రష్యా భూతాన్ని చూపించి భయపెట్టి ఉక్రెయిన్ మెడలు వంచి అక్కడి ఖనిజసంపదను కొల్లగొట్టడానికి శాంతి చర్చల ముసుగులో అమెరికా చేసిన తొలి విడత భేటీ చివరకు బెడిసికొట్టింది. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఒక్కసారి ఉలికిపాటు కలిగించాయి. భేటీలో మొదట కొంతసేపు సామరస్యంగా సాగినా, భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ఒత్తిడి చేయడం అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు నచ్చలేదు. వారి దృష్టిలో పుతిన్ నియంతకాదని, జెలెన్‌స్కీయే నియంత అన్న అభిప్రాయం నాటుకుంది. తరువాత శాంతి చర్చలకు సంబంధించి తాము చేసిన ప్రతిపాదనలను అంగీకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ డిమాండ్ చేసిన తరువాతనే చర్చలు వేడెక్కడం ప్రారంభించాయి.
భేటీ మొదట్లో ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా కొనసాగిస్తామని, అయితే ఆయుధాల సరఫరా కన్నా యుద్ధాన్ని ముగింప చేయడానికి, ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికే ప్రయత్నిస్తున్నామని ట్రంప్ వెల్లడించినా భేటీ బెడిసికొట్టిన తరువాత ఆ ఆలోచనలు మారుతున్నట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అస్తిత్వానికి భంగం కలిగించే అమెరికా ఆంక్షలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడా రాజీపడలేదు. ఓవెల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు, మరో దేశాధ్యక్షుడి మధ్య జరిగిన అతిపెద్ద వాగ్వాదం ఇదే కావడం విశేషం. ఈ చర్చల తీరు పరిశీలిస్తే ఉక్రెయిన్, రష్యాల మధ్య వైరాన్ని మాపడానికి మధ్యవర్తిత్వం వహించే అగ్రరాజ్యం ఏకపక్షంగా రష్యాకే వత్తాసు పలుకుతూ ఉక్రెయిన్‌ను బెదిరించడం, హెచ్చరించడం కనిపించింది. అయితే ట్రంప్ హెచ్చరికలకు ఏమాత్రం బెదరకుండా జెలెన్ స్కీ గట్టిగానే సమాధానం ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ హంతకుడని, ఆయనతో రాజీపడే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ నిర్భయంగా చెప్పారు.
అయితే జెలెన్ స్కీ వాదనకు అవకాశం సరిగ్గా ఇవ్వలేదు. ఆయనపై ఎదురు దాడి కనిపించింది. ఉక్రెయిన్‌కు అమెరికా చేసిన సాయానికి కూడా కృతజ్ఞతలు చెప్పడం లేదని జెలెన్ స్కీపై అమెరికా నేతలు ఆక్షేపించారు. వాస్తవాలను పరిశీలిస్తే 2022 నుంచి రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా తమకు సాయం చేస్తున్నందుకు కనీసం 33 సార్లయినా అమెరికాకు, ఇదివరకటి అధ్యక్షుడు జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ట్రంప్ ప్రభుత్వం ఏదో ఒకసాకు చూపించి జెలెన్ స్కీని అవమానించడమే అన్నట్టు ఈ భేటీ సాగింది. భేటీ నుంచి మధ్యలోనే జెలెన్ స్కీ బయటకు వెళ్లిపోయారు.
అర్ధాంతరంగా భేటీ ముగిసాక జెలెన్ స్కీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ట్రంప్‌నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్, పుతిన్ మధ్య సంబంధం పైనా జెలెన్ స్కీ స్పందిస్తూ ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అమెరికా సాయం లేనిదే రష్యా సైన్యాలను ఢీకొనడం సాధ్యం కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ ట్రంప్ మాత్రం జెలెన్ స్కీపై వ్యతిరేక భావంతోనే ఉన్నారు. శాంతి చర్చలకు జెలెన్ స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనని, పైగా జెలెన్ స్కీ శాంతిని కోరుకోకుండా మరేదో ఆశిస్తున్నారని ట్రంప్ తెలిపారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని రష్యా ఎద్దేవా చేసింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్‌కు ఈ పరిణామం గట్టిదెబ్బ అని, జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందే అని దుయ్యబట్టింది. శుక్రవారం నాటి భేటీ తరువాత ఐరోపా దేశాల్లో ప్రకంపనలు కనిపించాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు తమ అండదండలను పునరుద్ఘాటించాయి.
ఐరోపా దేశాలకు, అమెరికాకు మధ్య కొనసాగుతున్న అట్లాంటిక్ కూటమి విషయంలో అమెరికా రష్యా మైత్రి వల్ల వివాదాస్పద పరిస్థితి ఏర్పడవచ్చని, అందుకనే ఐరోపా దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో సమైక్యంగా, పటిష్టంగా ఉండాలని ఐరోపా యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ కజా కల్లాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు స్వేచ్ఛా ప్రపంచానికి కొత్త నాయకత్వం అవసరమని ఆమె పిలుపునిచ్చారు. ఐరోపా యూనియన్ దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో భవితవ్యంపై చర్చించడానికి లండన్‌లో ఐరోపా దేశాల నాయకులు సమావేశం అవుతున్నారు. ఇదే విధంగా ప్రత్యేక ఐరోపా సదస్సు కూడా మార్చి 6న యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా నేతృత్వంలో ఏర్పాటవుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి భరోసా ఇస్తూ యూరోపియన్ నేతలు సందేశాలు పంపిస్తున్నారు.
‘మీరు ఒంటరివారు కాదు, మీ వెంట మేం ఉన్నాం’ అని పోలేండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ వెల్లడించారు. జర్మనీ, ఇటలీ, స్వీడన్, న్యూజిల్యాండ్ ఈ విధంగా ఐరోపా దేశాలన్నీ తమ ఎక్స్ ద్వారా సందేశాలు పంపించడం విశేషం. దీనికి జెలెన్ స్కీ స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా బైడెన్ ప్రభుత్వ కాలంలో ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థికసాయం అందించడానికి, అలాగే నౌకల ద్వారా ఆయుధాలను సరఫరా చేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఉక్రెయిన్ రాజకీయ విశ్లేషకులు వొలొడిమీర్ ఫెసెంకో తన అభిప్రాయం వెల్లడించడం గమనార్హం.