అమెరికా ఎగుమతులపై ఇతర దేశాలు విధించే దిగుమతి సుంకాలకు సమాన స్థాయిలో విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై మరోసారి గట్టి దాడి చేస్తోంది. ఇది న్యాయమైన చర్యగా ప్రచారం జరుగుతున్నప్పటికీ సరఫరా గొలుసులను భ్రష్టు పట్టించి వాణిజ్య యుద్ధాలను ప్రోత్సాహిస్తుంది. ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారం కలిగించే ప్రమాదం దీనిలో ఉంది. సంరక్షణ వాణిజ్య విధానాలు ట్రంప్ ఆర్థిక మోడల్‌కు ప్రాథమిక లక్షణంగా ఉండగా, పరస్పర టారిఫ్‌ల రూపంలో తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక జాతీయవాద వైఖరిని మరింతగా వ్యక్తపరుస్తోంది. దీని ప్రభావం వల్ల గ్లోబల్ వాణిజ్య సహకారాన్ని దెబ్బతీసి, అంతర్జాతీయ వాణిజ్యంలో కల్లోలం రేపనుంది. పరస్పర టారిఫ్‌లు అంటే ఒక దేశం అమెరికా ఉత్పత్తులపై ఎంత శాతం సుంకాన్ని విధిస్తే, అమెరికా కూడా ఆ దేశపు ఉత్పత్తులపై అదే స్థాయిలో టారిఫ్‌లను విధిస్తుంది. ఈ విధానం వాణిజ్యంలో సమానత్వాన్ని తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ దీని కంటే ఎంతో క్లిష్టమైనది. దేశాల టారిఫ్ నిర్మాణాలు చరిత్ర, ఆర్థిక పరిస్థితులు, వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా రూపొందించబడతాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాలు, తమ పరిశ్రమలను రక్షించుకోవడానికి అధిక టారిఫ్‌లను అమలు చేస్తాయి. అలా కాకుండా సమాన టారిఫ్ విధానం తప్పనిసరి చేస్తే ఈ దేశాల అభివృద్ధికి అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది.
ఈ టారిఫ్‌లు ఎలా లెక్కించబడతాయనేది మరొక ముఖ్యమైన అంశం. అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై విధించే సగటు సుంకాలను విశ్లేషించి, ఆ మేరకు అమెరికా టారిఫ్‌లను నిర్ణయించవచ్చు. అయితే, వాణిజ్యంలో కొన్ని రంగాలు అధిక పరిరక్షణకు గురవుతాయి. మరికొన్ని రంగాలు తక్కువ సుంకాలతో పనిచేస్తాయి. అందువల్ల పరస్పర టారిఫ్ విధానం మార్కెట్‌ను అస్థిరపరచవచ్చు. ఉదాహరణకు, భారత వ్యవసాయ రంగం అధిక దిగుమతి సుంకాలతో వ్యవసాయదారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వ రాయితీలతో ఉత్పత్తి చేయబడి తక్కువ ధరలకు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో పరస్పర టారిఫ్‌లు అమలు చేయడం భారతీయ రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేయవచ్చు.
మరోవైపు, అమెరికా టెక్నాలజీ, ఔషధ రంగాలకు ఎక్కువ సుంకాలు లేవు కాబట్టి, పరస్పర విధానం మితిమీరిన ప్రతిస్పందనగా మారే అవకాశం ఉంది. ట్రంప్‌కు పరస్పర టారిఫ్‌లు ఎందుకు అవసరమయ్యాయి? ఆయన ఎప్పటినుంచో వాణిజ్య లోటును అన్యాయ విధానంగా అభివర్ణిస్తూ వస్తున్నారు. చైనా, భారతదేశం లాంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తుండగా, అమెరికా తమ మార్కెట్లను వీరికి అందుబాటులో ఉంచుతోందని అతని వాదన. కానీ వాణిజ్య లోటు అనేది తప్పనిసరిగా చెడు సూచిక కాదని ప్రపంచ ఆర్థికవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇది వినియోగదారుల ఎంపికలు, ఉత్పత్తి సామర్థ్యం, కరెన్సీ మార్పిడి రేట్లు, పెట్టుబడి ప్రవాహాలు వంటి అంశాలను ప్రతిబింబించే అంశం. అమెరికా అనేక దశాబ్దాలుగా వాణిజ్యలోటుతో ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత బలమైన దేశంగా కొనసాగుతోంది. కానీ ట్రంప్, వాణిజ్య లోటును ప్రమాదంగా చిత్రీకరించి, తక్కువ ధరలకు దిగుమతులను అందిపుచ్చుకునే అమెరికా వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా మరిచిపోతున్నాడు.
పరస్పర టారిఫ్‌ల ప్రభావం భారతదేశంపై తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉంది. వాణిజ్యపరంగా భారతదేశం కొన్ని రంగాల్లో ముఖ్యంగా వస్త్ర, వాహన, వ్యవసాయ రంగాల్లో అధిక టారిఫ్‌లను అమలు చేస్తుంది. అమెరికా ఈ రంగాలపై ప్రతిస్పందనగా అధిక సుంకాలను విధిస్తే, భారతీయ ఉత్పత్తుల అమెరికా ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన ఉక్కు, అల్యూమినియం టారిఫ్‌లు భారతీయ కంపెనీలపై ప్రభావం చూపాయి. ఇక మరోసారి పరస్పర టారిఫ్‌లు అమలైతే, భారతీయ ఔషధ, ఐటి రంగాలు కూడా దెబ్బతినే అవకాశముంది. అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ఖర్చు పెరిగితే, ఎగుమతులు తగ్గి వేలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, వాణిజ్య సంబంధాలు బలహీనపడితే, భారతదేశం కొత్త మార్కెట్ల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. గ్లోబల్ వాణిజ్య వ్యవస్థను చూస్తే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరింత సంక్షోభాన్ని తీసుకురావచ్చు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన వ్యవస్థ. కానీ, ట్రంప్ విధానం మిగతా దేశాలను కూడా పరస్పర టారిఫ్‌ల వైపు నడిపిస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత పెరుగుతుంది. చైనా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు ఇప్పటికే ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిస్పందించిన అనుభవం ఉంది. ఈసారి కూడా అదే జరిగితే, వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామం అమెరికా గ్లోబల్ వాణిజ్య నాయకత్వాన్ని నెమ్మదిగా కోల్పోయేలా చేస్తోంది. పరస్పర టారిఫ్‌లు అమెరికా వాణిజ్యాన్ని సరళతరం చేస్తాయని ట్రంప్ భావించినప్పటికీ దీని వల్ల ఏర్పడే అంతర్జాతీయ ప్రభావాన్ని పూర్తిగా విస్మరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది తీవ్రమైన ఆర్థిక దెబ్బతీసే ప్రమాదం ఉంది. భారత్ లాంటి దేశాలకు, ఈ సంరక్షణ వాణిజ్య విధానాల నడుమ, అమెరికాతో వాణిజ్య సంబంధాలను నిర్వహించడం సవాలుగా మారనుంది. అమెరికా ఇలాంటి రక్షణాత్మక విధానాలను కొనసాగిస్తే దీని ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయగలదు, చివరికి ఎవరూ దీని నుంచి లాభపడే అవకాశం ఉండదు.
డా. కోలాహలం
రామ్ కిశోర్
98493 28496