Monday, December 23, 2024

మిత్రులపై అమెరికా నిఘా!

- Advertisement -
- Advertisement -

అమెరికాలో అంతో ఇంతో అంతర్గత ప్రజాస్వామ్యమే గాని, అంతర్జాతీయ మానవత్వం బొత్తిగా శూన్యం. ఈ విషయం చరిత్ర పుటల నిండా అమాయకుల నెత్తుటి మరకల రూపంలో కనిపిస్తూనే వుంటుంది. ముఖ్యంగా తన సైద్ధాంతిక శత్రువులైన కమ్యూనిస్టులు, సోషలిస్టులపై అమెరికన్ గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) జరిపించిన అమానుషాల చిట్టాకు చాంతాళ్ళు చాలవు. అమెరికా మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వాల శత్రువులను నడి రోడ్డు మీద ట్రక్కులతో తొక్కించి చంపించిన ఘనత కూడా దాని ఖాతాలో చేరి వుంది. అందుకోసం సైనిక, అర్ధసైనిక మృత్యు దళాలను అది పోషిస్తుంది. ఇరాన్, చిలి, గౌటెమాలా వంటి దేశాలలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూలదోయించి మానవ హక్కులను హరించిన గొప్పతనం కూడా అమెరికాదే.

ఆయా దేశాల్లోని సైనిక నియంతలను ప్రోత్సహించి అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాల గొంతు కోసిన హీన చరిత్ర దానిది. అటువంటి అత్యంత అమానుష గూఢచర్య శక్తులు కలిగి వున్న అమెరికా ఇప్పుడు తన మిత్ర దేశాల పైన కూడా నిఘా వుంచినట్టు తాజాగా లీకైన దాని రక్షణ శాఖ కార్యాలయ (పెంటగాన్) రహస్య పత్రాలు రుజువు చేస్తున్నాయి. మితిమించి ముదిరిపోయిన అమెరికా స్వార్థ క్రీడకు తనవారు, బయటి వారనే తేడా వుండదనే చేదు వాస్తవం ఒక భయంకర ఉగ్రవాది కంటే అధికంగా భయపెడుతున్నది. అత్యాధునిక సాంకేతిక నిఘా వ్యవస్థలతో అమెరికన్ గూఢచారులు జరిపే దుర్మార్గాలను గురించి చెప్పడానికి తగిన మాటలు లేవంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అమెరికా నిఘా సంస్థలు ఇప్పుడు ఉక్రెయిన్, ఈజిప్టు, దక్షిణ కొరియా, యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వంటి మిత్ర దేశాల రాజధానులు సహా ప్రపంచమంతటా కోరలు చాచుకొని పని చేస్తున్నాయని తెలియజేసే పెంటగన్ పత్రాలు గత ఫిబ్రవరి మాసాంతం నుంచి మార్చి ఆరంభం వరకు బహిర్గతమయ్యాయని అవి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొన్న గురువారం నాడు తెలియజేసింది.

ఈ పత్రాలు ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం మీద దృష్టి కేంద్రీకరించినప్పటికీ మిత్ర దేశాల సీనియర్ ప్రభుతాధికారుల మధ్య జరిగిన సంభాషణలు, వారి వ్యూహాలు, పథకాలు, ప్రణాళికలకు సంబంధించి సిఐఎ తన సిబ్బందికి జారీ చేసిన రహస్య ఆదేశాలు కూడా అందులో వున్నాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. 2013లో అడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసిన రహస్య పత్రాలు అంతకు ముందు పన్నెండేళ్ళ (2001 సెప్టెంబర్) క్రితం నుంచి అమెరికన్ గూఢచర్యల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చిందని వెల్లడించాయి. విదేశీ ఉగ్రవాద భయంతో అమెరికా తమ గూఢచర్యాన్ని ప్రపంచమంతటికీ వ్యాపింప చేయాలని సంకల్పించినట్టు ఆ పత్రాలు వెల్లడించాయి. మిత్ర దేశాలపై సిఐఎ పడగ నీడ పరుచుకోడంపై అమెరికా కూటమి దేశాల్లో అప్పట్లో ఆందోళనలు తలెత్తి తీవ్ర రూపం ధరించాయి. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మిత్రులపై నిఘా పెట్టడం తమకు ఎంత మాత్రం ఆమోదం కాదని జర్మనీ ఛాన్సలర్ అమెరికాఅధ్యక్షుడికి స్పష్టం చేశారు. పారిస్‌లో అమెరికా రాయబారిని పిలిపించి మందలించారు. ఇప్పుడు బయటపడిన అమెరికన్ నిఘా సమాచారంపై దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా తన మిత్ర దేశాల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నదని వారు వ్యాఖ్యానించారు. ఇతర మిత్ర దేశాలు ఈజిప్టు, ఇజ్రాయెల్, దక్షిణకొరియా, యుఎఇలు ఈ వార్తకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తాము ఏమనుకొన్నప్పటికీ అమెరికా ఈ దౌర్భాగ్యమైన నిఘా చర్యలను కొనసాగిస్తూనే వుంటుందనే ఒక రకమైన నిర్లిప్త భావనకు అవి లోనైనాయని అనుకొంటున్నారు. రొమేనియా, లిథువేనియాలు అమెరికన్ సిఐఎ తరపున ప్రత్యర్థులను దారుణంగా హింసించే చర్యలకు పాల్పడినట్లు 2018 మే లో యూరపు మానవ హక్కుల న్యాయస్థానం ధ్రువపరిచింది.

అమెరికా నౌకాదళానికి చెందిన చోదిత క్షిపణి విధ్వంసక వ్యవస్థపై బాంబు దాడుల వ్యూహ కర్తలని అనుమానిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను హింసించినట్టు అమెరికన్ సెనేట్ సెలెక్ట్ కమిటీ నిర్ధారించింది. ఇటువంటి చర్యల ద్వారా అమెరికా మరింత ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వాస్తవం దాచేస్తే దాగనిది. అంతర్జాతీయ ఉగ్రవాదం గురించి హద్దులు మీరిన ఆందోళనకు గురి కావడం ద్వారా అమెరికా మరింత ఉగ్రవాదాన్ని పోషిస్తున్నదని చెప్పక తప్పదు. దానిలోని ఈ భయాలు చివరికి తన మిత్ర దేశాల మీద కూడా నిఘా వుంచే వరకు దారి తీస్తున్నాయి. కంటి చూపుపై కనురెప్పే నిఘా వుంచడమంటే ఇదే. దీని వల్ల ప్రపంచానికి జరిగే హాని అంతఇంత అని చెప్పలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News