Tuesday, January 21, 2025

జాతి రక్షకుడు అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

‘అజ్ఞానం భయానికి, భయం విద్వేషానికి, విద్వేషం హింసకు దారి తీస్తుంది’ ఒక తాత్వికవేత్త చెప్పిన మాటలివి. ద్వేషం, విద్వేషం మనిషిని మరింత బలహీనున్ని చేస్తాయి. అయితే అవి ఒక సామరస్య వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఏదైనా ఒక విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఎవరైనా తమకు ప్రత్యర్ధులని తెలిసినా, అవి తమ ప్రయాణంలో అడ్డంకిగా ఉన్నాయని గమనించినా వాటిని విస్తృతమైన చర్చల ద్వారా, వివేచనతో కూడిన ఆచరణ ద్వారా పరిష్కారం చేసుకోవాలని గౌతమ బుద్ధుడతో సహా చాలా మంది దార్శనికులు ప్రబోధించారు.

సరిగ్గా ఇదే మన భారత హోం మంత్రి అమిత్ షాకు వర్తిస్తుంది. కారణాలు ఏమైనా, ఆయన ఒక విద్వేషపు మనస్తత్వంతో బాబా సాహెబ్ అంబేద్కర్ మీద విరుచుకుపడ్డారు. అవహేళన చేశారు. ఆయన ప్రసంగం చూసిన ఎవ్వరికైనా అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే ఒక ఆరు సార్లు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ ఊగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్లుగా అంబేద్కర్‌కు బదులుగా దేవున్ని స్మరించాలనుకుంటే ఆయన ఆ పని చేయవచ్చు. ఆయన అనుచరులకు ఆదేశాలు ఇవ్వవచ్చు. తప్పేమీ లేదు. ఇంకొక విషయం, ఆయనకు ఇష్టం లేకుంటే అంబేద్కర్ పేరును ఉచ్చరించవద్దు. కానీ అవహేళన చేయకూడదు. అవమానించకూడదు.పైగా తాను అంబేద్కర్‌ను అవమానించలేదని కాంగ్రెస్ వాళ్ళను మాత్రమే విమర్శించానని చెప్పుకుంటున్నారు. ఆయన తరపున ఆ పార్టీ నాయకులు పోటీలుపడి అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే బాబా సాహెబ్ అంబేద్కర్ ఎవరైనా ఎందుకు స్మరిస్తున్నారు? దానికి కారణాలున్నాయి. భారత దేశంలో ఉన్న వివిధ వర్గాల, కులాల ప్రజల రక్షణకు, సంక్షేమానికి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు, సాగించిన ఉద్యమాలు, రూపొందించిన చట్టాలు దోహదపడ్డాయి. అన్నింటికి మించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ద్వారా కొనసాగుతున్న సామరస్య పూర్వకమైన జీవనం కూడా ఆయన రచించిన రాజ్యాంగ ఫలితమే. దేశంలో ఏ రంగంలో సంక్షోభం తలెత్తిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు మార్గం చూపుతున్నాయి. కులం, ప్రాంతం, మతం, భాష సమస్యలైతేనేమి, మహిళల ఆదివాసీల, దళితుల హక్కులైతేనేమి అన్నింటికీ బాబా సాహెబ్ రాజ్యాంగంలో కట్టుదిట్టమైన రక్షణలు కల్పించారు. అందువల్ల అన్ని వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఒక మహానీయుడిగా, హక్కుల రక్షణ ప్రదాతగా భావిస్తున్నారు. అమిత్ షా అన్నట్టు దేవుడికి, బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడి మీద ఎవరి విశ్వాసం వారిది. దేవున్ని విశ్వసించే వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గౌరవిస్తున్నారు. ఇది సత్యం.

ఇంకొక విషయం అమిత్ షా అవహేళన చేసినంత మాత్రన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం తగ్గదు. అది మరింత పెరుగుతుందే కానీ తరగదు. అమిత్ షా కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ అందరికంటే ఎక్కువగా బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించాలి. వాళ్ళ అందరి ఇళ్ళల్లో పెద్ద, పెద్ద విగ్రహాలు పెట్టుకొని పూజించాలి. ఎందుకంటే, వాళ్ళు ప్రతి రోజు పూజిస్తున్న దేవుళ్ళ కన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందారు. అన్ని వర్గాల కన్న హిందూ మతం గురించి, దాని ప్రగతి గురించి ఆలోచిస్తున్న వాళ్ళ కన్న అంబేద్కర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వాళ్ళను బాగా కాపాడింది. అదేంటో అని చాలా ఆశ్చర్యంగా ఉంది కదా!

