Wednesday, January 22, 2025

అన్నం పెడుతున్నవారిని హతమార్చారు… ఇజ్రాయెల్ పై అమెరికా, బ్రిటన్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

బాంబు దాడిలో ఏడుగురు అమాయకులు బలి…

తప్పు జరిగిపోయిందన్న ఇజ్రాయెల్

ఎప్పుడు ఏ బాంబు ఎటునుంచి వచ్చి మీద పడుతుందో తెలియదు… ఎప్పుడు ఏ తుపాకీ గుండు గుండెల్లోంచి దూసుకుపోతుందో తెలియదు. అలాంటి యుద్ధ క్షేత్రంలో పనిచేస్తూ, అన్నార్తుల ఆకలి తీరుస్తున్న స్వచ్ఛందసేవకులపై ఇజ్రాయెల్ క్షిపణి దాడితో విరుచుకుపడింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించారు. వీరంతా బ్రిటన్ కు చెందిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ అనే స్వచ్ఛంద సేవాసంస్థకు చెందిన కార్యకర్తలు. వీరిలో భారతీయ సంతతికి చెందిన ఓ పాలస్తీనా వ్యక్తి కూడా ఉన్నారు.

బ్రిటన్ కు చెందిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ కొంతకాలంగా గాజా ప్రాంతంలో ఆకలితో మలమలమాడుతున్న పౌరులకు ఆహారాన్ని సరఫరా చేస్తోంది. గాజాకు సముద్రమార్గం ద్వారా ఈ సంస్థ టన్నులకొద్దీ ఆహారాన్ని చేరవేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున డీర్ అల్ బలాహ్ అనే ప్రాంతంలో ట్రక్కుల్లోంచి సరకును అన్ లోడ్ చేస్తుండగా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఈ సంఘటనలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ కు చెందిన ఆరుగురు విదేశీ వ్యక్తులు, భారతీయ సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్ కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు బ్రిటన్ వాసులతోపాటు అమెరికా, పోలండ్, ఆస్ట్రేలియా, కెనడాకు చెందినవారు ఉన్నారు.

అమెరికా ఆగ్రహం

ఇజ్రాయెల్ దాడులతో తమ సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రకటించింది. బ్రిటన్ ఇందుకు మద్దతు పలికింది. ఇజ్రాయెల్ దాడి దారుణమని బ్రిటన్ అభివర్ణించింది. అమెరికా సైతం ఇజ్రాయెల్ తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల ప్రాణరక్షణకు ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోవట్లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. యుద్ధం కారణంగా అతలాకుతలమైన గాజాలో ఆకలితో మాడుతున్న ప్రజలకు ఆహారం అందజేస్తున్నవారిపై దాడి చేయడం క్షమార్హం కాదని ఆయన పేర్కొన్నారు.

ఘోర తప్పిదం జరిగింది: ఇజ్రాయెల్ ఒప్పుకోలు

ఇది తాము ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని, లక్ష్యాన్ని గుర్తించడంలో జరిగిన పొరబాటు వల్లే ఈ అనర్థం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. ఇది ఘోర తప్పిదమని ఆయన అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News