువు, తాగునీరు, బడుగు బలహీన వర్గాలకు అందాలని పట్టుపట్టారు.1927లో సైమన్ కమిషన్ సందర్శించినప్పుడు దళిత జాతి సమస్యలను మొట్టమొదిసారిగా నివేదించారు. అప్పుడు బ్రిటిష్‌వారికి ఈ దేశంలోని దళితుల పరిస్థితిపట్ల వాస్తవ విషయాలు తెలిశాయి. అనంతరం అంబేడ్కర్ ‘అఖిల భారత దిగువ కులాల సమైక్య’ను స్థాపించి వారి ఉన్నతికై పోరాటం చేశారు. ఇంగ్లాండులో మూడు రౌండ్ టేండ్ సమావేశంలో పాల్గొని దళిత జాతి సమస్యలను బ్రిటిష్‌వారి దృష్టికి తీసుకెళ్లారు.
దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని డిమాండ్ చేశారు. అనేక కుట్రల వలన అవి ఆచరణ సాధ్యంకానప్పటికీ నేటి రిజర్వేషన్ వ్యవస్థకు మూలమైనవి. 1927లో అంబేడ్కర్ ‘బహిష్కృత భారతీ’ అనే పత్రికలో తిలక్ అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అనే వాడు కాదు, అస్పృశ్యతా నివారణ నా ధ్యేయం, నా జన్మహక్కు అని నినాదించేవాడని రాశారు. 1924లో సమానత్వ సాధనకై ‘సమతా సైనిక్ దళ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. యువతలో వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పిస్తూ, అగ్రకులాల దాడులను ఎదుర్కొనే విధంగా తయారు చేశారు. ‘మూక్‌నాయక్’ పత్రికను నడిపి దేశ మూలవాసుల చరిత్రను వెలికితీశారు. అంబేడ్కర్ రాకతో అణచివేతపై దిగువ కులాల పోరాట ఉద్యమాలు ప్రాంతీయ పరిధిని దాటి జాతీయస్థాయికి విస్తరించాయి.
అవి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలతో అందరినీ సంఘటితం చేశాయి. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేడ్కర్ విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడనిదే వారి సమస్యలకు పరిష్కారం దొరకదని భావించారు. అందుకే వీరికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షత వహించి, ప్రపంచంలోని దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాశారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను అందులో చేర్చి భారత రాజ్యాంగ పితగా వెలుగొందారు. పీడనకు గురైన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించారు.అగ్రకులాల కుట్రలు ఛేదించి అందిరికీ ఓటు హక్కును కల్పించి, రాజకీయ సమానత్వం సాధించారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కు కోసం పోరాడారు. జీవిత చరమాంకంలో అంబేడ్కర్ నా పుట్టుక నా చేతిలో లేదు కానీ, నా చావు నా చేతిలో ఉందని ప్రకటించి హిందూ మతాన్ని వీడి మానవీయ విలువలతో కూడిన బౌద్ధాన్ని స్వీకరించారు.
1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. ఆయన నిత్య చైతన్యం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకం. ప్రతి వ్యక్తికి అమ్మ జన్మనిస్తే… అంబేడ్కర్ రాజ్యాంగం జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై లక్షపేజీల సాహిత్యాన్ని మనకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాడిన గొప్ప నాయకుడు. అందుకే ఐక్యరాజ్య సమితి అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తించిది. ఆయన జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ గర్వించదగ్గ విషయం. కానీ ఇప్పటికీ ఆయనను దళితనాయకుడుగా సమాజం కీర్తించడం బాధాకరం. అన్నివర్గాలకు హక్కులు కల్పించిన విశ్వమానవుడు. నేడు మనమంతా రాజ్యాంగం కల్పించిన హక్కులతో జీవితాలు అనుభవిస్తున్నాం తప్ప, ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాం. దీంతో అన్నిరంగాలలో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది.
దేశంలో 90% ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్రవంతికి దూరంగానే ఉన్నారు. అయినప్పటికీ అగ్రకుల పార్టీలు ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% ఇడబ్లుస్ రిజర్వేషన్స్ కల్పించుకొన్నాయి. అయినప్పటికీ వెనకడిన వర్గాలు ఈ విషయాన్నీ ప్రశ్నించకపోవడం గమనార్హం. మరోవైపు ప్రైవేటీకరణతో పేదల రిజర్వేషన్స్‌కు గండికొడుతున్నారు. ఈ నేపథ్యలో దేశంలో మెజారిటీ జనాభా గల బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు చేయాల్సింది రాజ్యాధికార యుద్ధం తప్ప, మరోటి కాదు. నేడు అన్ని వర్గాల ఆత్మఘోషను వినిపించే భారత రాజ్యాంగ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. అగ్రకుల పార్టీలు ఒకటై రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నాయి. రాజ్యాంగ రక్షకులు ఒకవైపు, రాజ్యాంగాన్ని మార్చే శక్తులు మరొక వైపుగా దేశ రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలకు వ్యతిరేకంగా ఓటనే ఆయుధంతో బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికార యుద్ధం చేయాలి. అప్పుడే సామాజిక, ఆర్ధిక, సమానత్వం సాధించబడుతుంది. దేశంలో సంపద ప్రజాస్వామ్యీకరించబడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుంది. అంబేడ్కర్ కోరుకున్నది కూడా అదే.
సంపతి రమేష్ మహారాజ్
99595 56367
(నేడు అంబేడ్కర్ వర్ధంతి)