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు డిప్రెస్ట్ క్లాసెస్‌గా నిర్ధారించిన అంటరాని కులాలు హక్కుల కోసం ఆయన చదువు ముగించిన నాటి నుండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ప్రజాస్వామ్యం మీద, ఓటింగ్ హక్కుల మీద మొట్టమొదటిసారిగా 1919లో సౌత్ బరో కమిటి ముందు తన గళం విప్పారు. ఆ తర్వాత సైమన్ కమిషన్ ముందు కూడా అణగారిన వర్గాల హక్కుల గురించి వివరమైన ప్రతిపాదనలు చేశారు. లండన్‌లో 1930, 31, 32, లలో జరిగిన రౌండ్ టేండ్ సమావేశాల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ సాగించిన హేతుబద్ధమైన వాదనలు అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని సాధించారు. ఇది హిందూ మహాసభ నాయకులకు, అదే విధంగా ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న మహాత్మా గాంధీకి మింగుడు పడలేదు. దానితో పుణెలోని ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగి, బాబా సాహెబ్ అంబేద్కర్ 15 ఏళ్ళకు పైగా సాగించిన పోరాటం ద్వారా సాధించుకున్న ఫలితాన్ని గాంధీ రూపంలో హిందూ మహాసభ ఎత్తుకెళ్ళింది.

బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టి బాబా సాహెబ్ అంబేద్కర్‌ను మహాత్మగాంధీ ప్రాణరక్షణ ప్రమాదాన్ని చూపెట్టి ఒప్పించి పుణె ఒడంబడిక చేశారు. దానితో బ్రిటిష్ ప్రభుత్వం అంటరాని కులాల ప్రతినిధులను, ఆ కులాల ఓట్లతోనే ఎన్నుకునే ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని వెనక్కి తీసుకున్నది. 1916 నుంచి 1932 వరకు బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రసంగాలను, సాగించిన రచనను పరిశీలిస్తే హిందూ మతంపైన తీవ్రమైన వ్యాఖ్యలను చేయలేదు. ఆయన కేవలం అంటరాని కులాల వివక్ష, సమస్యలు వాటి పరిష్కారానికి చట్టాలు, విధానాలను మాత్రమే ఎక్కువగా ప్రస్తావించారు. కానీ, ఎప్పుడైతే మహాత్మగాంధీ నాయకత్వం హిందూ మత పెద్దలు సాధించుకున్న రాజకీయ హక్కులను వెనక్కు తీసుకున్నారో అది బాబాసాహెబ్ అంబేద్కర్ రెండవ రూపానికి తెర దీసింది. దీనికి తోడు మహర్ చెరువు సత్యాగ్రహం, కాలా రామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమం కూడా బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు హిందూ మతం మీద ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది.

అదే విధంగా రాజకీయాలంటే కూడా ఒక ఏహ్యభావం వచ్చింది. అదే సమయంలో ఆయన భార్య రమాభాయి మరణించింది. ఈ నేపథ్యంలో 1935, అక్టోబర్ 13న నాసిక్ సమీపంలోని యోలాలో జరిగిన ముంబాయి ప్రాంత డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్‌లో ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశారు. తాను హిందువుగా పుట్టడం తన చేతుల్లో లేదని, కానీ తాను హిందువుగా మాత్రం మరణించనని ప్రకటించారు. తాను వేరే మతం స్వీకరించడానికి ఇది సంకేతం. ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. దీనితో హిందూ మహాసభ నాయకులు చాలా మంది హిందూ నాయకులు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను విమర్శిస్తూ, ప్రకటనలు చేశారు. కొంత మంది అప్పటి డిప్రెస్డ్ క్లాసెస్ నాయకులలో కూడా అంబేద్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడించారు.

దీనితో పాటు ఇస్లాం క్రైస్తవ, సిక్కు మతాల పెద్దలు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను తమ మతంలోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొంత మంది దళిత నాయకులు, చాలా మంది యువకులు ఇస్లాం మతంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. 1936 మే 30, 31 తేదీల్లో ముంబాయికి సమీపంలోని నయీగాంలో మహల్ పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ డిప్రెస్డ్ క్లాసెస్ నాయకుడు బి.ఎస్. వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే బి.ఎస్. వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్‌గా పిలిచారు. ఇది మొదలు బి.ఎస్. వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్‌గా ప్రఖ్యాతి పొందారు.
ఈ సమావేశంలో చాలా ఉద్వేగాలు, ఆవేశాలు చోటు చేసుకున్నాయి. తాము హిందూ మతాన్ని వదిలి ఇస్లాం తీసుకుంటామని చెప్పడానికి చాలా మంది యువకులు టర్కీ టోపిలు పెట్టుకొని వచ్చారు.

