న్యూఢిల్లీ : ఐటిరూల్స్‌కు సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత వార్తా పత్రికల సంఘం(ఐఎన్‌ఎస్) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పిఐబి)కి చెందిన నిజనిర్థారణ విభాగం ద్వారా నకిలీ వార్తలుగా ప్రకటించిన వాటిని సామాజిక మాధ్యమాలు తమ వేదికల నుంచి తీసివేసేలా చేసేందుకు వీలుగా ఐటి రూల్స్ తీసుకువచ్చారు. దీనిపై ఐఎన్‌ఎస్ తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఇఐటివై)కు లేఖ పంపించింది. తాము సమాచార వ్యవస్థలో సరైన భాగస్వామ్యులమనే విషయాన్ని మరిచినట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఏ విధంగా నిజనిర్థారణ వ్యవస్థను లేదా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. తమతో సంప్రదింపుల ప్రక్రియ ద్వారా దీనిని ఏర్పాటు చేయాలని సూచించారు.
సమాచార వేదికలపై ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వార్తల్లో విశ్వసనీయత నిర్థారణ జరిగితే మంచిదే. ఈ క్రమంలో ఏర్పాటు అయ్యే విభాగం విషయంలో తమతో కూడా ఆలోచించాల్సి ఉందని తెలిపారు. పిఐబి నిర్వచనం ప్రకారం , పనితీరు క్రమంలో ఇది ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రగతి, చర్యల గురించి సమాచారం అందించే బాధ్యతలలో ఉంటుంది. సంబంధిత నిబంధనలు ఈ మేరకు రూపొందాయి. అయితే గత వారం కేంద్ర మంత్రిత్వశాఖ దీనికి సంబంధించి ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది. పిఐబి నకిలీవిగా తేల్చిన వార్తలను మీడియా తీసివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది వివాదాస్పదం అయింది. ప్రభుత్వం చట్టపరంగా పిఐబికి అధికారాన్ని సంక్రమింపచేయడం ఇతరత్రా పరిణామాలకు దారితీస్తుందని ఐఎన్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ సమాచార సంస్థగా పిఐబికి కేంద్రం తాను అనుకునే విధంగా అధికారాలు కట్టబెట్టవచ్చు. అయితే ఈ క్రమంలో మీడియా స్వేచ్ఛను హరింపచేసే లక్షణాలు వ్యక్తం కావడం తమకు ఆందోళనకరం అని తెలిపారు. ప్రభుత్వం తనకు అవసరం అయిన విషయంలో ఈ విధంగా చట్టపరంగా నిర్ణేత అయింది. ఇది తమ స్వేచ్ఛకు భంగకరం అవుతుందనేదే తమ ఆందోళన అని ఐఎన్‌ఎస్ తెలిపింది. పరోక్షంగా కేంద్రం పిఐబి ద్వారా విమర్శలను, సముచిత వార్తా వ్యాఖ్యానాలను కూడా అణచివేసేందుకు యత్నిస్తోందని తాము భావించాల్సి ఉంటుందని తెలిపారు. సవరణలను వెంటనే తొలిగించాలని ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్, డిజిపబ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ వంటి మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.