Monday, December 23, 2024

ఉక్రెయిన్‌పై అమెరికా అపప్రచారం

- Advertisement -
- Advertisement -

American false propaganda on Ukraine

 

ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా దాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్న మాటలు. ఇప్పటి వరకైతే జో బైడెన్ ఎత్తుగడ ఈ ఉదంతంలో అభాసుపాలైంది. చివరికి పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దోమిర్ జెలెన్‌స్కీ కూడా అసహనాన్ని వెలిబుచ్చాడు. “ఈ రోజు రష్యా దాడి చేస్తుంది, రేపు చేస్తుందీ అంటూ రోజుకొక తేదీని చెబుతారెందుకు? మీరు నిజంగా మాకు సాయం చేయాలనుకుంటే తేదీలు చెప్పవద్దు. ఫిబ్రవరి 16, మార్చి ఒకటి, డిసెంబరు 31 ఏదైనా కావచ్చు, మా నేలను కాపాడుకొనే సత్తా మాకు ఉంది. మీరు ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇవ్వండి. కొంత సొమ్మును కేటాయించిన ప్రతిసారీ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పది సంస్కరణలు మేమెందుకు చేయాలి. రండి, మా మిలిటరీని పటిష్ట పరిచేందుకు తోడ్పడండి, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, మా ఆర్ధిక రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలతో పెట్టించండి. మాకు నిధులు, గ్రాంట్లు ఇవ్వండి. దానికి బదులు ఫలానా రోజు రష్యా దాడి చేస్తుంది అంటూ నిరంతరం చెప్పటం అవసరమా” అని జెలెనెస్కీ ప్రశ్నించాడు.

మ్యూనిచ్ నగరంలో జరిగిన ఐరోపా భద్రతా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, తరువాత ఆంక్షలు ప్రకటిస్తే జరిగేదేమీ ఉండదు కనుక ముందుగానే ఆ పని చేయాలని ఆదివారం నాడు ఉక్రెయిన్ కోరింది. ఈ వారంలోనే దాడి జరగవచ్చు, అది రాజధాని కీవ్ పట్టణం మీదే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నాడు. శనివారం నాడు రష్యా ఖండాంతర క్షిపణులతో విన్యాసాలు జరిపి నిర్ణీత లక్ష్యాలను గురితప్పకుండా కొట్టింది. ఆదివారం నాడు ముగియాల్సిన రష్యాతో సైనిక విన్యాసాలను మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు బెలారస్ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిను తిరుగుబాటు ప్రాంతాల నుంచి ఆదివారం నాడు కూడా పౌరులు ముఖ్యంగా పిల్లలు రష్యాకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదార్లు, మిలిటరీ పరస్పరం కాల్పులకు దిగాయి. దీంతో కాల్పుల విరమణ జరగాలనే అంశం తెరపైకి వచ్చింది.

రేపేం జరుగుతుంది అన్నది అనిశ్చితం. ఇప్పటి వరకు ఉక్రెయిను మీద దాడి గురించి చెప్పిన మాటలు వాస్తవం కాదని, ప్రచార దాడి అని తేలింది. గతంలో ఇరాక్ మీద దాడి చేసేందుకు సద్దాం హుసేన్ ప్రభుత్వం మారణా యుధాలను గుట్టలుగా పోసి వుంచిందంటూ తప్పుడు ప్రచారం చేసింది అమెరికా, వాటిని కనుకొని నాశనం చేసే పేరుతో ఏకంగా ఇరాక్ మీద దాడి చేసింది, సద్దాంను ఉరి తీసింది. తీరా అక్కడ అలాంటి వాటి జాడలు కూడా లేవని అదే అమెరికా అధికారులు అంతా ముగిశాక ప్రకటించారు. ఇప్పుడు తిరిగి ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇది 1990 దశకం కాదు, రష్యా ఇరాక్కు, సద్దాం హుసేన్, వ్లాదిమిర్ పుతిన్‌కు పోలిక లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఐరోపాలో అమెరికా పలుకుబడి మరింత తగ్గటానికి, దాని పరువు పోగొట్టటంలో పుతిన్ తన తెలివితేటలను ఉపయోగించాడనే చెప్పాలి.

ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి నెలా వివిధ దేశాల సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ యుద్ధం చేసేందుకు కాదు, బలప్రదర్శన మాత్రమే. ఉక్రెయిన్, రష్యా సరిహద్దులు కలిగిన బెలారస్‌తో కొద్ది రోజుల క్రితం రష్యా సైనిక విన్యాసాలు జరిపింది. వాటిని చూపి ఇంకేముంది అవి ముగియగానే పనిలో పనిగా ఉక్రెయిన్ మీద ఫిబ్రవరి 16న దాడి చేస్తారని అమెరికా చెప్పింది. అనేక మంది నిజమే అని నమ్మారు. కీవ్ నుంచి తమ రాయబార సిబ్బంది కుటుంబాలను వెనక్కు రప్పించే నాటకాన్ని కొన్ని దేశాలు రక్తి కట్టించాయి. సరిహద్దుల్లోని తమ దళాలను కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించగానే మా దెబ్బకు దిగివచ్చిందని ఉక్రెయిన్ నేత తన జబ్బలను తానే చరుచుకున్నాడు. కానీ కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలు రెండో ఎత్తుగడలో భాగంగా కొత్త కథలు చెప్పటం ప్రారంభించాయి. మరో వైపున స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని డాంటెస్క్, లుహానస్క్ రిపబ్లిక్కుల మీద ఆ దేశ మిలిటరీ దాడులు జరిపి రష్యాను రెచ్చగొట్టింది.

2014 నుంచి ఆ రెండు ప్రాంతాల్లోని జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాదాపు పదిహేను వేల మంది మరణించారు. మిలిటరీ సరిహద్దుల రక్షణ, ఇతర దేశాల దాడులను ఎదుర్కొనేందుకు తప్ప స్వంత జనం మీద దాడులు చేసేందుకు కాదు. 2014 బెలారస్ రాజధాని మిన్‌స్క్ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్ ప్రభు త్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఒఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. దీనిలో గమనించాల్సిన అంశం ఏమంటే స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్కులు రష్యా సరిహద్దు లో ఉన్నందున ఉక్రెయిన్ మిలిటరీని సరిహద్దు ప్రాంతాల్లో అనుమతించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సరిగా అమలు జరగనప్పటికీ అమల్లోనే ఉన్నాయి. ఈ ఒప్పందాల అమలు గురించి కాకుం డా, అమెరికా, నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఉక్రెయినుకు ముప్పు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి.

నాటో విస్తరణలో భాగంగా జరిగిన కుట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆ కూటమి గద్దెనెక్కించింది. ఏ క్షణంలోనైనా విస్తరణ జరగవచ్చని భావించిన రష్యా వెంటనే పావులు కదిపింది. ఒకప్పటి తన భూభాగమైన క్రిమియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ లో రష్యాలో విలీనం కావాలని మెజారిటీ పేర్కొనటంతో వెంటనే రష్యా ఆపని పూర్తి చేసింది. దీంతో కంగుతిన్న పశ్చిమ దేశాలు అప్పటి నుంచి రష్యా మీద ఆంక్షలను అమలు జరుపుతున్నాయి. వాటి వలన ఫలితం లేకపోవటంతో అసలు మొత్తంగా ఉక్రెయిన్ ఆక్రమణ జరుపుతుందంటూ ప్రచారం, తేదీల నిర్ణయం చేశారు.

