సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచనలు, పరిశోధనలు, ఉపన్యాసాలు, జీవిత చరిత్రకు సంబంధిత పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు. మంగళవారం ఆలిండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు వైద్యనాథ్‌లు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రాసిన, ముఖ్యమైన సందర్భాలలో చేసిన ఉపన్యాసాలు,ఆయన గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, గ్రంథాలు, సాహిత్యాన్ని మరింతగా ప్రచురించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంబేడ్కర్ 1927 లో స్వయంగా నెలకొల్పిన తమ సమతా సైనిక్ దళ్ కార్యాలయం కోసం హైదరాబాద్ నగరంలో ఒక భవనాన్ని కేటాయించాలని, రాష్ట్రంలో నిర్మాణంలో కమ్యూనిటీ హాళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని మంత్రిని కోరారు. సమతా సైనిక్ దళ్ ప్రముఖుల విజ్ఞప్తి పట్ల మంత్రి కొప్పుల సానుకూలంగా స్పందించారు. అంబేడ్కర్ కు సంబంధించిన సాహిత్యాన్ని ప్రచురింపజేసేందుకు సంపూర్ణ సహకారం అందజేస్తానని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేద్దామన్నారు. కార్యాలయం ఏర్పాటును తప్పక పరిశీలిస్తానని,కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజలందరికి గణతంత్ర శుభాకాంక్షలు: మంత్రి కొప్పుల
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలను మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జనవరి 26వ తేదీ భారతరత్న,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం అన్నారు. రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించిన చారిత్రాత్మక రోజు. అంబేడ్కర్ దేశానికి,అన్ని వర్గాల ప్రజల సముద్ధరణకు చేసిన సేవలు, కృషిని మరోసారి గుర్తు చేసుకుందాం, ప్రపంచానికి చాటి చెబుదాం.