దేశాన్ని ప్రేమించే వాడిని …విద్వేషాలొద్దు
లాల్‌సింగ్ ఛద్ధా సినిమా బాయ్‌కాట్ వివాదం
ఐదేళ్ల నాటి ట్వీటు తెచ్చిన చేటు
దేశమంటే నచ్చని వ్యక్తిగా ప్రచారం
ముంబై: బాలీవుడు నటుడు అమీర్‌ఖాన్‌ను 2015 నాటి మోడీ వ్యతిరేక ట్వీటు ఇప్పుడు వేటాడుతోంది. సరిగ్గా ఆయన తాజా సినిమా లాల్‌సింగ్ ఛద్ధా ఈ నెల 11న విడుదల కావడానికి ముందు దేశభక్తుల నుంచి తీవ్రస్థాయి దాడిని ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాను చూడొద్దు, ఖాన్‌ను ఆదరించొద్దు అంటూ సోషల్ మీడియాలో ఉవ్వెత్తున నిరసనల పిలుపులు వెలువడుతున్నాయి. దీనితో ఈ లగాన్, ధంగల్, గజనీ సినిమాల విశేష ప్రఖ్యాతుడికి సినీ సిక్కుముడి తలెత్తింది. తన దేశాన్ని ప్రేమించే వ్యక్తిని అని, రాబోయే తన సినిమా ‘లాల్ సింగ్ ఛద్దా’ను బాయ్‌కాట్ చేయవద్దని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌లో ఇటీవల ఈ సినిమాను చూడకండనే ధోరణి వ్యక్తం అవుతూ వచ్చింది. దీనిపై మౌనంగా ఉంటూ వచ్చిన అమీర్‌ఖాన్ ఎట్టకేలకు ట్వీటు వెలువరించారు. తాను భారత్‌ను ప్రేమించే వ్యక్తిని కానని కొందరు భావిస్తూ ఉంటారు. అయితే ఇందులో నిజం లేదని ఖాన్ తెలిపారు.
ఈ దేశం అంటే తనకు అభిమానం, ప్రేమ అని స్పష్టం చేశారు. త్వరలో విడుదల అయ్యే లాల్‌సింగ్ ఛద్ధా హాలీవుడు క్లాసిక్ సినిమా ఫారెస్టు గంప్ రీమెక్‌గా వస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆయన పట్ల ఇప్పుడు విద్వేషపు ప్రచారానికి దారితీశాయి. దేశ భక్తులు ఈ ఖాన్ సినిమా చూడొద్దని ట్వీట్లు జోరందుకున్నాయి. తనపై విద్వేషప్రచారం, సినిమా చూడొద్దనే పిలుపులు తనకు బాధ కల్గిస్తున్నాయని, కొందరి దృష్టిలో తాను ఇండియా అంటే నచ్చని వ్యక్తిగా ఉన్నానని, ఇది మరింత దురదృష్టకరమని అన్నారు. వారి మదిలో తన పట్ల ఈ భావన నెలకొంది. అయితే ఇందులో నిజం లేదన్నారు. దయచేసి నా సినిమాను బాయ్‌కాట్ చేయకండి, చూడండని, చూసి చెప్పండని కోరుకుంటున్నానని తెలిపారు.
భారత్‌లో అసహన ధోరణులు పెరుగుతున్నాయని అమీర్‌ఖాన్ ఆ మధ్యలో వెలువరించిన ట్విట్టర్ ఇప్పుడు తిరగదోడుతూ సోషల్ మీడియాలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. సిన్మా నిర్మాతలు మేలో ఈ సినిమా ట్రయలర్ విడుదల చేసినప్పుడు కూడా అమీర్ ట్వీటును పొందుపరుస్తూ విమర్శలు వెలువడ్డాయి. 2015లో అమీర్ ఖాన్ వెలువరించిన ట్వీటులో మన దేశం ఘనమైన రీతిలో సహనశీల దేశం.అయితే ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని స్పర్థలను పెంచుతున్నారని, ఇవి విద్వేష విషబీజాలని తెలిపారు. ఇదే దశలో అమీర్‌ఖాన్ భార్య కిరణ్‌రావు మరింతగా స్పందిస్తూ తన పిల్లల రక్షణకు తాను ఇక దేశం విడిచి పోవాలని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు లాల్‌సింగ్‌కు బ్రేక్‌లుగా మారుతున్నాయి. లాల్‌సింగ్ ఛద్ధా సినిమాను అమీర్‌ఖాన్ సొంతంగా అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, కిరణ్‌రావు, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో కరీనా కపూర్, మోనాసింగ్, అక్కినేని చైతన్య సహనటులుగా ఉన్నారు.
Amir Khan Reacts to boycott ‘Lal Singh Chadha’ trend on twitter