అమెరికాలో 1958లో కేవలం 12,000 మంది మాత్రమే ప్రవాస భారతీయులు ఉండేవారు. రానురాను వారి ప్రాముఖ్యత పెరిగి ఇప్పుడు అమెరికా మొత్తం జనాభాలో 1.5% వరకు ప్రవాస భారతీయులు ఉనికిని పొందడం విశేషం. సిఇఒలుగా, సైంటిస్టులుగా, ఆస్ట్రోనాట్లుగా, విధానపర నిర్ణేతలుగా, చట్టసభ సభ్యులుగా ఇలా అనేక రంగాల్లో ప్రవాస భారతీయులు విస్తరిస్తుండటంతో అమెరికాలో పుట్టి పెరిగిన అసలైన అమెరికన్లకు దక్కవలసిన ఉద్యోగాలు, పదవులు ప్రవాసీయులకే దక్కుతున్నాయన్న అపోహలు మొదలవుతున్నాయి. ఇది చివరకు హెచ్1బి వీసాలపై ప్రభావం చూపిస్తోంది. మేక్ ఎగైన్ గ్రేట్ అమెరికా (అమెరికాను గొప్పగా తీర్చిదిద్దు) ‘మాగా’ నినాదంతో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు హెచ్1బి వీసాల వివాదం అగ్నిపరీక్షగా మారింది.
ప్రవాసీయుడైన ఎలాన్ మస్క్‌కు పెద్ద పీట వేయడం వివాదాస్పదమవుతోంది.ఇది మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా) అన్న ట్రంప్ ప్రధాన నినాదానికి తూట్లు పొడుస్తోంది. న్యూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీసియెన్సీ(డిఒజిఇ) అధినేతగా ఎలాన్‌మస్క్, ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్, పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా హర్మీత్ కె థిల్లాన్, జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా డాక్టర్ జయభట్టాచార్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్ శ్రీరామ్ క్రిష్ణన్‌తో పాటు వివేక్ రామస్వామి వంటి భారతీయ మూలాలున్న ఆరుగురిని ట్రంప్ తన యంత్రాంగంలో కీలక స్థానాల్లో నియమించారు. ఇది ‘మాగా’ నినాదానికి విరుద్ధమని వలసవాద, ఇస్లామిక్ వ్యతిరేక ఉద్యమ నేత లారా లూమెర్ ధ్వజమెత్తుతున్నారు.
ట్రంప్ నియమించిన వారిలో శ్రీరామ్ క్రిష్ణన్ చెన్నైకు చెందినవారు. ఇండియా ఫస్ట్ అన్న నినాదానికి ఆయన కట్టుబడి ఉన్నారని, ఇది ‘అమెరికా ఫస్’్ట అన్న లక్షానికి వ్యతిరేకమని లారా లూమెర్ ఆగ్రహిస్తున్నారు. అయితే హెచ్1బి వీసాల్లో 70% భారతీయు లే పొందుతున్నారని, వీరంతా భారత్ నుంచి వచ్చే మూడో ప్రపంచ ఆక్రమణదారులని లూమెర్ ఆరోపిస్తున్నారు. హెచ్1బి వీసాదారుల్ని కాంట్రాక్టుగా తీసుకోవడంలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్య ప్రమాణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఏటా వారికి 80 వేల డాలర్ల నుంచి 1,20,000 డాలర్ల వరకు చెల్లించుకోవలసి వస్తోందని నిలదీస్తున్నారు. ఈ వాదాన్ని వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ తదితరులు తిప్పికొడుతున్నారు.వాస్తవానికి ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు హెచ్1బి వీసా పైనే వచ్చారు.
విదేశీ ప్రతిభతో అమెరికా ప్రయోజనం పొందుతుంది తప్ప అమెరికా వాసుల ప్రయోజనాలకు, హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని మస్క్, రామస్వామి తమ వాదన వినిపిస్తున్నారు. చేతిలోపైసా లేకుండా అమెరికాకు వలస వచ్చిన గొప్ప ఇంజినీర్ నికోలా టెస్లా స్ఫూర్తితోనే తన కారుకు టెస్లా అని పేరు పెట్టినట్టు మస్క్ గొప్పగా చెప్పుకున్నారు. అమెరికాలో విద్యుత్ విప్లవానికి నికోలా టెస్లా మూలకారకుడని మస్క్ ఉదహరించారు. అమెరికాకు సమర్థత కలిగిన ప్రజలు కావాలని తానెల్లప్పుడూ భావిస్తానని, తెలివైనవారు మన దేశానికి రావాలని, ఇదివరకెన్నడూ లేని స్థాయిలో అమెరికాలో ఉద్యోగాలు రాబోతున్నాయని కొత్త సంవత్సరం సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడడం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. అమెరికా తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్‌లను తయారు చేస్తున్నందున ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గల వారిని దేశంలోకి అనుమతించడానికి హెచ్1బి వీసా ఉపయోగపడుతుందని మస్క్, వివేక్ రామస్వామి కూడా పేర్కొంటున్నారు.
ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలికగా నియమించుకోడానికి అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ బైడెన్ కార్యవర్గం నిబంధనల్లో మార్పులు చేసింది. ట్రంప్ మొదటిసారి పాలనలో వీసాలపై ఉన్న అభిప్రాయాలకు ఇప్పటి వైఖరికి తేడా కనిపిస్తోంది. 2017లో బై అమెరికన్, హైర్ అమెరికన్ అన్న సిద్ధాంతానికి వత్తాసు పలికారు. ఫలితంగా 2015 నుంచి హెచ్1బి వీసాల మంజూరు మందగించింది. 2020లో అమెరికాలోని సంస్థలు విదేశాల నుంచి ఉద్యోగులు, కార్మికులను తెచ్చుకునే విధానానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిలకడ లేని విధానాలతో మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) మద్దతుదారులు హెచ్1బి వీసా అసలు ప్రయోజనాలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ సమస్యను ట్రంప్ ఈసారి ఎలా పరిష్కరిస్తారో చూడాలి. హెచ్1బి వీసాలపై ఆంక్షలు ఎక్కువ చేస్తే అమెరికా కంపెనీలు విదేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయవలసి వస్తుంది. ప్రత్యామ్నాయంగా చైనా, కెనడా వంటి దేశాల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతుందని మరో అధ్యయనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పాలనా యంత్రాంగంలో ‘మాగా’ గ్రూపు ఆలోచనలను మార్చడానికి భారత ప్రభుత్వం గట్టిగానే పని చేయవలసి వస్తుంది. భారత్‌కు ఆదాయం తెచ్చిపెట్టే దేశాల్లో అమెరికా టాప్‌లో ఉంది. గత ఏడాది 120 బిలియన్ డాలర్ల వరకు భారత్‌కు అమెరికా నుంచి ఆదాయం సమకూరింది. ఈ ఆదాయ స్రవంతిని భారత్ దొరకబుచ్చకోగలగాలి. అలాగే అమెరికాను ఆకర్షించడానికి సాంకేతిక నైపుణ్యంలో టాప్‌లో భారతీయులు ఉన్నప్పుడే ఎలాంటి చిక్కులు వీసాల్లో ఎదురుకావు.