Monday, December 23, 2024

అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్

- Advertisement -
- Advertisement -

Ambedkar was an unequal social reformer

బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న జన్మించారు. బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ రాంజీ మలోజీ సక్పాల్, భీమా బాయిల 14వ, ఆఖరి సంతానం. వీరిది మహార్ (దళిత) కులం. వీరి పూర్వీకులది నేటి మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా, మందన్గడ్ తాలూకా, ఆంబాడవే పట్టణం. నేటి మధ్యప్రదేశ్ లోని మ్హౌ డా.అంబేడ్కర్ నగర్ గా మారింది. బాబా సాహెబ్ మరాఠీ పదబందానికి నాన్నగారు అని అర్థం. అంబేడ్కర్ పాఠశాల గది బయట తన గోనె సంచిపై కూర్చోవాలి.

ఉన్నత కులస్థులు దోసిట్లో మంచినీళ్లు పోస్తే అంబేడ్కర్‌తో సహా దళిత విద్యార్థులు తాగాలి. అంబేడ్కర్ తండ్రి కొడుకు పేరులో కులాన్ని సూచించే ఇంటిపేరు సక్పాల్‌ను తొలగించి, ‘ఆంబడవే’ గ్రామవాసి అన్న అర్థంలో ఆంబడవేకర్ అని బడిలో ఇంటిపేరు మార్చారు. దేవరుఖే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు కృష్ణా జి కేశవ్ అంబేడ్కర్ ఈ ఇంటిపేరును తన ఇంటిపేరు ‘అంబేడ్కర్’గా మార్చారు. బ్రాహ్మణుల్లోనూబ్రాహ్మణత్వ వ్యతిరేకులున్నారు. వారి పేదరికం, కష్టాలు, సామాజిక దృష్టి వారికి పీడితజన పక్షపాత తాత్వికతను అందించాయి. మేధావుల్లో అస్పృశ్యతకు వ్యతిరేకంగా మాట్లాడనివారు, వివాదాంశం చేయనివారు లేరు. సంస్కరణ సంస్థలను బ్రాహ్మణేతరులే స్థాపించారు. దళిత ఉద్యమాలకు ఇది ప్రధాన ప్రారంభ ఉత్ప్రేరకం.

1881లో బ్రాహ్మణేతర మరాఠా సాయాజీరావు గైక్వాడ్ బరోడా రాజు అయారు. 1883లో అణగదొక్కబడ్డవారి కోసం 18 ప్రత్యేక ఉచిత పాఠశాలలు స్థాపించారు. పలకలు, పెన్సిళ్లు, పుస్తకాలు ఉచితంగా అందించారు. తప్పనిసరి ప్రాథమిక విద్య ప్రవేశపెట్టారు. అంబేడ్కర్ అమెరికా, పాశ్చాత్య చదువులకు మొదట సహాయం చేసిన వ్యక్తి సాయాజీరావు గైక్వాడ్. బ్రాహ్మణేతర కులస్తుడు కాబట్టి ఈయన సంస్కరణలు చేపట్టారు, సహాయాలు చేశారు. మరొక బ్రాహ్మణేతర కొల్హాపుర్ మహారాజు సాహు ఛత్రపతి అంబేడ్కర్‌కు లండన్ న్యాయశాస్త్ర చదువుకు సహాయపడ్డారు. ఈయన వెనుకబడ్డవారి విద్య కోసం కులానికి ఒకటి చొప్పున ‘తక్కువ’ కులాల వారికి, ముస్లింలకు, జైనులకు ఉచిత వసతి గృహాలు స్థాపించారు. నాటి బ్రాహ్మణ రాజులు ఎవ్వరూ విద్యా సంస్థలు ప్రారంభించలేదు.

