Sunday, December 22, 2024

ప్రగతిశీల ఓటు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకపోడంతో ఉభయ సభల్లో (ప్రతినిధుల సభ, సెనెట్) ఆధిక్యత ఎవరిదో ఇప్పటికీ స్పష్టపడలేదు. అరిజోనా, నెవడా రాష్ట్రాలలో భారీగా పోలైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఈ రెండింటి ఫలితాలు సెనెట్‌లో పాలక డెమొక్రాట్ల, ప్రతిపక్ష రిపబ్లికన్ల బలాబలాలను చెరి సగంగా సమానం చేస్తే వచ్చే నెల 6న జరగనున్న జార్జియా ఎన్నిక ఫలితం మెజారిటీని నిర్ణయిస్తుంది. అప్పటికీ రెండు పార్టీలు సమానంగా వస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటుతో సెనెట్‌లో ఆధిపత్యం డెమొక్రాట్ల సొంతమవుతుంది. ప్రస్తుతానికి అక్కడ అదనంగా ఒక స్థానాన్ని గెలుచుకొని డెమొక్రాట్లు తమ బలాన్ని 48కి పెంచుకోగలిగారు.

రిపబ్లికన్లు తమకున్న బలంలో ఒక సీటును కోల్పోయి 48 వద్ద నిలిచారు. ప్రతినిధుల సభలో మాత్రం రిపబ్లికన్లు 7 స్థానాలు అదనంగా తమ ఖాతాలో వేసుకొని 211 వద్ద వుండగా, 9 స్థానాలు కోల్పోయి డెమొక్రాట్లు 192 వద్ద నిలిచారు. అయితే రిపబ్లికన్ల సునామీ తథ్యమని ఎన్నికల ముందు వెలువడిన జోస్యం నిరూపణ కాలేదు. వారు అవలీలగా ఉభయ సభల్లో దూసుకుపోతారని అనుకొన్నది నెరవేరలేదు. ఇది వారి నాయకుడు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భవిష్యత్తుపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఆయన మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను దెబ్బ తీస్తుంది. అదే సమయంలో ఈ విజయాల ఊపుతో అధ్యక్షుడు జో బైడెన్ తాను మళ్ళీ పోటీ చేసే అవకాశాలున్నట్టు ప్రకటించడం గమనించవలసిన అంశం. సెనెట్‌లో పెన్సిల్వేనియా స్థానాన్ని రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు గుంజుకోడం ఊహించని పరిణామం.

అధ్యక్ష పదవీ కాలం సగం (రెండేళ్ళు) ముగిసే సరికి పార్లమెంటుకు జరిగే ఈ ఎన్నికలను మధ్యంతర ఎన్నికలుగా పరిగణిస్తారు. ఇందులో దిగువ సభ ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్ వంద సీట్లలో మూడో వంతు (35)కు ఎన్నికలు జరుగుతాయి. సెనెట్‌కు ఎన్నికైన వారు ఆరేళ్ళు పదవిలో వుంటారు. రాష్ట్రాల వారీగా ప్రతినిధుల సభ స్థానాల సంఖ్య ఆ రాష్ట్రం జనాభాపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా కాలిఫోర్నియాలో అత్యధిక స్థానాలు, మొంటానాలో అతి తక్కువ సీట్లూ వుంటాయి. అధ్యక్షుడు చేసే నియామకాలను ధ్రువపరిచే అధికారం సెనెట్‌కు వుంటుంది. అది రిపబ్లికన్ల ఆధీనంలో వుంటే అధ్యక్షుడు వారితో సఖ్యంగా మెసులుకోవలసి వుంటుంది. యుద్ధంలో ఉక్రెయిన్‌కు అవధులు మీరి సహాయం అందించడం, రష్యన్ ఆయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కారణంగా అమెరికాలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం మిన్నంటింది.

ఇది ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల అవకాశాలను తీవ్రంగా హరించి వుండవలసింది. కాని అలా జరగలేదు. అసలే బలహీన అధ్యక్షుడనిపించుకొన్న జో బైడెన్ ఈ ఎన్నికల్లో తన పార్టీ ఊహించనంతగా ఫలితాలను సాధిస్తుందని అనుకోలేదు. అలాగే రిపబ్లికన్లు దెబ్బతింటారని ఎవరూ ఊహించలేదు. ఫలితాలు రిపబ్లికన్ల నేత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి తీవ్ర నిరాశను కలిగించాయి. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకొన్న ఆయన సంకల్పాన్ని దెబ్బ తీసేలా వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మితవాద న్యాయమూర్తుల ఆధిక్యతలోని అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్ హక్కును నిషేధించడమేనని స్పష్టపడుతున్నది. ట్రంప్ హయాంలో సుప్రీంకోర్టుకు మితవాద న్యాయమూర్తుల నియామకం జరగడంతో అక్కడ వారిది పైచేయి అయింది. మతపరమైన ఛాందస భావాలు కలిగిన వారు తమకు ఓటు వేస్తారని రిపబ్లికన్లు ఆశించినప్పటికీ అబార్షన్ హక్కును హరించడాన్ని వ్యతిరేకిస్తున్న మహిళా ఓటర్లు డెమొక్రాట్లకు భారీగా ఓటు వేశారని బోధపడుతున్నది.

ఇది ప్రశంసించదగిన ప్రగతిశీల ఓటు అని చెప్పవచ్చు. అమెరికన్లలో మత ఛాందస వాదం వైపు మొగ్గు తగ్గడం ఒక మంచి పరిణామం. అబార్షన్ హక్కును నిషేధించడాన్ని దుయ్యబడుతూ రూపొందించిన వ్యాపార ప్రకటనలపై డెమొక్రాట్లు భారీగా ఖర్చు చేశారని తెలుస్తున్నది. అది వారికి ఫలించింది. ఫలితాల అస్పష్టత నేపథ్యంలో ఎందుకైనా మంచిదని జో బైడెన్ రిపబ్లికన్లతో సఖ్యతను కాపాడుకోవాలనుకొంటున్నాడు. కలిసి పని చేద్దామంటూ వారికి ఇప్పటికే సంకేతాలు పంపించారు. రిపబ్లికన్ల మెజారిటీ, యుద్ధం విషయంలో బైడెన్‌కు బ్రేకులు వేస్తుంది. ఉక్రెయిన్‌కు అదే పనిగా ఆయుధ సాయం కొనసాగించలేని పరిస్థితి కలిగిస్తుంది. అది అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెడుతుంది. యుద్ధానికి తెర పడే అవకాశాలను పెంచుతుంది. మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడికి అనుకూలంగా రావడం అరుదు. 2002 తర్వాత మళ్ళీ అది ఇప్పుడు జరుగుతున్నది. బైడెన్‌కు అనుకూల ఫలితం అనడం కంటే రిపబ్లికన్లు వస్తే అబార్షన్ హక్కు నిషేధం వంటి ప్రగతి నిరోధక నిర్ణయాలు మరిన్ని వెలువడగలవనే భయంతో వేసిన ఓటుగానే దీనిని పరిగణించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News