అమెరికా నుంచి సైనిక విమానంలో తొలివిడతగా 104 మంది అక్రమ వలస దారులు గొలుసులు సంకెళ్లతో బుధవారం (ఫిబ్రవరి 5న) అమృత్‌సర్‌కు చేరుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. పార్లమెంట్ ఉభయసభలు దీనిపై హోరెత్తాయి. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ ఇచ్చిన వివరణ ఎవరికీ సంతృప్తి కలిగించడం లేదు. ప్రధాని మోడీతో చనువుగా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనే ఇలా జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొలుసులు, సంకెళ్లతో వారిని తీసుకొచ్చే బదులు మనమే విమానాలను అక్కడకు ఎందుకు పంపించకూడదు? అని వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ ప్రశ్నించడం ఆలోచించవలసి ఉంది. యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) వెబ్‌సైట్, దాని విభాగం ది ఇమ్మిగ్రేషన్ ఎయిర్ ఆపరేషన్ (ఐఎఒ) ప్రకారం నిర్బంధంలో ఉన్న అక్రమవలసదారులను చార్టర్ కమర్షియల్ విమానాల్లోనే తరలించాలన్న నిబంధన ఉంది.
సెక్యూరిటీ రిస్కు ఉంటే స్పెషల్ హై రిస్కు చార్టర్ విమానాల్లో పంపిస్తుంటారు. ఈమేరకు సరిహద్దు రాష్ట్రాలైన అరిజోనా, టెక్సాస్, లూసియానా, ఫ్లోరిడాల్లో 12 విమానాలు వీరిని పంపడానికే ఉన్నాయని వెబ్‌సైట్ పేర్కొంది. అంతేతప్ప దీనికోసం మిలిటరీ సహాయం తీసుకోవాలని ఎక్కడా ప్రస్తావించలేదు. మరి అత్యంత ఖర్చు భరించి మిలిటరీ విమానం ద్వారా 104 మంది అక్రమవలసదారులను ఎందుకు తరలించినట్టు అన్నదే ప్రశ్న. ఇప్పుడు 104 మంది వలసదారులను భారత్‌కు పంపించడానికి ఒక మిలియన్ డాలర్లకు పైగానే ట్రంప్ ప్రభుత్వంఖర్చు చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 8.74 కోట్లకు మించి ఖర్చు చేసినట్టు చెప్పవచ్చు. గతంలో అక్రమవలసదారులను తరలించడానికి కమర్షియల్ చార్టర్ విమానాలను మాత్రమే అమెరికా వినియోగించేది.
చార్టర్ విమానాల ఖర్చు గంటకు 8577 డాలర్లు (దాదాపు రూ.7.50 లక్షలు)గా ఉండేది. అయితే ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడైన నాటి నుంచి అక్రమ వలసదారులను తరలించడానికి మొట్టమొదటిసారిగా సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విధంగా సైనిక విమానాలను వినియోగించడానికి అక్రమ వలసల సమస్య ఎంత తీవ్రమైందో తెలియచెప్పడానికే అని భావిస్తున్నారు. అలాగే అక్రమవలసదారుల కాళ్లకు, చేతులకు సంకెళ్లు బిగించడానికి తాను అక్రమ వలసదారుల పట్ల ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నానో మిగతా దేశాలకు ఒక హెచ్చరికగానే కాకుండా తన ముఖ్యమైన నియోజకవర్గాన్ని మెప్పించడానికే అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో ప్రస్తుతం 18,000 మంది అక్రమ భారతీయ వలసదారులను గుర్తించారు. వీరందరినీ అమెరికా నుంచి తక్షణం తరలించాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకటి ఈ సైనిక విమానం ఎందుకు ఢిల్లీలో లాండ్ అవకుండా అమృత్‌సర్‌కు పంపించారు? ఢిల్లీలో విమానం దిగి ఉంటే అక్రమ వలసదారుల నుంచి వాంగ్మూలాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసుకుని ఉండేవి. రెండోది అక్రమ వలసదారులను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ అంగీకరించినప్పుడు మిలిటరీ విమానంలో వారిని అమెరికా తరలించే తీరు అమానవీయంగా ఉందని భారత్ అభ్యంతరం లేవనెత్తితే బాగుండేది.
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సంఘటనపై పార్లమెంట్‌లో వివరణ ఇస్తూ అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొత్తదేమీ కాదని, 2009 నుంచి సాగుతోందని, అయితే అక్రమ వలసదారులపట్ల కఠినంగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించారు. ఈ సమస్య తీవ్రత దృష్టా వలసలను క్రమబద్ధీకరించేందుకు 1983 నాటి వలస చట్టం స్థానంలో వలసల (ఓవర్‌సీస్ మొబైలిటీ సౌకర్యాల కల్పన సంక్షేమం) బిల్లు 2024ను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. భారత్ వంటి వర్ధమాన దేశాలనుంచి ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లేవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. కొందరు అక్కడే స్థిరపడి బాగా సంపాదించుకోవాలన్న ఆకాంక్షతో ఉంటున్నారు. అక్కడ సిలికాన్ వ్యాలీలో భారీ సంఖ్యలో భారతీయులు ఉంటున్నారు. వారికి ఎలాంటి ముప్పులేదు. కానీ చట్టబద్ధంగా కాకుండా ఏజెంట్ల మాయ హామీలు నమ్మి కొన్ని లక్షలు చెల్లించి దొడ్డిదారిన అమెరికా చేరినా, చివరకు అరెస్ట్‌పాలైన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు వచ్చిన 104 మంది వలసదారులు ఎన్ని కష్టనష్టాలను కొనితెచ్చుకున్నారో వారి విషాద గాథలు వింటే తెలుస్తుంది. ఇప్పుడు 18 వేల మంది భారతీయ వలసదారుల్ని అమెరికా వెనక్కు పంపడానికి సిద్ధం అయింది. వీరు ఒక్కొక్కరు రూ. 30 లక్షలనుంచి రూ. 40 లక్షల వరకు ఏజెంట్లకు చెల్లించి మోసపోయారు.
ఈ విధంగా మొత్తం రూ. 10 వేల కోట్లు ఏజెంట్ల పరమయ్యాయని చెప్పవచ్చు. దీనికంతటికీ కారణం దేశంలో యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడమే. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా బలోపేతం చేసే పథకాలను అమలు చేయడంతో పాటు, ఉద్యోగ అవకాశాలను విరివిగా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నించవలసిన అవసరం ఉంది. అలాగే అమెరికాకు తీసుకెళ్లి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించే రాకెట్ నెట్‌వర్క్‌ను ఛేదించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో 7,25,000 మంది భారతీయులు ఉంటున్నారు. వారిలో 24,974 మంది వివిధ నేరారోపణలపైన, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనపైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) నిర్బంధంలో మగ్గుతున్నారు. మళ్లీ అక్రమ వలసదారుల్ని తీసుకుని అమెరికా నుంచి మరో విమానం భారత్‌కు ఎప్పుడు వస్తుందో అమెరికా అధికార యంత్రాంగం చెప్పడం లేదు.