Tuesday, September 17, 2024

వినదగు నెవ్వరు చెప్పిన..!

- Advertisement -
- Advertisement -

America responded to the Farmers movement

 

ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ రైతు ఉద్యమంపై అమెరికా మొదటిసారిగా మొన్న గురువారం నాడు పెదవి విప్పింది. దీనికి సంబంధించి మన మీడియా ఇచ్చిన సమాచారంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు అమెరికా మద్దతు తెలిపిందనే అంశానికే ఎక్కువ ప్రచారం లభించింది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛకు శాంతియుత నిరసన ప్రదర్శనలకు ఆ ప్రకటనలో అమెరికా ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందనే విషయం మరుగునపడిపోయింది. భారత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి చేసిన ఈ ప్రకటన సమాచార స్వేచ్ఛను, ఇంటర్‌నెట్‌ను కాపాడవలసిన అవసరాన్ని కూడా మన ప్రభుత్వానికి గుర్తు చేసింది. అలాగే నిరసన ఉద్యమం నడుపుతున్న రైతులతో చర్చలు జరిపి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని సూచించింది. పనిలో పనిగా మాత్రమే ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యవసాయ సంస్కరణలను ఆహ్వానించింది. ఆ చట్టాల లోతులకు పోకుండా ప్రైవేటు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించి భారతీయ మార్కెట్ల సామర్థాన్ని పెంచే నిర్ణయాలను అమెరికా ఎప్పుడూ స్వాగతిస్తుందని మాత్రం పేర్కొన్నది.

శాంతియుత ప్రదర్శనల్లో జోక్యం చేసుకోబోనని, నిరసన తెలపడం ప్రజల హక్కని మన సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా అమెరికా తన ప్రకటనలో ప్రస్తావించింది. రైతుల ‘అత్యంత సవ్యమైన ’ నిరసనను కొనసాగించే రాజ్యాంగపరమైన హక్కు వారికి ఉన్నదని గత డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి ప్రదర్శనలో జోక్యం చేసుకోబోమని కూడా చెప్పింది. నిరసన తెలియజేయడం ప్రాథమిక హక్కులలో భాగమని దానిని శాంతియుతంగా నిర్వహించాలని అభిప్రాయపడింది. వేలాది మంది రైతులు దేశ రాజధాని సరిహద్దులలో నవంబర్ లో చేపట్టిన ప్రదర్శన అనేక రోజులుగా ప్రశాంతంగా సాగుతూ వచ్చినందునే సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. వాస్తవానికి మొన్న గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట ఘటన జరిగినంత వరకు ఆ ప్రశాంతత నిర్విఘ్నంగానూ, ప్రశంసాయుతంగానూ కొనసాగింది.

ఆ రోజు ఎర్రకోట మీద సిక్కు మత జెండా ఎగుర వేసిన ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆ పరిణామం పట్ల రైతు నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా వారు మరింత సంఘటితమై ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే వారిని హింసలోకి దించే విధమైన కవ్వింపు చర్యలకు బయటి శక్తులే పాల్పడ్డాయి. ఇంటర్‌నెట్‌ను నిలిపివేయడం, రోడ్ల మీద కందకాలు తవ్వి మేకులు దించడం వంటి పనులకు పోలీసులే పాల్పడ్డారు. స్థానికులనే పేరుతో రంగ ప్రవేశం చేసిన వారు కూడా రైతు ఉద్యమకారుల శిబిరాలను తొలగించి వారిపై భౌతిక దాడులకు తలపడ్డారు. అంతేగాని రైతులు శాంతియుత ఆందోళనకు స్వస్తి చెప్పి తమంత తాముగా హింసకు దిగినట్టు ఎక్కడా సమాచారం లేదు. కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యాప్తిని అడ్డుకునే పేరుతో ఇంటర్‌నెట్, మొబైల్ సేవలను చాలా కాలం ప్రభుత్వం నిలిపివేసింది.

ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు ఉద్యమ ప్రాంతాల్లో కూడా ఇంటర్‌నెట్‌ను ఆపివేశారంటే అక్కడ ఉగ్రవాదుల హస్తముందని ప్రభుత్వం భావిస్తున్నదా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఈ చర్యలన్నీ ప్రభుత్వం ఆశించినట్టు రైతు ఉద్యమాన్ని ఆపలేకపోయాయి, దాని ఉధృతిని తగ్గించలేకపోయాయి. తాజాగా శనివారం నాడు దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన రాస్తారోకో ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. కేంద్రం చెబుతున్నట్టు ఉద్యమం ఒకటి, రెండు రాష్ట్రాలకు చెందిన కొద్ది పాటి రైతు గ్రూపులకే పరిమితం కాదని చాటింది. దేశంలో మెజారిటీ ప్రజలు రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచారని పదేపదే రుజువవుతున్నది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉద్యమానికి మద్దతు పెరుగుతున్నది.

సుప్రసిద్ధ పాప్ గాయని రిహన్నా, పర్యావరణ యోధురాలు గ్రెటా థన్‌బర్గ్, కమలా హారీస్ దగ్గరి బంధువు మీనా హారీస్‌లే కాకుండా అమెరికా, బ్రిటన్‌లకు చెందిన పెక్కు మంది సెలబ్రిటీలు రైతు ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలిపారు. ఇది మన ఆంతరంగిక వ్యవహారమని ఇందులో జోక్యం తగదని మన ప్రభుత్వం ఎంతగా గొంతు చించుకున్నా ఒకసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తర్వాత దానిని ఎవరూ ఆపలేరు. ఉద్యమం ఇంకా ఇలాగే కొనసాగితే మన పాలకులు ప్రజాస్వామిక మార్గాలకు స్వస్తి చెప్పినందు వల్లనే అలా జరుగుతున్నదనే అభిప్రాయం ప్రపంచానికి మరింతగా కలుగుతుంది. అటువంటి పరిస్థితి దాపురించకుండా అమెరికా చెప్పినట్టు ఇంకా చాలా మంది వ్యక్తులు, శక్తులు ఆశిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రభుత్వం తన రాజీలేని వైఖరిని విడనాడుకొని రైతులతో ఫలవంతమైన చర్చలకు చొరవ చూపాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News