ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్
బయో ఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్ లో ఆమ్జెన్ కార్యకలాపాలు ప్రారంభం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయో-టెక్ రంగాల్లో అగ్రగామిగా ఉందని, ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించే లక్ష్యంతో తెలంగాణ అడుగులు వేస్తోందని చెప్పారు. హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూటెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది. సోమవారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో ని అమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించారు. అమ్జెన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, అమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, అమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఔషధాల శ్రేణిని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు అమ్జెన్ హైదరాబాద్ లో ఈ కొత్త సెంటర్ నెలకొల్పింది. ఏఐ, డేటా సైన్స్ డిజిటల్ సామర్థ్యాలతో ఇన్నోవేషన్ సైట్ గా దీన్ని అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి 200 మిలియన్లు (దాదాపు రూ.1600 కోట్లు) పెట్టుబడి పెడుతుంది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులకు ప్రణాళిక చేస్తోంది. దీంతో బయో ఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమ్జెన్ కార్యకలాపాల విస్తరణతో హైదరాబాద్ బయోటెక్ హబ్గా తన స్థానాన్ని మరింత బలోపేతమైందన్నారు. ‘గత ఏడాది ఆగస్ట్లో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లినప్పుడు ఆమ్జెన్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్‌ను సందర్శించానని, ఔషధాలపై పరిశోధన, కొత్త ఔషధ ఆవిష్కరణల ద్వారా ప్రజల జీవితాలను మార్చేందుకు అమ్జెన్ చేస్తున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నానన్నారు. తమతో భాగస్వామ్యం పంచుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున తగినంత సహకారం అందిస్తామని అప్పుడే ఆహ్వానించానని, ప్రపంచంలోనే పేరొందిన బయోటెక్ కంపెనీ ఆమ్జెన్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.
చైనా ప్లస్ వన్ గమ్యస్థానంగా హైదరాబాద్ ను ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పరిశ్రమల అభివృద్ధి, దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలను తప్పకుండా మా ప్రభుత్వం సహకరిస్తుందని, పరిశోధనలు, నైపుణ్యాల అభివృద్ధి, విద్యలో భాగస్వామ్యం పంచుకునే కార్యకమాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
సమ్మిళితంగా ఆవిష్కరణలకు కొత్త వేదిక : అమ్జెన్ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థలు రాష్ట్రానికి రావటం కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బయోటెక్, టెక్నాలజీ రెండింటి సమ్మిళితంగా ఆవిష్కరణలకు కొత్త వేదిక ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే హైదరాబాద్ వరల్ బయో టెక్ హబ్ గా మారుతుందని ఆకాంక్షను వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన సేవలందించడానికి, ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ తో పాటు సాంకేతికతను ఉపయోగించుకోవాలనే మా ప్రయత్నంలో ఈ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కొత్త మైలురాయిని సూచిస్తుందని అమ్జెన్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జ్క్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే అన్నారు.
సంస్థ విస్తరణకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో అమ్జెన్ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. ఈ సంస్థలో 28 వేల మంది ఉద్యోగులున్నారని, ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో లక్షలాది మంది రోగులకు ఆరోగ్యం అందించేందుకు అమ్జెన్ వినూత్నమైన ఔషధాలను కనుక్కొని తయారు చేస్తోందన్నారు. 40 ఏళ్ల కిందట అమ్జెన్ బయోటెక్ ఫార్మా పరిశ్రమను స్థాపించిందని, క్యాన్సర్, గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు, అరుదైన వ్యాధుల చికిత్సరే ఇప్పటికే ఉన్న ఔషధాలతో పాటు విస్తృతమైన, లోతైన పరిజ్ఞానంతో అమ్జెన్ తమ ఉత్పతులను అభివృద్ధి చేస్తోందని వివరించారు.