Sunday, December 22, 2024

లాలూ కూటమి వస్తే మళ్లీ ‘జంగిల్ రాజ్’: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్‌జెడి చీఫ్ వెనుకబడిన తరగతుల (ఒబిసిల) సంక్షేమం కోసం గాని, తన కులం ‘యాదవ్’కు చెందినవారి సంక్షేమం కోసం గాని పాటుపడలేదని అమిత్ షా ఆరోపించారు. అరాహ్‌లో బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌కు మద్దతు కోసం ఒక ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, ‘మొండితనం ఉన్న’ ఇండియా కూటమిలో భాగమైన లాలూ ప్రసాద్ అధికారంలోకి వస్తే ‘బీహార్‌కు జంగిల్ రాజ్, అపహరణ, ముఠా యుద్ధం తిరిగి వస్తాయి’ అని ఆరోపించారు. ‘బీహార్‌లో జంగిల్ రాజ్, ముఠా పోరు, అపహరణ పరిశ్రమ పునరాగమనాన్ని జనం కోరుకోవడం లేదు. లాలూ బిసిల సంక్షేమం కోసం గాని, తన సొంత కులం ‘యాదవ్’కు చెందినవారి కోసం గాని కృషి చేయలేదు. తమ కోసం లాలూ పాటుపడతారనే దురభిప్రాయంతో వారు ఉన్నారు’ అని అమిత్ షా పేర్కొన్నారు.‘లాలూజీ తన ఇద్దరు కుమారులను మంత్రులను కానిచ్చారు, ఒక కుమార్తెను రాజ్యసభకు పంపారు, మరొకరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఆయన తన సతీమణిని బీహార్ ముఖ్యమంత్రిని చేశారు& ఆయన తన సంతానాన్ని మాత్రమే ప్రోత్సహిస్తారు. ఆయన సొంత కులస్థుల సంక్షేమం గురించి ఆలోచించరు’ అని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, ఆర్‌జెడి ‘ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిల కోటాల నుంచి రిజర్వేషన్‌ను హస్తగతం చేసుకుని ముస్లింలకు అటువంటి ప్రయోజనాలు చేకూర్చాయి’ అని బిజెపి సీనియర్ నేత అమిత్ షా ఆరోపించారు. ‘ప్రధాని నరేంద్ర మోడీజీ సారథ్యంలోని ఎన్‌డిఎ దీనిని జరగనివ్వదు. బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్, లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ వ్యతిరేకం’ అని అమిత్ షా అన్నారు. ‘అరాహ్ లోక్‌సభ సీటు నుంచి సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) కనుక గెలిచినట్లయితే బీహార్‌కు నక్సలిజం తిరిగి వస్తుంది’ అని అమిత్ షా అన్నారు. బిజెపి అభ్యర్థి ఆర్‌కె సింగ్ అరాహ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తుండగా, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) ‘మహాఘట్‌బంధన్’ అభ్యర్థిగా సుదామ ప్రసాద్‌ను నిలబెట్టింది. నియోజకవర్గంలో జూన్ 1న వోటింగ్ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News