Sunday, January 19, 2025

‘బినాకా గీత్ మాలా’ వ్యాఖ్యాత అమీన్ సయానీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అద్బుతమైన తన గొంతుతో, వ్యాఖ్యానంతో 60, 70 దశకాల్లో శ్రోతలను ఉర్రూతలూపిన అమీన్ సయానీ ఇక లేరు. తన 91వ పడిలో ఆయన ముంబయిలో కన్నుమూశారు. అమీన్ సయానీకి మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చిందనీ, సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ కన్నుమూశారని ఆయన తనయుడు రజిల్ సయానీ చెప్పారు.

అమీన్ సయానీ ముంబయిలో 1932 డిసెంబర్ 21న జన్మించారు. చిన్నప్పటినుంచే సంగీత, సాహిత్య రంగాలపై ఆసక్తి కనబరిచేవారు. తన తల్లి ‘రెహబార్’ పేరిట నిర్వహించే న్యూస్ లెటర్ లో ఆయన తన 13వ ఏట నుంచే వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆల్ ఇండియా రేడియో ముంబయి స్టేషన్ లో ఇంగ్లీషులో చిన్న పిల్లల కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టారు. అయితే రేడియో కార్యక్రమాలకు వ్యాఖ్యానం చెప్పే విషయంలో ఆయనకు మొదట్లో ఆటంకం ఎదురైంది. ఆయన మాట్లాడే హిందీ భాషలో గుజరాతీ యాస ఉందనే కారణంతో నిరాకరించారు.

1950వ దశకం ప్రారంభంలో అప్పటి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్ ఆలిండియా రేడియోలో హిందీ పాటల ప్రసారాన్ని నిషేధించారు. అదే సమయంలో కొలంబోనుంచి ప్రసారాలు మొదలుపెట్టిన రేడియో సిలోన్.. హిందీ పాటల ప్రసారాలను అందిపుచ్చుకుని అనతికాలంలోనే ప్రాచుర్యం పొందింది. రేడియో సిలోన్ ప్రారంభించిన ‘బినాకా గీత్ మాలా’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 1952లో అమీన్ సయానీకి అవకాశం లభించింది. మొదటి రెండు కార్యక్రమాలకే అమీన్ పేరు మారుమోగిపోయింది. ఆయన గొంతుతోపాటు, తడుముకోకుండా హిందీ పాటల గురించి, సినిమాల గురించి, నటీనటుల గురించి ఆయన చేసే వ్యాఖ్యానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసేది.

ఇక అప్పటినుంచీ అమీన్ వెనుదిరిగి చూసుకోలేదు. బినాకా గీత్ మాలా ఆ తర్వాత హిట్ పెరెడ్, సిబాకా గీత్ మాలా అనే పేర్లతో 1952 నుంచి 1994 వరకూ వరుసగా 42 ఏళ్ల పాటు కొనసాగడం ఓ రికార్డ్. ఈ కార్యక్రమాన్ని 2000-2001లోనూ, 2001-2003 మధ్యకాలంలోనూ కూడా నడిపారు. అమీన్ గొంతు వినేందుకే శ్రోతలు రేడియో చుట్టూ గుమికూడేవారంటే అతిశయోక్తి లేదు. ‘నమస్తే బెహనో ఔర్ భాయియో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహాహూ’ అంటూ ఆయన గొంతు రేడియోలో వినిపిస్తే చాలు, శ్రోతలు పులకించిపోయేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News