Tuesday, February 11, 2025

అక్రమ వలసదారుల్ని వెనక్కు పంపలేరా?

- Advertisement -
- Advertisement -

అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపి వారిని వెనక్కు పంపుతుంటే భారత్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. దేశం లోకి చొరబడిన అక్రమవలసదారులను వెనక్కు పంపకుండా కాలయాపన చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం అసోం ప్రభుత్వంపై ఇటీవల ఆగ్రహించడం గమనార్హం. వారిని పంపించడానికి ముహూర్తం కోసం చూస్తున్నారా అని వ్యాఖ్యానించింది. ‘వారి దేశం ఏదో మీకు తెలుసు. వారి చిరునామా ఏదో తెలిసేవరకు మీరు ఎలా వేచి ఉంటారు? వారు ఎక్కడికి వెళ్లాలో ఆ దేశం నిర్ణయించుకుంటుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారిని వెనక్కు పంపే విషయంలో విదేశాంగ మంత్రిత్వశాఖ సహాయం కోరుతూ ఎందుకు ప్రతిపాదనను సమర్పించలేదని నిలదీసింది.

అక్రమవలసదారులను వెనక్కు పంపడంలో అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికాలో వీసా గడువు ముగిసిన వారు, అక్రమ వలసదారులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అటువంటివారిలో 18,000 మంది భారతీయులున్నారని అమెరికా ప్రభుత్వం గుర్తించి వెనక్కు పంపడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మన దేశంలో అక్రమ చొరబాటుదారులుగా గుర్తించిన వారిని వెంటనే వెనక్కు పంపకుండా తీరని జాప్యం చేస్తున్న అసోం ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన పశ్చిమబెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఉన్న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమవలసదారులను వెనక్కు పంపడం లేదు.

ఎందుకనో వీరికి ఓటరు గుర్తింపు కార్డుతో సహా మిగతా ప్రయోజనాలన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతుండడంలో రాజకీయ మతలబు ఏదో ఉందని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థానిక ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని, మతోన్మాదంతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికుల నుంచి ఆందోళనలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించి కేంద్ర ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)ని తీసుకు వచ్చి అక్రమ చొరబాటుదారులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. అలా గుర్తించిన వారిని వెనక్కు పంపే ప్రయత్నంలో డిటెన్షన్ సెంటర్లలో చేర్చింది. అలాంటి గుర్తించిన 63 మందిని వెనక్కు పంపకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి ఒక వ్యక్తిని అక్రమ చొరబాటుదారుగా గుర్తించాక, వెనక్కు పంపించాల్సిందే. ఆర్టికల్ 21 ప్రకారం సుదీర్ఘకాలం డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధించి ఉంచడం చెల్లదు. అందుకనే రెండు వారాల్లో వారిని తిరిగి వెనక్కు పంపేయాలని, అలా పంపించినట్టు అఫిడవిట్ సమర్పించాలని అసోం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అయితే అసోం సీనియర్ అధికారి వర్గాలు ఈ విషయంలో తామే నిర్ణయం తీసుకోలేమని, వారిని వెనక్కు పంపాలన్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి తప్ప అసోం రాష్ట్రం స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కులేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసామని, మళ్లీ దీనిపై రాస్తామని అసోం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే అక్రమవలసదారులను వెనక్కి పంపే ప్రక్రియను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) చేపట్టవలసి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం.. ఎవరినైతే తిరిగి వెనక్కుపంపించడానికి మనం సిద్ధమవుతామో, వారిని చేర్చుకోడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుంది. దేశంలోనే భారీ డిటెన్షన్ సెంటర్‌ను పశ్చిమ అసోం గోల్‌పరా జిల్లాలో 2023లో ఏర్పాటు చేయకముందు ఆరు జిల్లా జైళ్లు డిటెన్షన్ సెంటర్లుగా పనిచేసేవి. 2021 ఆగస్టులో అసోం ప్రభుత్వం ఈ కఠినమైన జైళ్ల వంటి డిటెన్షన్ సెంటర్లను మానవతా దృక్పథంతో తాత్కాలిక ఆశ్రయ శిబిరాలుగా మార్చింది.

ప్రస్తుతం మటియా శిబిరంలో మాత్రమే విదేశీయులుగా ప్రకటించిన అక్రమ వలసదారులను ఉంచుతున్నారు. ఇక్కడ ఉండే మొత్తం 270 మంది అక్రమవలసదారుల్లో ఈ 63 మంది బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలుగా గుర్తించారు. ఇంకా మరో 750 మంది రెండేళ్లు డిటెన్షన్‌లో ఉండిన తరువాత బెయిలుపై బయటపడ్డారు. వీరిలో చాలా మంది కోర్టుల్లో కేసులతో పోరాడుతున్నారు. కొవిడ్19 మహమ్మారి సమయంలో.. రెండేళ్లకు మించి డిటెన్షన్ సెంటర్లలో ఉంటున్న అక్రమవలసదారులను కొన్ని షరతులపై తక్షణం విడుదల చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ వలసదారులు తాము వేరే దేశానికి చెందినవారమని నిరూపించుకున్నా లేదా సంబంధిత డాక్యుమెంట్లు చూపించినా వారిని వెనక్కు పంపడం సులువవుతుంది.

అయితే అటాంటి ధ్రువపత్రాలు వారి వద్ద లేకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ. అలాగే తాము భారతీయులమని వాదించినప్పటికీ, సరైన ధ్రువీకరణ పత్రాలు లేనందున విదేశీ ట్రిబ్యునల్స్ వీరిని విదేశీయులుగా ప్రకటించినప్పుడు వారిని స్వస్థలాకు తిరిగి పంపించే ప్రక్రియ చాలా కష్టం. బంగ్లాదేశ్‌లో వలసదారులు ఎవరైనా తాము బంగ్లాదేశీయులమే అని క్షేత్రస్థాయిలో నిరూపించే ధ్రువపత్రాలు లేకుంటే వారిని తమ దేశంలో చేర్చుకోవడానికి అంగీకరించరు. ఇదే విధంగా రోహింగ్యాలను చేర్చుకోవడానికి మయన్మార్ ఒప్పుకోవడం లేదు. అనేక ఉద్యమాల ఫలితంగా 1985లో కుదిరిన అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత అసోంలోకి ప్రవేశించిన వారిని నిబంధనల ప్రకారం అక్రమవలసదారులుగా పరిగణిస్తారు. వారిని వెనక్కు పంపిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News