మిన్‌స్క్ ఒప్పందాల్లో రష్యా భాగస్వామి కనుక దానికి భిన్నంగా ఆ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తే ఆ పేరుతో దాడికి దిగాలని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో కాచుకున్నాయి. పుతిన్ అందుకు అవకాశం ఇవ్వలేదు. గుర్తింపు ఇవ్వాలంటూ ఇటీవల కమ్యూనిస్టు ఎంపిలు ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ పుతిన్ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నాటో విస్తరణ ఉక్రెయిన్ చేరిక గురించి మాట్లాడేదేమీ లేదని పుతిన్ చెబుతుండగా దానికి తాము సిద్ధంగా లేమని అమెరికా చెబుతోంది. స్వాతంత్య్ర ప్రకటన చేసిన రిపబ్లిక్కులు రష్యాలో విలీనానికి కూడా సిద్ధమే. అయితే అవి క్రిమియా వంటివి కాదు గనుక రష్యా తొందరపడటం లేదు. ఆ పని చేస్తే వెంటనే నాటో ఉక్రెయిన్లో తిష్ఠ వేసి రోజువారీ తలనొప్పి కలిగిస్తుంది. తన సభ్యదేశం కాని చోట నాటో దళాలను మోహరించే వీలు లేదు. ఐరోపాను మరింతగా తన కబంధ హస్తాల్లో బిగించేందుకు అమెరికా పావులు కదపటాన్ని జర్మనీ వంటి దేశాలు అంగీకరించటం లేదు.

నిబంధనలు, అవగాహనలకు విరుద్ధంగా నాటో దేశాలు ఉక్రెయినుకు అన్ని రకాల సాయం చేస్తూ రష్యాను కవ్విస్తున్నాయి. 2014 నుంచి 270 కోట్ల డాలర్ల మేర మిలిటరీ సాయం అందించగా ఒక్క 2021లోనే అమెరికా 65 కోట్ల డాలర్ల మేర అందించింది. ఈ ఏడాది ఇప్పటికి 20 కోట్ల మేరకు అందించారు. బ్రిటన్ 460 టన్నుల మేరకు అనేక రకాల ఆయుధాలను చేరవేసింది. నిబంధనల మేరకు చూస్తే వీటిని చూపి రష్యా మిన్‌స్క్ ఒప్పందం నుంచి వైదొలిగి నేరుగా తిరుగుబాటు రిపబ్లికులకు అన్ని రకాల సాయం చేయవచ్చు గానీ దానికి పూనుకోలేదు. అమెరికా, ఐరోపాలోని నాటో దేశాలకు రష్యన్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు.

గత కొద్ది నెలలుగా అమెరికా, దాని మిత్ర దేశాలు చెబుతున్నట్లుగా ఉక్రెయిను మీద ఎలాంటి దాడి ఉండదు. ఆశ్చర్యకర పరిణామాలూ జరగవచ్చు. మూడవది చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అమెరికాకు పంపిన ఒక పత్రంలో నిర్దిష్ట ప్రతిపాదనలను చేశారు. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది. “ఉక్రెయిన్, జార్జియాలను నాటోలో చేర్చుకోవటమే కాదు, నామమాత్ర సభ్యత్వం కూడా ఇవ్వకూడదు. సభ్యులు కాని దేశాల్లో అమెరికా మిలిటరీ కేంద్రాలు, ఆయుధ నిల్వల వంటి మిలిటరీ చర్యలు, రష్యాను లక్ష్యంగా చేసుకొనే ద్విపక్ష మిలిటరీ ఒప్పందాలు ఉండకూడడు”. రుమేనియా, పోలాండ్‌లో ఉన్న మధ్యంతర, స్వల్పశ్రేణి అణుక్షిపణులను, బాల్టిక్ సముద్ర ప్రాం తంలోని యుద్ధ నావలు, రష్యా గగన తలానికి సమీపంలోని అణు బాంబర్లను తొలగించాలని కూడా కోరింది. మిన్‌స్క్ ఒప్పందాలను అమలు జరపాలి, ఆ మేరకు డాన్‌బాస్ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ చెప్పారు. ఈ ఒప్పందాల ప్రకారం తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా ఎలాంటి ఆయుధాలను పంపకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలపై ఉక్రెయిన్ మిలిటరీ దాడి చేస్తే తిరుగుబాటుదార్లకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగేట్లుగా ఇప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పలేము.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News