450 మిలియన్ డాలర్ల వ్యయంతో పాకిస్తాన్ ఎఫ్ 16 జెట్ యుద్ధ విమానాలను ఆధునికం చేయడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను సమకూర్చడానికి అమెరికా తీసుకున్న నిర్ణయం భారత భద్రతకు ముప్పు కలిగిస్తుందని వేరే చెప్పనక్కర లేదు. పాక్ ఏ నెపంతో ఎటువంటి ఆయుధాలను ఎక్కడి నుంచి సమకూర్చుకున్నా అవి ప్రాథమికంగా ఇండియా మీద ఎక్కుపెట్టడానికి ఉద్దేశించినవేనన్న సంగతి తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్ హయాంలో పాక్‌ను టెర్రరిస్టుల శిబిరంగా పరిగణించి దానికి ఎటువంటి సైనిక సహాయం చేయరాదని నిర్ణయించుకున్న అమెరికా బైడెన్ హయాంలో ఉన్నట్టుండి ఇటువంటి నిర్ణయం తీసుకోడం తీవ్రమైన మార్పే. తనతో గతం కంటే ఎంతో సన్నిహితంగా, విశ్వసించదగిన, ఆధారపడదగిన మిత్రుడుగా వుంటున్న భారత భద్రతకు కలిగే ముప్పును పట్టించుకోకుండా బైడెన్ పాకిస్తాన్‌కు ఈ ఆయుధ సహాయం చేయబోడం వెనుక చాలా కథ వున్నది.
అఫ్ఘానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని కాపాడుకోడానికి పాకిస్తాన్‌ను తిరిగి మచ్చిక చేసుకోడమే మార్గమని బైడెన్ ప్రభుత్వం భావించినట్టు అర్థమవుతున్నది. పాకిస్తాన్ వద్ద 85 ఎఫ్ 16 యుద్ధ విమానాలున్నాయి. దాని వద్ద గల మొత్తం 900 యుద్ధ విమానాల్లో ఇవి చాలా కీలకమైనవి. గగనతల లక్ష్యాన్ని ఛేదించడానికే కాకుండా ఆకాశం నుంచి భూతల లక్షాలపై దాడికి కూడా ఎఫ్16లు ఉపయోగపడతాయి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్ టెర్రరిస్టు శిక్షణా శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత్ యుద్ధ విమానాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత తన వద్ద గల ఎఫ్ 16 లను మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరాన్ని పాకిస్తాన్ గుర్తించిందని భావిస్తున్నారు.
అందుకోసం అది పెట్టుకున్న దరఖాస్తును ఇప్పుడు బయటకు తీసి అమెరికా ఆమోదించింది. అయితే అమెరికా తన నైజానికి విరుద్ధంగా ఏ ప్రతిఫలమూ లేకుండా పాకిస్తాన్‌కు ఈ సహాయం చేస్తున్నదని ఎంత మాత్రం అనుకోలేము. అఫ్ఘానిస్తాన్‌లో వుంటున్న అల్ ఖాయిదా టెర్రరిస్టు సంస్థ అధినేత అయమాన్ అల్ జవహరిని గత జులై 31న అమెరికా డ్రోన్ దాడితో హతమార్చిన విషయం తెలిసిందే. ఇందుకు తన గగనతలాన్ని ఉపయోగించుకోడానికి పాకిస్తాన్ అనుమతించిందని సమాచారం. అందుకు ప్రతిగా దాని ఎఫ్16ల ఆధునికీకరణకు అమెరికా తోడ్పడుతున్నదని తెలిసింది. అఫ్ఘానిస్తాన్‌లోని లక్షాలపై డ్రోన్ దాడులకు తన గగనతలాన్ని వైమానిక స్థావరాలను ఉపయోగించుకోడానికి పాకిస్తాన్ అనుమతిస్తున్నదని అఫ్గాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ గత నెలలో ఆరోపించారు.
అల్ జవహరి హత్య తర్వాతనే ఆయన ఈ ఆరోపణ చేశారు. ఇక ముందు కూడా అవసరాలకు పాక్ గగనతలాన్ని యధేచ్ఛగా ఉపయోగించుకోడానికి, అఫ్ఘానిస్తాన్‌పై తన పట్టు సడలకుండా చూసుకోడానికి అమెరికా ఇస్లామాబాద్‌ను దువ్వుతున్నది. గత వారం అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డోనాల్డ్ లు బృందం న్యూఢిల్లీకి వచ్చినప్పుడు వారితో చర్చల్లో మన రక్షణ అధికారులు పాక్ ఎఫ్16ల ఆధునికీకరణకు తోడ్పడటంపై తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. అయినా అమెరికా ధోరణిలో ఏ మాత్రం మార్పు రాదన్నది కాదనలేని కఠోర సత్యం. టెర్రరిజాన్ని అంతమొందించే లక్షంతోనే పాక్‌కు ఈ సహాయం చేస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది. చైనా వ్యతిరేక కూటమిలో చేర్చుకోడానికి భారత్‌తో స్నేహ సంబంధాలను పటిష్ఠం చేసుకుంటున్న అమెరికా దాని ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగించే రీతిలో పాక్‌కు ఈ సహాయం చేయబోడంలోని ద్వంద్వ వైఖరి ఖండించదగినది.
ఇండియా కూడా అమెరికాతో సన్నిహితంగా వ్యవహరిస్తూనే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో అమెరికా కూటమి సరసన చేరడానికి ఇండియా నిరాకరించింది. ఆ విధంగా రష్యాతో గల సత్సంబంధాలను కాపాడుకోడానికే ప్రాధాన్యమిచ్చింది. ఇండియాను ఒంటరిని కానివ్వబోమని చైనా నుంచి దానికి ఎటువంటి ముప్పు కలగనివ్వబోమని అమెరికా చెబుతున్నప్పటికీ దాని ప్రయోజనాల రీత్యా చైనాతో సఖ్యత అవసరమైతే అప్పుడు భారత దేశాన్ని వదిలిపెట్టడానికి కూడా అది వెనుకాడదు. రష్యాతో మనకు గల అత్యంత విశ్వసనీయమైన బంధాన్ని అమెరికా నుంచి ఆశించలేము. దానిని నమ్ముకొని చైనాతో ఢీ కొట్టడానికి తొందరపడవలసిన పని లేదు. చైనా కూడా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు రక్షణ సహాయం చేస్తున్న మాట వాస్తవం. అందుచేత ఆయా సందర్భాలను బట్టి సముచితమైన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోడమే మనకు ఉపయోగపడే విధానమవుతుంది. అన్నింటికీ మించి బలవంతమైన ఆర్థిక శక్తి కావడం మీద భారత్ దృష్టి పెట్టాలి.