చైనా, జపాన్‌లకే ఎక్కువ రుణపడి ఉన్న అగ్రరాజ్యం
భారత్‌కూ 216 బిలియన్ డాలర్లు బకాయి
ప్రతి ఒక్కరిపై సగటున 72,309 డాలర్ల భారం
వెల్లడించిన ఆ దేశ చట్టసభ సభ్యుడు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయంటూ ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైగా అప్పుల్లో అధికశాతం ఆ దేశానికి అన్ని రంగాల్లో సవాలు విసురుతున్న చైనానుంచే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశానికి కూడా 216 బిలియన్ డాలర్లు రుణపడిఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. 2020నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయని మూనీ వెల్లడించారు. అంటే ఆ దేశంలో ఒక్కొక్కరిపైన సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నటు వివరించారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ప్రతి ఒక్కరికీ పంచితే తలా 10,000 డాలర్లు వస్తుందని తెలిపారు. పైగా అలా తెచ్చిన రుణాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయనే వివరాల్లో తప్పుడు సమాచారం ఉందని ఆరోపించారు. అమెరికాకు మిత్ర దేశాలు కాని చైనా, జపాన్‌లకే ఎక్కువ రుణపడి ఉన్నామని వ్యాఖ్యానించారు.
ఈ రెండు దేశాలు ఒక్కోదానికి ఒక ట్రిలియన్ డాలర్లకు (లక్ష కోట్ల డాలర్లకు) పైగా అమెరికా రుణపడి ఉందని తెలిపారు. రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన కరోనా ఉద్దీపన పథకాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి చట్టసభలో మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరవై ఏళ్ల క్రితం అంటే 2020లో కేవలం 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు ఒబామా హయాంలో రెండింతలైనట్లు మూనీ తెలిపారు. దీన్ని రోజురోజుకీ పెంచుకుంటూ పోతున్నామని, దీనివల్ల దేశ జిడిపిలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని వివరించారు. ఈ నేపథ్యంలో నూతన ఉద్దీపక ప్యాకేజిని అమోదించే ముందు ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మూనీ సహచర సభ్యులను కోరారు. ఈపథకంలోని నిధుల్లో చాలావరకు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లబోవని కూడా ఆయన ఆరోపించారు.