అయితే ఈ సమావేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. సాధారణమైన ప్రసంగం లాగా కాకుండా, ప్రశ్నలు తానే వేసుకొని, జవాబులు చెప్పే పద్ధతిలో ప్రసంగం కొనసాగింది. ఆ ప్రసంగం చివరలో గౌతమి బుద్ధున్ని ఉటంకించి, తన ప్రయాణం బౌద్ధం వైపు అనే సంకేతం ఇచ్చారు. “నీకు నీవే మార్గదర్శివి. హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉండాలి. సత్యం మనకు గురువు కావాలి. ఎవరి ప్రలోభాలకు లొంగిపోకూడదు. ఈ సమయంలో గౌతమ బుద్ధుని సందేశం గుర్తు చేసుకుంటే మనం తప్పు చేయం” అంటూ ముగించారు. అయితే ఆనాడు ఉన్న పరిస్థితులల్లో క్రైస్తవం నుంచి కూడా మంచి, మంచి ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చే ఉంటాయి. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో బాబా సాహెబ్ అంబేద్కర్‌కు మంచి పరిచయాలున్నాయి.

ఒకవేళ ఆయన క్రైస్తవం వైపు వెళితే ఎన్నో ఉన్నంతమైన పదవులు ఆయనకు అందివచ్చేవి. అదే విధంగా ఇస్లాం తీసుకుంటే పొరుగున ఉన్న నిజాం ప్రభుత్వం ఆయనను ఏ అందలమైన ఎక్కించేది. సిక్కులు కూడా ఆయన కోసం చాలా ప్రయత్నాలు చేశారు. సిక్కిజం గురించి కొన్ని ఏళ్ళు ఆలోచించారు. ఒక దశలో మంబాయిలో గురుద్వారా కట్టాలని భూమి కూడా కొన్నారు. కానీ అంబేద్కర్ సుముఖత చూపకపోవడంతో వాళ్ళు గురుద్వారా ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈ మూడు మతాలను తిరస్కరించడానికి, బౌద్ధం వైపు మొగ్గడానికి ఏకైక కారణం, ఆయనలో ఉన్న హేతుబద్ధత. అదే విధంగా దేవుడు కేంద్రంగా కలిగిన మతాన్ని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరు. శాస్త్రీయత, హేతుబద్ధత, మనిషి కేంద్రంగా ఉద్భవించిన బౌద్ధం ఆయనకు అనివార్యంగా మార్గమైంది.

ఒకవేళ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇస్లాం వైపు వెళ్ళి ఉంటే దేశంలోని దళితుల్లో నూటికి 70 శాతం మందికి పైగా ఇస్లాంలోకి వెళ్ళేవారు. అప్పటికే అటువంటి వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. 1920-40 మందు హైదరాబాద్ నగరంలోని వేలాది మంది దళితులు ఇస్లాంలోకి వెళ్ళారు. అదే జరిగితే దేశంలోని ఇస్లాం జనాభా దాదాపు 35 నుంచి నలభై శాతానికి చేరుకునేది. ప్రస్తుతం సాగుతున్న మత విద్వేషాలు అటువంటి పరిస్థితిలో జనాభాను రెండుగా చీల్చేది. మనం ప్రస్తుతం చూస్తున్న పశ్చిమాసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మతాల మధ్య, తెగల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పరిస్థితి మన దేశం చవిచూసేది. ఇప్పుడు ఏ విషయాలో పడితే, ఆ విషయంలో రెచ్చిపోయి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదేమో.

అంతేకాకుండా ప్రజలందరికీ సంక్షేమం, ప్రజాస్వామ్య ఫలాలు అందించే ఒక గొప్ప రాజ్యాంగం అందించి, ఇక్కడ మనం క్షేమంగా ఉన్నాం, ఉంటాం అనే ఒక విశ్వాసాన్ని కలిగించిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్‌ది. అందువల్ల ప్రజల శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్య విధానంలో జీవనం సాగించడానికి అలవాటుపడ్డారు. సంక్షేమ రాజ్యాంగం కాకుండా, నియంతృత్వ రాజ్యాంగం తెచ్చి ఉంటే, ఒక కులానికి, మతానికి పెద్ద పీట వేసే రాజ్యాంగం వచ్చి ఉంటే ఈ దేశం అంతర్గత కలహాలతో నిత్యం తిరుగుబాట్లతో అల్లాడిపోయేది. ఈ రెండు కారణాల రీత్యా బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి, భారత జాతికి రక్షకుడు. ఆయనను అవహేళన చేయడమంటే, సూర్యుని మీద ఉమ్మేయడం లాంటిది.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News