‘అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా?’ అని ఓ పాత సినిమా పాటొకటి ఉంది. అమెరికాలోని ఓ మహిళ విషయంలో నిజంగా ఇదే జరిగింది. 60 ఏళ్ల వయసులో ఆమెకి నిజంగానే 20 ఏళ్లు వచ్చాయి. ఇది 1980వ సంవత్సరమనీ, తాను గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలు రాశాననీ చెబుతోంది. నిజానికి ఆమె వయసు 60 ఏళ్లు. ఆమెకు భర్త, పిల్లలు, మనవలు కూడా ఉన్నారు. గతాన్ని మరచిపోయి, తానింకా టీనేజీ యువతినేనని అంటున్న ఆమెను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.
అమెరికాలోని లూసియానాకు చెందిన కిమ్ డొనికోలా అనే మహిళ జ్ఞాపక శక్తి దెబ్బతింది. 2018లో ఆమెకు అకస్మాత్తుగా తలనొప్పి వచ్చింది. దానికితోడు కళ్లు మసకబారడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయింది. చికిత్స పూర్తయ్యాక డొనికోలా కోలుకున్నట్టు కనిపించినా, తనకు భర్త, పిల్లలు ఉన్నారనీ, తన వయసు 60 ఏళ్లని మరచిపోయింది. తానింకా టీనేజీలో ఉన్నట్లు భావిస్తోంది. ఇది ఏ సంవత్సరం అని అడిగితే 1980 అనీ, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అనీ చెబుతోంది. డొనికోలాకు ప్రస్తుత విషయాలేవీ గుర్తుకు రావట్లేదు. తన భర్తను, పిల్లలను కూడా ఆమె గుర్తు పట్టట్లేదు.
డాక్టర్లు ఆమెకు మళ్లీ కొన్ని పరీక్షలు జరిపి, డొనికోలా… ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నేషియా అనే వ్యాధికి గురైనట్లు తెలిపారు. ఇది ఒక రకమైన మతిమరపు జబ్బు. భవిష్యత్తులో ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి పొందే అవకాశం ఉండకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.