Wednesday, December 25, 2024

హోరాహోరీ సమరం

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మునుపెన్నడూ లేనంతగా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోరు ఒక్కటే ఈ ఉత్కంఠకు కారణం కాదు. ఎన్నికలు చివరి దశకు చేరుతున్న ప్రస్తుత తరుణంలో డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరిలోంచి తప్పుకోవడం, ఆ స్థానంలోకి భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ రావడం ఈ ఉత్కంఠకు ప్రధాన కారణం. ట్రంప్ కు ఇక తిరుగులేదని, ఆయన ఎన్నిక నల్లేరుపై నడకేనని అందరూ భావిస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం డెమోక్రట్లలో కొత్త ఉత్సాహం నింపగా, రిపబ్లికన్లను కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇప్పటివరకూ జరిగిన పరిణామాలనుబట్టి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్ ట్రంప్ దే పైచేయిగా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. జో బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన తొలి ఎన్నికల డిబేట్ లో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ ఒకటొకటిగా అస్త్రాలు సంధిస్తుంటే, బైడెన్ వాటిని దీటుగా ఎదుర్కోవడం కాదు కదా, మాట్లాడేందుకు పదాలు సైతం దొరక్క తత్తరపడటం టీవీ చానళ్లముందు కూర్చున్న కోట్లాదిమందిని అవాక్కయ్యేలా చేసింది. ఆమాటకొస్తే, అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్ల సాంప్రదాయం మొదలైన గత ఆరవై అయిదేళ్ల చరిత్రలో ఒక అభ్యర్థి ఇంతలా బెంబేలెత్తిపోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ట్రంప్ ఆధిక్యానికి ఇక్కడ తొలి బీజం ప డగా, ఆయనపై జరిగిన హత్యాయత్నంతో సానుభూతి పవనాలు ఉధృతంగా వీయడం మొదలైంది. ఇక ఉపాధ్యక్ష అభ్యర్థిగా సెనేటర్ జెడి వాన్స్‌ను ఎంచుకోవడం కూడా ట్రంప్ కు కలిసివస్తుందని రాజకీయ పరిశీలకులు భావించారు.

వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో అమెరికాలో లక్షల సం ఖ్యలో ఉన్న ఆసియావాసుల ఓట్లను కొల్లగొట్టేందుకే వాన్స్ ను ట్రంప్ ఎంచుకున్నారనేది సుస్పష్టం. అయితే ఇప్పుడు భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఏకంగా అధ్యక్ష పదవికి బరిలోకి రావడంతో ఆసియావాసుల మద్దతు ఆమెవైపు మళ్లుతుందని చెప్పవచ్చు. ఒకవైపు, అమెరికాలో కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామాలు మిత్రదేశాలకు కలవరం కలిగిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నిక ఆ దేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ దేశాల రాజకీయాలపైన, స్థితిగతులపైనా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండు ప్రధానమైన యుద్ధాలు కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరనే విషయంపై ఆధారపడి ఉన్నాయి.

హమాస్ తో సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ కూ, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కూ అమెరికా సహాయ సహకారాలు అందిస్తోంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్ ట్రంప్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇప్పటిలా ఉండకపోవచ్చు. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాలతో అమెరికా ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరిలో ఏమాత్రం తేడా వచ్చినా అది మిత్రదేశాలపై పెను ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ గెలిస్తే ఇండియా, చైనా తదితర దేశాలనుంచి అమెరికాకు వచ్చే వారిపట్ల, హెచ్1బి వీసాల జారీలోనూ అమెరికా వైఖరి మారిపోవచ్చు. దానికితోడు ట్రంప్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గతంలో అధ్యక్ష పదవికి పోటీ పడిన ఏ అభ్యర్థిపైనా లేనన్ని అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. చివరకు ఓ శృంగారతారతో నడిపిన ప్రేమాయణం కూడా ఆయన పరువును రచ్చకీడ్చింది.

అయినప్పటికీ, వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్న బైడెన్ తో పోల్చి చూసుకున్నప్పుడు ట్రంప్ కాస్త నయమని అమెరికన్లు భావించారు. ఇప్పుడు కమలా హ్యారిస్ రంగంలోకి దిగడంతో ప్రజాస్వామిక విలువలకు పట్టం గట్టే ఓటర్లకు ధైర్యం వచ్చింది. గతంలో ప్రాసిక్యూటర్ గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేసిన కాలంలో కమలా హ్యారిస్ మత్తుమందుల సరఫరాదారుల ఆటకట్టించడంలోనూ, మహిళా హక్కులకోసం పోరాడటంలోనూ ముందున్నారు. బైడెన్ తో పోలిస్తే ఆమె చక్కటి వాగ్ధాటి కలిగిన వ్యక్తి కూడా. సెనేటర్ గా, అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ రాజకీయాల్లో విశేషమైన అనుభవం గడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడింది. ట్రంప్ తనపై జరిగిన హత్యాయత్నాన్ని సానుభూతిగా మలచుకునే ఓట్లు పొందాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన ఎత్తుల్ని హ్యారిస్ ఎలా చిత్తు చేస్తారో వేచి చూడాలి. రానున్న ఎన్నికల్లో ఆమె గెలిస్తే, అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా మాత్రమే కాదు, ఆ పదవిని అధిష్ఠించిన భారతీయ మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News