అంబేడ్కర్ న్యాయశాస్త్రజ్ఞుడు, ఆర్థిక వేత్త, రాజనీతిజ్ఞుడు, సంస్కర్త. దళిత ఉద్యమాన్ని ప్రభావితం చేశారు. అస్పృశ్యత, సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేడ్కర్ బ్రిటిష్ భారతంలో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక మంత్రి. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖా మంత్రి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. రాజ్యాంగ ముఖ్య నిర్మాత. కొలంబియా, లండన్ విశ్వవిద్యాలయాల నుండి ఆర్థిక శాస్త్రంలో పరిశోధన పట్టాలు పొందిన రాజకీయ శాస్త్రజ్ఞుడు. స్వాతంత్య్ర ఉద్యమ ప్రచారంలో, చర్చల్లో పాల్గొన్నారు. స్త్రీల, దళితుల రాజకీయ స్వేచ్ఛ, రాజకీయ హక్కులను సమర్థిస్తూ, వాదిస్తూ విశేష కృషి చేశారు. అంబేడ్కర్ కుటుంబ పోషణకు అనేక వృత్తులు చేపట్టారు. బహుముఖ మేధావి అయినా దళిత దమన వివక్ష ఎదుర్కొన్నారు. బాంబే హైకోర్టులో వకీలుగా పని చేస్తూనే దళితుల విద్యావ్యాప్తికి, సామాజిక ఆర్థిక ప్రగతికి, ఉన్నతీకరణకు పని చేశారు. ఆ ఆశయ సాధనకు బహిష్కృత హితకారిణి సభ అన్న సంస్థను స్థాపించారు. దళిత హక్కుల రక్షణకు మూక నాయక్, బహిష్కృత భారత్, సమానత్వ జనం వంటి పత్రికలు నడిపారు.1927లో అస్పృశ్యతకు వ్యతిరేకంగా, అస్పృశ్యుల హక్కులు, తాగునీరు, దేవాలయ ప్రవేశం కోసం విస్తృత స్థాయి ఉద్యమాలు చేపట్టారు. సత్యాగ్రహం చేశారు. 1930లో కాలరాం దేవాలయ ఉద్యమం చేపట్టారు. నాసిక్ లో 15 వేల మందితో క్రమశిక్షణతో ఊరేగింపు తీశారు. ఊరేగింపు గుడి దగ్గరకు వచ్చే సరికి బ్రాహ్మణ వర్గాలు గుడి తలుపులు మూశాయి. కులవ్యవస్థను, అస్పృశ్యతను బోధించిన హిందుత్వ ఆదర్శాల మూల గ్రంథం మనుస్మృతిని ఖండించారు. 25.12.1927న దాన్ని కాల్చేశారు. అంబేడ్కర్లు, దళితులు డిసెంబర్ 25న మనుస్మృతి దహన దినం జరుపుకుంటారు.

1932లో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం అణగారిన వర్గాలకు (ఇండియా చట్టం- 1935లో, రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్ కులాలు, తరగతులుగా పేర్కొన్నారు.) ప్రత్యేక నియోజక వర్గాలు (కమ్యూనల్ అవార్డు) ప్రకటించింది. హిందూ సమాజాన్ని చీలుస్తాయన్న భయంతో గాంధీ వీటిని తీవ్రంగా వ్యతిరేకించారు. 25.09.1932న దళిత ప్రతినిధిగా అంబేడ్కర్‌కు, దళితేతర హిందూ ప్రతినిధిగా మదన్ మోహన్ మాలవీయాకు మధ్య పుణె ఒప్పందం పేరుతో అంగీకారం కుదిరింది. దీని ప్రకారం అణగారిన వర్గాలకు చట్టసభల్లో స్థానాలు కేటాయించారు. అణగారిన వర్గాలకు కమ్యూనల్ అవార్డు ప్రకారం 71 స్థానాలకు బదులు పుణె ఒప్పందం మేరకు 148 స్థానాలు లభించాయి. 1935లోఅంబేడ్కర్ భార్య రమాబాయి దీర్ఘ అనారోగ్యంతో మరణించారు. 15.04.1948లో తన ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ శారద కబీర్‌ను పెళ్ళాడారు. ఆమె సవితా అంబేడ్కర్ గా పేరు మార్చుకున్నారు. అంబేడ్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937 లోసెంట్రల్ ప్రావిన్స్ శాసనసభ ఎన్నికల్లో 13లో 11 రిజర్వుడ్ సీట్లు, 4లో 3 జనరల్ సీట్లు గెలిచారు. 15.05. 1936న కుల నిర్మూలన పుస్తకం ప్రచురించారు. గాంధీ ఆంగ్ల పత్రికల్లో కుల వ్యవస్థను వ్యతిరేకించేవారు.

