Friday, February 21, 2025

అదానీపై అమెరికా దర్యాప్తు లేనట్టే!

- Advertisement -
- Advertisement -

అదానీ గ్రూపు కంపెనీ గ్రీన్ ఎనర్జీలో అక్రమంగా 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని గత ఏడాది నవంబరులో వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం ఆంధ్రా, ఒడిశా, తమిళనాడు, చత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అధికారులకు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ. 2100 కోట్లు లంచాలుగా ఇచ్చిందని ఈ అక్రమాలను గత ఏడాది నవంబరులో జో బైడెన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమెరికా న్యాయశాఖ గుర్తించింది. న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఈమేరకు అభియోగాలు మోపడంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, మరో ఏడుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సిపిఎ) ఉల్లంఘన జరిగినట్టు అమెరికా ఏజెన్సీలు ప్రకటించాయి. ఈ ఆరోపణలు రుజువైతే అదానీ గ్రూపులోని సంబంధిత నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుం ది. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక ఏ చట్టం కింద అదానీని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉందో ఆ చట్టం అమలునే డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. దీని వెనుక ట్రంప్‌తో మోడీకి ఉన్న మైత్రి కారణం కావచ్చని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సరిగ్గా ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరే ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ట్రంప్‌తో భేటీ సందర్భంగా అదానీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందా? అన్న ప్రశ్నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి వ్యక్తిగత స్థాయి అంశాలు చర్చించబోరని కూడా సమాధానం ఇచ్చారు. ‘భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం, వసుధైక కుటుంబం అనేది మా సంస్కృతి. ప్రపంచం మొత్తం మా కుటుంబం అనుకొంటాం. ప్రతి భారతీయుడిని మా వాడిగానే భావిస్తాం. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు’ అని అదానీ వ్యవహారంపై ఎటూ తేల్చకుండా తెలివిగా దాట వేశారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రధాని తన స్నేహితుడిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. మిత్రుడి జేబు నింపడం మోడీకి జాతి నిర్మాణం అవుతుంది.

అప్పుడు లంచాలు ఇవ్వడం, జాతి సంపదను దోచుకోవడం, వ్యక్తిగత అంశాలుగా మారిపోతాయి’ అని రాహుల్ ఎద్దేవా చేయడం ఈ సందర్భంగా గమనార్హం. మరోవైపు అదానీ స్కామ్ జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు బయటపడింది కాబట్టి, జో బైడెన్ పాలనంటే ఎప్పుడూ అగ్గిమీద గుగ్గిలం అయ్యే ట్రంప్ ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టే అవకాశం ఉంది. మరోవైపు అదానీపై జో బైడెన్ కార్యవర్గ వైఖరిని తప్పుపడుతూ ఆరుగురు చట్టసభ్యులు అటార్నీ జనరల్ పామ్‌బోండీకి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ గమనిస్తుంటే అదానీ గ్రూపు ఒక విధంగా దోషత్వం నుంచి పునీతులైనట్టు కనిపిస్తోంది. ఇక చట్టాల సంగతి ఎలా ఉన్నా పాలకుడు మనవాడైతే ఆ చట్టాలు చట్టుబండలుగా మారతాయనడానికి అదానీ వ్యవహారం ఒక ఉదాహరణ.

దీనికి సాక్షంగా అమెరికాలో విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సిపిఎ 1977) అమలును నిలిపివేయడం చెప్పుకోదగిన అంశం. ఇక భారత ప్రభుత్వం కూడా అదానీపై వల్లమాలిన అవ్యాజ ప్రేమను ఒలకబోస్తోంది. అదానీకి చెందిన సౌరవిద్యుత్ ప్రాజెక్టుకోసం సరిహద్దు భద్రతా నిబంధనలనే మార్చి వేసింది. భారతపాకిస్థాన్ సరిహద్దుకు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న గుజరాత్‌లోని ఖావ్‌డాలో అదానీ సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్లాంటునే 2020 లో ప్రధాని మోడీ ఆవిష్కరించడం మరో విశేషం. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం దేశసరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, రోడ్లు నిర్మించరాదు. కానీ అదానీ ప్రాజెక్టు విషయంలో ఈ నిబంధనలన్నీ అటకెక్కిపోయాయి. అదానీపై గతంలో కూడా స్టాక్ మార్కెట్‌ను మోసం చేసి, విదేశాల్లో నెలకొల్పిన డొల్లకంపెనీల ద్వారా తన డబ్బుతో తన షేర్లే కొని వాటి విలువను కృత్రిమంగా పెంచారని, ఆ విధంగా కుబేరుడయ్యారని అదానీ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ బయటపెట్టింది. ఈ నివేదిక వెలువడిన వెంటనే అదానీ గ్రూపు షేర్ల విలువ రూ. 19.2 లక్షల కోట్ల నుంచి రూ. 6.8 లక్షల కోట్లకు పడిపోయింది.

ఆమేరకు మదుపర్లు భారీగా నష్టపోయినా మార్కెట్ పర్యవేక్షక సంస్థ సెబి అదానీ గ్రూపు ఎలాంటి తప్పు చేయలేదని కితాబిచ్చింది. దీంతో సెబి నిర్ధారణను సుప్రీం కోర్టు ధ్రువపర్చడంతో అదానీ నిర్దోషిగా బయటపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీతో అదానీకి చాలా సన్నిహితం కొనసాగుతుండడం అదానీ వ్యవహారాలకు శ్రీరామరక్ష అన్న ఆరోపణలు బలంగా ఉంటున్నాయి. నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అదానీ విమానంలోనే తిరిగి గుజరాత్ వెళ్లారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మోడీ స్వయంగా సిఫారసు చేసి శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లో అదానీకి మేలు కలిగించే ప్రయోజనాలు కల్పించారని కూడా కథనాలు వెలువడ్డాయి.

అదానీ బొగ్గు స్కామ్‌ను కొన్ని నెలల క్రితం ప్రముఖ బిజినెస్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన వార్తా కథనం బయటపెట్టింది. ఇండోనేషియా నుంచి తక్కువ క్యాలరీలు కలిగిన నాసిరకం బొగ్గును కొనుగోలు చేసి ఎక్కువ క్యాలరీలు కలిగిన బొగ్గుగా నమ్మించి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టాన్‌జెడ్‌కో)కి అమ్మచూపడం ఈ బొగ్గుస్కామ్ అసలు బండారం. దీనిలో అదానీ సంస్థ మధ్యవర్తులకు 300 కోట్ల డాలర్లు ముట్టచెప్పినట్టు ఫైనాన్సియల్ టైమ్స్ ధ్రువీకరించింది. ఇలా ఎన్ని బయటపడినా అదానీకి ఏ దోషాలు అంటకపోవడం, కడిగిన ముత్యంలా బయటపడడం కేంద్రంలోని పెద్దల అండదండలే కారణం అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News