Monday, December 23, 2024

శివసేనతో అంబేద్కర్ మనవడి పార్టీ పొత్తు..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్‌కు చెందిన “వంచిత్ బహుజన్ అఘాడీ” (విబిఎ) పార్టీతో ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈమేరకు సోమవారం ఉభయ నేతలు తమ పొత్తును ప్రకటించారు. సోమవారం (జనవరి 23) శివసేన సంస్థాపకులు బాలా సాహెబ్ థాకరే జయంతి కూడా కావడం యాధృచ్ఛికంగా కలిసి వచ్చింది. ఈ సందర్భంగా సంయుక్త పాత్రికేయ సమావేశంలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ప్రబోధాంకర్‌గా పేరు గాంచిన తమ తాత కేశవ్ థాకరే, ప్రకాష్ అంబేద్కర్ తాత బీఆర్ అంబేద్కర్ ఇద్దరూ సహచరులని, ఒకరినొకరు ప్రశంసించుకుంటూ సామాజిక రుగ్మతలు, చెడు అలవాట్ల నిర్మూలనకు పోరాడేరని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజకీయాల్లో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని నిర్మూలించ వలసిన అవసరం ఉందని , నాటి నేతల వారసులమైన తాము , ప్రజలు దేశ ప్రయోజనాల రక్షణ కోసం ముందుకు రావాలని థాకరే పిలుపు నిచ్చారు. కేంద్రం లోను, రాష్ట్రం లోను అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా దేశం నిరంకుశత్వం వైపు మళ్లుతోందని విమర్శించారు. ధైర్యం ఉంటే మహారాష్ట్రలో వేగంగా అసెంబ్లీ ఎన్నికలు జరపాలని సవాలు విసిరారు. పొత్తు గురించి ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ విబిఎ, శివసేన (యుబిటి) పొత్తు కుదరడం రాజకీయ మార్పుకు నాంది అని పేర్కొన్నారు.

మహావికాస్ అఘాడీ (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి)లోని భాగస్వామ్య పార్టీలు తమతో కలిసి వస్తాయన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. తమ పొత్తులో చేరడానికి కాంగ్రెస్, లేదా ఎన్‌సిపి వ్యతిరేకంగా ఉన్నట్టు తాననుకోవడం లేదని థాకరే పేర్కొన్నారు. ముంబై, థానే తోసహా అనేక నగరాలకు మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో ఈ రెండు పార్టీల పొత్తు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది శివసేన రెండుగా చీలిపోయి, ఉద్ధవ్ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత మొదటిసారిగా బృహాన్ ముంబై మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. గత కొన్ని నెలలుగా శివసేన, విబిఎ పొత్తు గురించి ఉభయ నేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News