గుజరాతీ పత్రికల్లో సమర్థించేవారు.బిబిసి ఇంటర్వ్యూలో అంబేడ్కర్, గాంధీ ద్వంద్వ వైఖరిని ఖండించారు. సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని, పాకిస్తాన్ ఏర్పాటును జిన్నా బలపర్చారు. అంబేడ్కర్ పాకిస్తాన్ ఏర్పాటును సమర్థిస్తూ పాకిస్తాన్ ఆలోచనలు అన్న 400 పేజీల పుస్తకం రాశారు. అంబేడ్కర్ 1946లో రాజ్యాంగ నిర్మాణ సభకు బాంబే నుండి ఎన్నికవ లేదు. ముస్లిం లీగ్ అధికారంలో ఉన్న బెంగాల్ నుండి ఎన్నికయారు. 1952 సాధారణ ఎన్నికల్లో, 1954 ఉప ఎన్నికల్లోనూ లోక్‌సభకు ఎన్నికకాలేదు. అంబేడ్కర్ కశ్మీర్ ప్రత్యేక హోదాను వ్యతిరేకించారు. సంఘ సంస్కరణలకు సహకరిస్తుందన్న అభిప్రాయంతో ఏకీకృత పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ఆమోదానికి సిఫారసు చేశారు.వారసత్వ, వివాహ చట్టాల్లోలింగ సమానతను కల్పించే హిందు కోడ్ బిల్లును అంబేడ్కర్ ప్రవేశపెట్టారు. దీన్ని పార్లమెంటు తిరస్కరించింది. నిరసనగా ఆయన 1951లో న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారు.

సామాజిక -రాజకీయ సంస్కర్తగా అంబేడ్కర్ ప్రభావం ఆధునిక భారతంపై గాఢంగా ఉంది. అంబేడ్కర్ నా ఆర్థిక శాస్త్రాల పితామహుడని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ కొనియాడారు. అంబేడ్కర్ తాత్వికతతో అనేక రాజకీయ పక్షాలు పుట్టాయి. సాహిత్యం వెలువడింది. కార్మిక సంఘాలు నిర్మించబడ్డాయి. బుద్ధిజం -కమ్యూనిజం వ్యాసంలో అంబేడ్కర్ కమ్యూనిజంపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆధిపత్యవర్గాల దోపిడీ పేదరికానికి, సామాన్య ప్రజల సమస్యలకు కారణమని విశ్లేషించారు.

ఆర్థిక దోపిడీ కంటే సాంస్కృతిక దోపిడీ అపాయకరమన్నారు. హింసతోనైనా కార్మికవర్గ విప్లవం సాధించాలన్న కమ్యూనిస్టు దృక్పథాన్ని, ఉత్పత్తి సాధనాలు రాజ్య నియంత్రణలో ఉండాలి, వ్యక్తిగత ఆస్తి ఉండరాదన్న మార్క్సిస్టు సిద్ధాంతాన్నీ తప్పుబట్టారు. రాజ్యరహిత ప్రజాతంత్రాన్ని అంగీకరించలేదు కాని వర్గరహిత సమాజాన్ని ఆమోదించారు. సిక్కు మతంలో చేరాలన్న అభిప్రాయం మార్చుకొని భార్యతో సహా 14.10. 1956న బుద్ధిజంలో చేరారు. 5 లక్షల మంది అంబేడ్కర్ మద్దతుదారులు బుద్ధిస్టులుగా మారారు. 1954 జూన్ అక్టోబర్లలో ఆరోగ్యం క్షీణించి అంబేడ్కర్ పక్కపైనే ఉన్నారు. 06.12.1956న తుది శ్వాస వదిలారు. భారత ప్రభుత్వం అంబేడ్కర్‌ను మరణానంతర భారత రత్న పురస్కారంతో సన్మానించింది. నేడు లాల్ నీల్ ఐక్యత అంబేడ్కర్ కు సరైన నివాళి కాగలదు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News