Thursday, December 5, 2024

ట్రంప్ దూకుడు మళ్లీ మొదలు!

- Advertisement -
- Advertisement -

సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్, ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే తన దూకుడుతనాన్ని, దుందుడుకు స్వభావాన్నీ ప్రదర్శిస్తున్నారు. ఆయన అధికార పగ్గాలు స్వీకరించడానికి ఇంకా నెలా పదిహేను రోజుల సమయం ఉంది. అప్పటి దాకా ఓపిక పట్టలేకపోతున్న ట్రంప్, రోజుకో వివాదాస్పద ప్రకటన చేస్తూ, వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిగానే కాదు, వ్యక్తిగానూ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఒక పోర్న్ నటితో అక్రమ సంబంధం నెరిపారని ఆయనపై అభియోగాలు వచ్చాయి. వీటిలో కొన్ని న్యాయస్థానాలలో రుజువయ్యాయి కూడా.

అయినా ట్రంప్‌ను ఎన్నుకోవడంలో అమెరికన్లకు ఇవేవీ అడ్డురాలేదు. ప్రజలు తననుంచి ఏం ఆశిస్తున్నారో స్పష్టమైన నేపథ్యంలో జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసి ఉండగా ఈలోగానే ట్రంప్ తన నిర్ణయాలను అమలు చేయడం మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే చైనా, మెక్సికో, కెనడాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్త సుంకాలను విధిస్తానంటూ ప్రకటించి, తనదైన తెంపరితనాన్ని ప్రదర్శించారు. అమెరికాలో వేలాది మంది మరణానికి కారణమవుతున్న ఫెంటానిల్ డ్రగ్‌ను ఆయా దేశాలు అక్రమంగా తమ దేశంలోకి డంప్ చేస్తున్నాయనే అక్కసుతో ట్రంప్ చేసిన ఈ హెచ్చరికను సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. కానీ సుంకాలు విధించడం సమస్యకు పరిష్కారం అనిపించుకోదు. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై చైనా అండ్ కో కూడా సుంకాలు విధిస్తాయన్న సంగతిని ట్రంప్ విస్మరించడమే విచిత్రం. తాజాగా హమాస్ ఉగ్రవాద సంస్థకు ఆయన చేసిన హెచ్చరిక కూడా ఈ కోవకు చెందినదే. జనవరి 20న తాను బాధ్యతలు స్వీకరించేలోగా బందీలను విడచిపెట్టకపోతే నరకం చూపిస్తానంటూ ఆయన చేసిన హెచ్చరిక పిల్లి శాపానికి ఉట్టి తెగదనే సామెతను గుర్తుకు తెస్తోంది. పద్నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి తెరదించేందుకు బైడెన్ నాయకత్వంలోని అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు చేస్తున్న సంధి ప్రయత్నాలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.

ఉగ్రవాదుల ఏరివేత పేరిట అటు గాజా, ఇటు లెబనాన్‌పై దాడులకు తెగబడుతూ వేలాది అమాయక జనం ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌ను ఒక్క మాట అనకుండా హమాస్‌కు మాత్రమే హెచ్చరికలు జారీ చేయడంలో ట్రంప్ ఏకపక్ష వైఖరి అర్థమవుతోంది. తాను హెచ్చరించినంత మాత్రాన హమాస్ ఉగ్రవాదులు భయపడిపోయి బందీలను వదిలిపెడతారనుకోవడం భ్రమ మాత్రమే. బ్రిక్స్ దేశాలపైనా ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. రష్యాలోని కజాన్ వేదికగా రెండు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన నేపథ్యంలో ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై బ్రిక్స్ సభ్యత్వ దేశాలు దృష్టి సారించాలంటూ రష్యా అధినేత ఇచ్చిన పిలుపు ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. డాలర్‌ను కాదని బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించాలనుకుంటే ఆయా దేశాలపై వంద శాతం సుంకం విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్ పిలుపునిచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడే బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తాయనుకోవడం హాస్యాస్పదం. బ్రిక్స్‌లో సభ్యత్వ దేశాలుగా ఉన్న చైనా- భారత్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఈ రెండింటి మధ్యా వ్యూహాత్మకంగా ఎన్నో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కరెన్సీకి ఒకే తాటిపైకి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవు. పైపెచ్చు అమెరికా -భారత్‌ల మధ్య పటిష్టమైన స్నేహ సంబంధాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉమ్మడి కరెన్సీకి తలొగ్గి, అగ్రరాజ్యంతో భారత్ ఏరికోరి విభేదాలు కొనితెచ్చుకుంటుందనుకోవడం అవివేకం. మరొక విషయం ఏమంటే బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించుకుంటే చైనా, రష్యాల ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది భారత్‌కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాబోదు.

ఇవన్నీ గమనించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా లేడికి లేచిందే పరుగన్నట్లు ఏది తోస్తే అది మాట్లాడటం అగ్రరాజ్యం అధ్యక్షుడికి శోభించదనే విషయాన్ని గుర్తెరగాలి. ముందూవెనకా ఆలోచించకుండా మాట్లాడటం వల్ల ఆయన చేతల మనిషిగా కాక, మాటల మనిషిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అధ్యక్ష హోదాలో తాను తీసుకునే నిర్ణయాలు కేవలం అమెరికాకే కాకుండా, పరోక్షంగా అనేక దేశాలను ప్రభావితం చేస్తాయనే వివేచనతో ముందడుగు వేస్తే, అమెరికాకే కాకుండా ప్రపంచదేశాలకు కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News