కెనడా, మెక్సికో, చైనానుంచి అమెరికాకు దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ద్వారా కొత్త రకం వాణిజ్య యుద్ధానికి అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ తెరతీశారు. ఇప్పటికి సుంకాల పెంపు ఈ మూడు దేశాలకే పరిమితమైనా, రాగల కాలంలో భారత్‌తోపాటు మరికొన్ని దేశాలకూ వర్తింపజేసే ప్రమాదం కనబడుతోంది. అధ్యక్షపదవిలోకి వచ్చీరాగానే కొలంబియాపై సుంకాల మోత మోగించిన ట్రంప్, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చిరకాలంగా తమతో వాణిజ్య భాగస్వాములుగా కొనసాగుతున్న మెక్సికో అండ్ కో పై ముందూవెనకా ఆలోచించకుండా సుంకాలు విధించడంతో అమెరికా వాణిజ్య విధానం విమర్శలకు గురవుతోంది. సుంకాల విధింపునకు ట్రంప్ చెబుతున్న కారణాలు వాణిజ్యానికి సంబంధం లేనివే కావడం గమనార్హం.
కెనడా, మెక్సికో దేశాలు అక్రమ వలసలను అరికట్టటం లేదని, నిషేధిత ఫెంటానిల్ మాదకద్రవ్యం అమెరికాలోకి అక్రమంగా తరలిస్తున్న ముఠాలకు చైనా ముకుతాడు వేయడం లేదన్నవి ట్రంప్ చెబుతున్న కారణాలు. కెనడా, మెక్సికోలు అమెరికాకు దీర్ఘకాలిక మిత్రదేశాలు మాత్రమే కాదు, అమెరికాకు జరిగే ఎగుమతుల్లో చైనా తర్వాత ఈ రెండింటిదే సింహభాగం. ఈ దేశాలనుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్, చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు వడ్డించారు. పైగా, సుంకాల విధింపునకు జాతీయ ఆర్థిక అత్యయిక స్థితిని విధించడం గమనార్హం. అమెరికాకు అక్రమంగా వలస వచ్చినవారి వల్ల స్వదేశీయుల ప్రయోజనాలు దెబ్బతింటున్న మాట వాస్తవం. అలాగే చైనానుంచి అక్రమ మార్గంలో వస్తున్న ఫెంటానిల్ కారణంగా అమెరికన్ యువత ప్రాణాలమీదకు తెచ్చుకుంటోందన్న ఆయన ఆక్రోశం కూడా అర్థం చేసుకోదగినదే. అయితే, చర్చల ద్వారా పరిష్కరించుకుంటే సమసిపోయే ఈ సమస్యలను భూతద్దంలోంచి చూడటమే ట్రంప్ చేస్తున్న పొరబాటు. తాను అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు, వాహనాలు, చమురు ధరలను భూమార్గం పట్టిస్తానంటూ నమ్మబలికిన ట్రంప్, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూండటమే విచిత్రం.
సుంకాల పెంపువల్ల అక్రమ వలసలు ఏమాత్రం తగ్గుతాయో, ఫెంటానిల్ అక్రమ రవాణాకు ఏమేరకు ముకుతాడు పడుతుందో తెలియదుగానీ, ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం వికటిస్తే, ధరలు భారీగా పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రస్తుతం 2.9 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం మరో 0.4 శాతం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్లను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూనే, వారు కొంత ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదని అగ్రరాజ్యాధినేత స్వయంగా అంగీకరించడం గమనార్హం. తమ దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధమనే ధీమాతో ఆయన ఉన్నట్లుగా కనబడుతోంది. కానీ, పేరుకు అగ్రరాజ్యమే అయినా చమురు సహా పలు ఉత్పత్తుల కోసం అగ్రరాజ్యం అనేక దేశాలపై ఆధారపడుతోందన్నది తోసిపుచ్చలేని నిజం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడం ప్రజాస్వామిక దేశాలు అనుసరించే ప్రాథమిక సూత్రం. అయితే డొనాల్డ్ ట్రంప్‌కు చర్చలపై అంతగా నమ్మకం ఉన్నట్లు కనబడదు. దూకుడుగా ప్రవర్తించడం.
బెదిరింపుల ద్వారా, ఆంక్షలు విధించి కట్టడి చేయడంద్వారా ఎదుటివారిని దారికి తెచ్చుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. తాను అధికారంలోకి రాకముందే యుద్ధానికి ముగింపు పలకాలంటూ ఇజ్రాయెల్, హమాస్‌లను హెచ్చరించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుంకాల పెంపుపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని చైనా హెచ్చరించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థనే ఖాతరు చేయని ట్రంప్, డబ్ల్యుటిఒ ఆదేశాలను శిరోధార్యంగా భావిస్తారని అనుకోలేం. ఈ సందర్భంగా మిన్నెసోటా గవర్నర్ అమీ క్లోబుచర్ అన్న మాటలు ప్రస్తావనార్హం. ‘ట్రంప్ వచ్చాక గందరగోళం పెరిగింది. అవినీతి పెరిగింది. కోడిగుడ్ల ధరలు సైతం పెరిగాయి.
ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కావలసింది ఇది కాదు. ఉలిని వాడటానికి బదులు ఆయన పెద్ద సుత్తిని వాడుతున్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. గోటితో పోయేదానికి ట్రంప్ గొడ్డలి వరకూ తీసుకువెళ్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందంటూ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ కొన్ని ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం ద్వారా నష్టనివారణ చర్యలు చేపట్టింది. వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ట్రంప్‌తో జరిపే ద్వైపాక్షిక చర్చలలో సుంకాల పెంపు సమస్యతోపాటు అగ్రరాజ్యంతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందడుగు వేయాలి.