కోల్‌కతా : దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (కా) అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నూతన పౌరచట్టాన్ని అమలు చేసి తీరుతుందని తెలిపారు. బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలకు బిజెపి ప్రచార సభలను ఆయన బుధవారం ప్రారంభించార. ఆరు నూరైనా దీనిని అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారని, సిఎం మమత బెనర్జీ కేవలం బుజ్జగింపులు, చొరబాట్లు, అవినీతి,
రాజకీయ కక్షలకు దిగారని విమర్శించారు. ఆమె వల్ల రాష్ట్రం పూర్తిగా నాశనం అయిందన్నారు. బయటి నుంచి తరలివస్తున్న పౌరులకు మమత బెనర్జీ సహాయ పడుతున్నారని, కొత్త చట్టం అమలు అయితే ఇక తన దుష్ట పన్నాగాలు సాగవని ఆమె భయపడుతున్నారని షా పేర్కొన్నారు. అందుకే కాను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టిఎంసిపాలనకు ప్రజలు ముందుకు రావల్సి ఉంది. అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేలా చూడాల్సి ఉందన్నారు.
టిఎంసి ఎంపీలకు పార్లమెంట్ పట్ల చులకన
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు పూర్తి స్థాయిలో వారి అధినేత్రి మమత బెనర్జీ అహంకార ధోరణి అలవడింది. వీరు చివరికి ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌ను, కట్టుబాట్లను పాటించడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ పార్టీ ఎంపి మహువా మొయిత్రా చివరికి తన లోక్‌సభ సభ్యత్వ సైట్ లాగిన్‌ను డబ్బుల కోసం తాకట్టు పెట్టారని , దీనిని బట్టి టిఎంసి ఎంపిలకు సభల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలుస్తోందన్నారు. సభలలో ప్రశ్నలు వేసేందుకు కూడా ఎంపిలు డబ్బులు తీసుకుంటున్నారంటే ఇక వీరి అవినీతి స్థాయి ఎంతవరకూ వెళ్లిందనేది ప్రజలు గుర్తించాల్సి ఉందన్నారు.