Thursday, January 23, 2025

చరిత్రను తిరిగి రాయండి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చరిత్రకారులు చరిత్రను తిరిగి రాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. అందుకు కేంద్రప్రభుత్వం కూడా సాయపడుతుందన్నారు. ఆయన ఢిల్లీలో అస్సాం ప్రభుత్వ ఫంక్షన్‌లో మాట్లాడుతూ “నేను చరిత్ర విద్యార్థిని. అనేక సందర్భాలలో మన చరిత్ర సరిగా రాయబడలేదని విన్నాను. బహుశా అది నిజమై ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దానిని సరిచేయాల్సి ఉంది” అని చెప్పుకొచ్చారు. “మన ఘనమైన చరిత్రను సరైన రీతిలో ముందుంచడానికి అడ్డుపడుతున్నది ఎవరు? అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను” అంటూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

17వ శతాబ్ది అహోమ్ ఆర్మీ జనరల్ లచిత్ బోఫుకన్ 400వ జన్మ దినోత్సవం మూడు రోజుల వేడుకలో రెండో రోజున ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. ఆ ఫంక్షన్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం జరిగింది. అందులో ఆయన ప్రసంగించారు. “ముందుకు రండి, మన చరిత్రను తిరిగి రాయండి. దీంతోనే మనం మన భవిష్యత్తు తరాన్ని ఉత్తేజపరచగలం” అని ఆయన చరిత్రకారులనుద్దేశించి అన్నారు. కనీసం 10 దేశ భాషలలో అహోం జనరల్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రచురించాల్సిందిగా ఆయన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వను కోరారు. ఈ ఫంక్షన్‌కు కేంద్ర మంత్రులు శరబానంద సోనోవాల్, రామేశ్వర్ తెలి, అస్సాం క్యాబినెట్ మంత్రి పిజూష్ హజారికా, పార్లమెంటు సభ్యులు తపన్ గొగోయ్, రంజన్ గొగోయ్, అస్సాం శాసనసభ స్పీకర్ బిశ్వజిత్ దైమరి తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News