Monday, December 23, 2024

మోడీకి అమెరికా మీడియా మొట్టికాయలు

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందులో భారత దేశంలో మానవ హక్కులు అమెరికా పత్రికా రంగానికి కీలకంగా మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోడీ ఏనాడూ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడలేదు. ఈ సందర్భంగా మానవ హక్కుల గురించి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. భారత దేశంలో ముస్లింల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్యం గురించి వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు మోడీ సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డారు. “ప్రజలు అడుగుతున్నారా!? ఆశ్చర్యపోతున్నాను.. ప్రజలు ఇలా అడగరే! భారత్ ప్రజాస్వామిక దేశం. భారత, అమెరికా డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది.” ‘ప్రజాస్వామిక విలువల్లో కుల, మత, వయో భేదపరంగా భారతదేశంలో వివక్ష లేదు’ అన్నారు.

భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితి గురించి విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, మోడీని బైడెన్ ఎలా అంగీకరించారన్నది పశ్చిమ దేశాల పత్రికల ప్రశ్న? ‘మోడీని అక్కున చేర్చుకోవడం అంత అవసరమా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది’. ‘పత్రికల నుంచి ఎదురైన ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వడానికి సిద్ధమయ్యారు: గుర్తుంచుకోవలసిన రోజు’ అని న్యూయార్క్ టైవ్‌‌సు రాసింది. గతంలో చెప్పినట్టు ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విషయంలో మోడీ చెప్పిన సమాధానాలను గమనిస్తే తాను చేసిన తప్పులను మోడీ ఎలా తిరస్కరించారో ‘న్యూయార్క్ టైవ్‌‌సు’ రాసింది. అధికారం చేపట్టినప్పటి నుంచి మోడీ పత్రికలను ఎలా అదుపు చేసిందీ గుర్తుచేసింది.‘ప్రధాని కార్యాలయానికి వచ్చినప్పటి నుంచి మోడీ వేగం గా పత్రికలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.మోడీకి బహిరంగ సభల్లో మాట్లాడడమంటే చాలా ఇష్టం.రేడియోలో నెల నెలా ఆయన చేసే ప్రసంగం ద్వారా జాతికి తన సందేశాన్ని అందించేవారు’ అని ‘న్యూయార్క్ టైవ్‌‌సు’ గుర్తు చేసింది.

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లలో ముస్లింలపైన హిందూ ముఠాలు మారణాయుధాలతో దాడులు చేసిన సంఘటనలకు మోడీనే బాధ్యుడని ‘న్యూయార్క్ టైవ్‌‌సు’ ఆరోపించింది. ‘తాను చేసిన ఏ తప్పునైనా సరే తిరస్కరించే మోడీ, గుజరాత్ అల్లర్ల సమయంలో పత్రికలను అదుపు చేయకపోవడమే తాను చేసిన పెద్ద తప్పని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ పని చేయడం మొదలు పెట్టారు’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘మోడీకి జో బైడెన్ ఏమీ చెప్పలేకపోయారు’ అన్న శీర్షికన ‘ద న్యూయార్కర్’ రాసిన కథనంలో ‘బైడెన్ విదేశీ విధానంలో భాగంగా వ్యాపారం గురించి మోడీ బైడెన్ సమావేశం జరిగిందని పేర్కొంది. మోడీ నియంతృత్వ పాలన పైన దృష్టి సారిస్తూనే, బైడెన్ విదేశీ విధానంలో భాగంగా వాణిజ్య సంబంధాలను గుర్తు చేయడం ఊహించిందే అని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ నోరు మెదపలేదని, రష్యానే యుద్ధాన్ని మొదలు పెట్టిందని ఆరోపించింది.

‘ద న్యూయార్కర్’ పత్రిక మోడీని విమర్శిస్తూనే, ‘మోడీ పెట్టింది పత్రికా విలేకరుల సమావేశం కాదని, క్లుప్తమైన సమావేశం’ అని వ్యాఖ్యానించింది. ‘భారతదేశంలో మోడీ నియంతృత్వం గురించి బైడెన్ ఎందుకు జారుకున్నారు?’ అని ‘లాస్ ఎంజెల్స్’ ప్రశ్నించింది. మోడీ, బైడెన్ సంయుక్త పత్రికా విలేకరుల సమావేశం గురించి రాస్తూ ఆ పత్రిక ‘భారత దేశం ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో పడింది. బైడెన్‌గాని, ఇతర ప్రజాస్వామిక నాయకులు గాని ఆర్థికంగా, రాజకీయంగా, నైతికంగా అలా లేదని చెప్పలేరు’ అని జూన్ 20వ తేదీ సంచికలో వ్యాఖ్యానించింది. ‘నియంతృత్వంలో ఉన్న భారత దేశం నియంతృత్వ పాలనలకు వ్యతిరేకంగా పోరాడలేదు’ అని రాసింది.

తాజాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపైన జరిపిన చట్టపరమైన చర్య ఇందులో భాగమేనంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ నాయకులపైన ప్రయోగించడం ద్వారా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా జర్నలిస్టులు కానీ, సమాజ సేవకులు కానీ, ఎవరైతే గొంతెత్తుతారో వారిపైన ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం గురించి ఆ కథనం చర్చించింది. ‘మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాజకీయ నాయకులపైన ఇడి కేసులు 400 శాతం పెరిగాయి. వాటిలో 95 శాతం ప్రతిపక్షాలపైనే పెట్టారు. హిందూ రాష్ర్ట ఏర్పాటులో భాగంగా మైనారిటీలను బెదిరించడానికి ఈ పనులు చేస్తోంది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష నేరాలు 300 శాతం పెరిగాయి.రెండు వందల మిలియన్ల ముస్లిం లకు కొత్త చట్టాల ద్వారా ఓటు హక్కును తొలగించాలని చూస్తున్నారు’ అని లాస్ ఎంజెల్స్ రాసింది. పశ్చిమ దేశాలు చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలను తెగతెంచుకుని, అక్కడి పరిశ్రమలను భారత దేశానికి తరలించాలనే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం తో సంబంధాలు నెరపడం చాలా ముఖ్యమైంది. ‘ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా భారత దేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ పరఢవిల్లే అవకాశాలున్నాయి. దానికొక బలమైన రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే దృఢచిత్తం గల సుప్రీంకోర్టు వారికుంది. పెడరల్ పద్ధతిలో రాష్ట్రాల పరిపాలన సాగుతోంది. సగం రాష్ట్రాలు మోడీ అధికారంలో లేవు.

‘చైనా దురాక్రమణ చేస్తుందనే భయంతో భారత దేశం అమెరికా తో సంబంధాలు పెట్టుకోకతప్పదు’ అని ‘ఫారిన్ అఫైర్స్’ రాసిం ది. మోడీ అమెరికాలో కాలు మోపడానికి ముందు ఫారిన్ అఫైర్స్ లోనే డానియల్ మార్కె రాస్తూ ‘ప్రజాస్వామిక ఆలోచనలకు తానే ఛాంపియన్‌నని బైడెన్ పాలనా యంత్రాంగం భావించింది. ఎప్పుడైతే భారత దేశంతో తన విలువను పంచుకుందో కాస్త వణికిపోయినట్టు భావించింది’ అని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామిక విలువలపై నిలబడాల్సి వచ్చినప్పుడు భారత అమెరికా సంబంధాలు సందేహాస్పదమైన ఎత్తుగడగా మారాయి. సాధారణ విలువలన్నీ కల్పించుకున్నవి కావడంతో ఆ విలువలన్నీ ఇప్పుడు చెదిరిపోయాయి. మోడీ అధికారంలోకొచ్చిన తొమ్మిదేళ్ళ క్రితమే భారత ప్రజాస్వామ్యంపైన అనుమానాలు పెరగడం మొదలైంది. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం’లోని తమ ముస్లిం మైనారిటీలపైన హింస ఉప్పెనలా విరుచుకుపడుతోందని అప్పుడప్పు డూ ప్రముఖ రాజకీయ నాయకులు ఘాటైన విమర్శలు చేశారు. స్థానికంగా ఉన్న లక్షలాది ముస్లింలకు పౌరసత్వం రద్దు చేయాలని చూసింది. పత్రికలు, ప్రతిపక్షాలు నోరెత్తకుండా అడ్డుకుంటోంది’ అని పేర్కొంది. భారత అమెరికాలు చైనాను తమ ఉమ్మడి శత్రువుగా భావించి, దానికి వ్యతిరేకంగా ఒకరికొకరు సాయం చేసుకోవాలనుకుంటున్నాయి.

‘ఆమెరికాలోని అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం, విద్య, పెట్టుబడులు భారత దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. భారత దేశానికి రష్యాతో సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయి. రష్యా ఆయుధాల ప్రామాణికతపైన నమ్మకంలేని భారత్ పశ్చిమ దేశాలనుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది’ అని కూడా రాసింది. మానవ హక్కుల ఉల్లంఘన పైన, ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించడంపైన, పత్రికా స్వేచ్ఛపైన భారత దేశం వ్యవహరించే తీరుపై అమెరికా సహనంతో ఉండడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది? ‘ప్రపంచంలో ప్రజాస్వామ్యం కోసం నిలబడడం కంటే, తన అనుకూలత కోసమే ఉంది’ అని ఆ వ్యాసం పేర్కొంది. ‘భారత అమెరికా సంబంధాలు వ్యాపారానికి దిగజార్చేలా వాటిమధ్య ఇరుసు పని చేస్తోంది’ అని రాసింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 జరిగిన అల్లర్ల గురించి రాయాలంటే మాటలు చాలవు అని ‘ద అట్లాంటిక్’లో డానియల్ బ్లాక్ రాశారు.

