అవినీతి ఆటకట్టులో ఆమె సేవలు
వాషింగ్టన్ : అవినీతి ఆటకట్టుకు పాటుపడ్డందుకు గుర్తింపుగా భారత్‌కు చెందిన అంజలి భరద్వాజ్‌కు అమెరికా పురస్కారం దక్కింది. బైడెన్ అధికార యంత్రాంగం సరికొత్తగా ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ చాంపియన్స్ అవార్డును ఏర్పాటు చేసింది. అవినీతి నిరోధకానికి పాటుపడుతున్న వారిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా గుర్తించి పురస్కారాలను అందించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 12 మంది ధైర్యవంతులైన వారిని ఎంపిక చేశారు. వీరిలో భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ కూడా ఉన్నారు. రెండు దశాబ్దాలుగా అంజలి వివిధ స్థాయిలలో అవినీతి నిరోధానికి పాటుపడుతోందని గుర్తించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భారత్‌లో సమాచార హక్కు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ వస్తున్న అంజలీ సత్రక్ నాగరిక్ సంఘటన్ (ఎన్‌ఎన్‌ఎస్) పౌరవేదిక వ్యవస్థాపకురాలు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారి, పౌరుల మరింత క్రియాశీలక పాత్ర దిశలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.