Monday, January 20, 2025

సరికొత్త సమస్యల్లో అమెరికా

- Advertisement -
- Advertisement -

అమెరికాలో నిజమైన రాజకీయవేత్తల లేమితో పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకప్పుడు అబ్రహం లింకన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, ఇతర దార్శనికనేతలు ఉండేవారు. నేడు అలాంటివారు లేరు. నేటి రాజకీయులు వివిధ ప్రయోజనాల సంస్థలకు తోలుబొమ్మలు. బిడెన్ ఇందుకు మినహాయింపు కాదు. అమెరికాలో ఒకప్పుడు లోపాలను సరిదిద్ద గల స్వీయ వ్యవస్థ ఉండేది. ఇప్పుడది లేదు. అమెరికా సమస్యల్లో మళ్లీ దృఢత్వాన్ని ప్రదర్శించగలదా అనేది సమస్యలను ఎదుర్కోగలదా, వనరులను సమీకరించగలదా, ఆర్థిక సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించే శక్తిని ఉపయోగించగలదా, రాజకీయ అంతర్గత తగాదాలను, సామాజిక వైరుధ్యాలను అదుపు చేయగలదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అమెరికా దేశీయ, విదేశాంగ విధానాన్ని బట్టి, దాని స్వీయ -దిద్దుబాటు సామర్థ్యం తగ్గిందా, అమెరికా విఫలమైందా అనే అంశంపై విద్యావేత్తలు, ప్రజాభిప్రాయ వేదికల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ‘నేటి అమెరికాను ఎలా అర్థం చేసుకోవాలన్నది’ ఈ చర్చల ప్రశ్న. అమెరికా అగ్రరాజ్యం. అంతర్గత గందరగోళం లేనంతవరకు, బయటి సవాళ్ల నియంత్రణ అగ్రరాజ్యానికి కష్టంకాదు. అయితే అమెరికా నేడు అనేక తీవ్ర అంతర్గత వివాదాలతో సతమతమవుతోంది.

అమెరికా సామాజిక తరగతుల మధ్య విభేదాలను ఎదుర్కొంటోంది. ఈ పాత వైరుధ్యం ఇటీవల తీవ్రమయింది. 17 సెప్టెంబర్ 2011న ‘వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమించండి’ అన్న పేరుతో ఆర్థిక అసమానతలపై, రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై పెద్ద నిరసనోద్యమం రేగింది. 09 అక్టోబర్ 2011న 25 దేశాల ప్రధాన నగరాల కార్యకర్తలు ప్రపంచ వ్యాపిత నిరసనకు పిలుపిచ్చారు. అక్టోబర్ 15కు 82 దేశాల్లో 951 నగరాల్లో ఈ ఆందోళన వ్యాపించింది. (న్యూయార్క్ నగరంలో లొయ్యర్ మాన్హటన్ దక్షిణ ప్రాంతానికి ఆర్థిక జిల్లాగా పేరు. అందులో 8 భవన సముదాయాల వీధి వాల్‌స్ట్రీట్. అది అమెరికా ఆర్థిక మార్కెట్లకు పర్యాయపదం. ఇక్కడ పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్‌లు, ఆర్థిక సంస్థలు ఉన్నాయి. వేల ఉద్యోగులు పని చేస్తారు. అమెరికా ఆర్థికానికే కాక ప్రపంచ ఆర్థికవ్యవస్థకే ఇది వాణిజ్య కేంద్రం) వాల్‌స్ట్రీట్ ఉద్యమ నినాదం, మేము 99 శాతం. అమెరికాలో అత్యంత సంపన్నులైన 1 శాతం జనాభా, మిగిలిన ప్రజల మధ్య ఆదాయ- సంపదల అసమానతల సూచిక. విపరీత జనాదరణ పొందిన ఈ ఉద్యమం నవంబర్ 2011లో ముగిసింది. కానీ ఆర్థిక వైరుధ్యం కొనసాగింది.

రెండోది రాజకీయ సమీకరణ. మితవాదులు వామపక్షాల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు. గతంలో డెమోక్రాటిక్, రిపబ్లికన్ రెండు పార్టీల్లో బలమైన స్నేహపూర్వక శక్తులుండేవి. ఇప్పుడు ఈ శక్తులు క్షీణించాయి. డెమొక్రాటిక్ పార్టీలోని వామపక్ష శక్తులు గుర్తింపు రాజకీయాల్లో, ఇతరులకు ఉద్దేశాలను ఆపాదించటంలో మునిగిపోయాయి. బెర్నీ శాండర్స్ అమెరికా పార్లమెంటు చరిత్రలో దీర్ఘకాల స్వతంత్ర సభ్యుడు. ప్రజాస్వామిక సామ్యవాది. డెమొక్రాటిక్ పార్టీ సన్నిహిత సంబంధాలతో ఉమ్మడి ప్రగతిశీల లక్ష్య సాధనకు పోరాడాడు. కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి, సంక్షేమాలు, అంతర్జాతీయ సహకారాల సమర్థకుడు. ఆర్థిక అసమానతలు, సరళీకరణ విధానాల వ్యతిరేకి. అయినా 2016, 2020 ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ శాండర్స్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోలేదు. రిపబ్లికన్ పార్టీలో ప్రజాకర్షక మితవాద శక్తులు పైచేయి సాధించాయి. ఇరువర్గాల రాజీ కష్టతరంగా మారింది. అమెరికా ‘వీటో రాజకీయాల’ విష వృత్తంలో చిక్కుకుంది. పాలనా సామర్థ్యం కోల్పోయింది.