భారత దేశాన్ని, దాని పతనాన్ని పొగుడుతున్న అమెరికా నాయకులను తీవ్రంగా విమర్శించారు. ‘భారత దేశం లో ప్రజాస్వామ్యం దినదినాభివృద్ధి చెందుతోందని గుడ్డివాళ్ళు అయితే తప్ప చెప్పలేరు’ అని భారత దేశంలో స్వతంత్రంగా నడిచే ‘ద కార్వాన్’ అనే జాతీయ పత్రిక రాసిన విషయాన్ని ఉటంకించారు. ‘ప్రజాస్వామ్యవాదుల నుంచి ఒత్తిడి రావడంతో 17 నెలలుగా ఆపేసిన ఇంటర్‌నెట్‌ను 17 రోజులలో పునరుద్ధరించారు’ అని ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్ భారత అధ్యక్షుడు ఆకార్ పటేల్ చెప్పిన మాటను ‘ద అట్లాంటిక్’ ఉటంకించింది. ‘నిమ్న జాతులు సహా 5 మిలియన్ల దక్షిణాసియా ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు.

భారత దేశంలో ఉన్న దిగువ కులాల వారి లాగానే అమెరికాలో కూడా తాము పీడనకు గురవుతున్నామని వారు అన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాసియా అమెరికన్లు హిందూ మతానికి చెందిన దిగువ కులాలకు చెందిన వారు. దక్షిణాసియా అమెరికన్లలో ఉద్యోగ విషయాలలో కుల వివక్ష ఉంది. వివక్ష వ్యతిరేక చట్టాల నుంచి అమెరికాలోని ఏ రాష్ర్టంలోను భద్రత లేదు. ఉద్యోగాల్లో, గృహవసతిలో, ప్రభుత్వ స్థలాల్లో వివక్షను సియాటిల్ నిషేధించింది. చట్టం ద్వారా కుల వివక్షను నిషేధించాలని కాలిఫోర్నియా ప్రయత్నిస్తోంది’ అని ‘ద న్యూస్ మినిట్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుదిప్తో మొండల్ రాశారు.

‘దీనిపైన కాంగ్రెస్ కేసు వేస్తే, అది ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘మోడీ గౌరవార్థం విందు ఏర్పాటు చేసినందుకు బైడెన్ సంతోషపడినప్పటికీ, మానవ హక్కులపైన మాత్రం ఆయన పెదవి విరిచారు’ అని ‘పొలిటికో’ రాసింది. ‘మోడీతో జాగ్రత్తగా ఉంటూ నే, భారత దేశం ఆర్థిక భాగస్వామిగా ఎదగడం, ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి కోటలా అడ్డుపడుతోందని అమెరికా భావిస్తోంది’ అని ఆ పత్రిక రాసింది. భారత దేశం ఆర్థికంగా బలపడుతున్న దేశం కనుక, విదేశీ పెట్టుబడులు వస్తుండడంతో ప్రపంచంలోనే ప్రధానమైన దేశంగా గుర్తింపు పొందింది కనుక అమెరికాకు మోడీని భరించక తప్పడం లేదని ఆ పత్రిక రాసింది.

చైనాకు చెక్ పెట్టడానికి భారత అమెరికా సంబంధాలు అవసరమని చెప్పింది. ‘చైనాకు చెక్ పెట్టడానికి భారత దేశం ప్రధాన పాత్ర పోషిస్తుందని అమెరికా పాలనా యంత్రాంగం భావిస్తోంది. భారత చైనాలకు ఉన్న సుదీర్ఘ సరిహద్దుల వద్ద ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్ సహా భారత దేశాన్ని కూడా ఖ్వాడ్‌లో అమెరికా చేర్చింది. పసిఫిక్ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం కోసం, చైనా అధినేత జీ జిన్‌పింగ్ ఆర్థిక, భౌగోళిక ఆంక్షలకు అడ్డుకట్ట వేయడానికి భారత్‌ను ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందని భావిస్తోంది’ అని రాసింది. భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితి క్షీణిస్తున్న విషయం తెలిసినప్పటికీ అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆ పత్రిక విమర్శించింది.

రాఘవశర్మ- 9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News