మూడవది జాతి వైరుధ్యాలు, నల్ల- శ్వేత జాతీయుల మధ్య ఉద్రిక్తతలు. 1950-60లలో పౌర హక్కుల ఉద్యమం తర్వాత, కాలక్రమేణా ఈ సమస్య ఉపశమించింది. అయితే ఆసియన్లపై పెరుగుతున్న వివక్ష వంటి మరిన్ని సంక్లిష్టతలతో ఇది మళ్లీ పెరుగుతోంది. 2020లో నల్లజాతీయ జార్జ్ ఫ్లాయిడ్ జాత్యహంకార పోలీసు హత్యను ప్రపంచం ఖండించింది. అమెరికా సమాజం నిరసించింది. ఆ తర్వాత కూడా శ్వేతజాతి ఉగ్రవాదం తగ్గలేదు. ఈ పాత సమస్యలు గాక అమెరికాకు కొత్త తలనొప్పులు కూడా ఉన్నాయి. నాల్గవది వాస్తవ, కాల్పనిక ఆర్థిక వ్యవస్థల మధ్య వైరుధ్యం.

అమెరికా వాస్తవ ఆర్థిక వ్యవస్థ కంటే అంతర్జాల ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు వేగంగా పెరగడంతో, పెట్టుబడిదారీ గుంపుల మధ్య విభేదాలు, వైరుధ్యాలు తలెత్తాయి. పాలకవర్గం, ఉన్నత వర్గాల మధ్య చీలికలు పెరిగాయి. డాలర్ ఆధిపత్యానికి గండిపడింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో డాలర్ మరింత క్షీణించింది. అమెరికాలో ముందెప్పుడూ ఇలా జరగలేదు. ఐదోది ప్రపంచవాదం, దేశీయత మధ్య వైరుధ్యం. అమెరికా తీరప్రాంతాల ప్రజలు, పెట్టుబడిదారులు ప్రపంచీకరణ అనుకూలురు. వారు బయటి ప్రపంచంతో బలమైన సంబంధాలతో ప్రపంచీకరణ నుండి ప్రయోజనాలు పొందారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు దేశీయతకు మద్దతు ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాంతీయ సంకుచితత్వాన్ని రెచ్చగొట్టి 2016 లో అధ్యక్షుడయ్యాడు.

పాత, కొత్త సమస్యలు రెండూ అమెరికాను మునుపెన్నడూ లేనంత క్లిష్టంగా మార్చాయి. అమెరికాలో నిజమైన రాజకీయవేత్తల లేమితో పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకప్పుడు అబ్రహం లింకన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, ఇతర దార్శనికనేతలు ఉండేవారు. నేడు అలాంటివారు లేరు. నేటి రాజకీయులు వివిధ ప్రయోజనాల సంస్థలకు తోలుబొమ్మలు. బిడెన్ ఇందుకు మినహాయింపు కాదు. అమెరికాలో ఒకప్పుడు లోపాలను సరిదిద్ద గల స్వీయ వ్యవస్థ ఉండేది. ఇప్పుడది లేదు. అమెరికా సమస్యల్లో మళ్లీ దృఢత్వాన్ని ప్రదర్శించగలదా అనేది సమస్యలను ఎదుర్కోగలదా, వనరులను సమీకరించగలదా, ఆర్థిక సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించే శక్తిని ఉపయోగించగలదా, రాజకీయ అంతర్గత తగాదాలను, సామాజిక వైరుధ్యాలను అదుపు చేయగలదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అమెరికా తన సమస్యలను ఎదుర్కొనేటట్లు కనిపించటం లేదు.

బిడెన్ ప్రభుత్వం ద్రవ్యోల్బణ పెరుగుదలకు రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణను, నిరుపాధి, ఆర్థిక సమస్యలకు చైనాను నిందిస్తోంది. తన వైఫల్యాలకు బలిపశువును వెతకడం, తన రోగాలకు ఇతరులను మందు తీసుకోమని బలవంతం చేయడం అమెరికా తర్కం. అమెరికా గతంలో ఉన్నంత బలంగా లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో పెర్ల్ నౌకాశ్రయంపై దాడి తర్వాత, అమెరికా గణనీయమైన సంఖ్యలో విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, యుద్ధ విమానాలను నిర్మించింది. ఇప్పుడు దాని కాల్పనిక ఆర్థిక వ్యవస్థ వాస్తవ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడంతో బలహీనపడింది. అమెరికా వృద్ధయోధ. దాని గతం అద్భుతం. కానీ లోపాలను సరిదిద్దుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో సాధారణ పిల్లిమొగ్గ ప్రాణాంతకం కాగలదు. అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే. అయితే పరిశీలకులు ఆ దేశాన్ని, అన్ని వైరుధ్యాలతో, కొత్త కోణంతో చూస్తున్నారు.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News