Wednesday, January 22, 2025

మీరే తేల్చుకోండి

- Advertisement -
- Advertisement -

KCR Speech at TRSLP Meeting

తెలంగాణ జల వివాదాలపై దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా 
వివాదాలను పరిష్కరించే బాధ్యత కౌన్సిల్‌దే

మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు చర్చలు జరుపుకొని, పరస్పర ఒప్పందాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచించారు. శనివారం తిరువనంతపురంలో 30వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఆధ్వర్యంలో జరిగింది. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అం శాలపై చర్చించారు. మొత్తం 26 సమస్యలపై చర్చించగా, తొమ్మిది సమస్యలు పరిష్కరించారు. మిగిలిన 17 సమస్యలు తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. పరిష్కరించిన తొమ్మిది సమస్యలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు‘ సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని అమిత్ షా కోరారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నదీ జలాల పంపిణీకి ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణాది రాష్ట్రాలను కోరారు. పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులకు సూచించారు. దక్షిణాదిలోని అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలలో తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి సమస్య, తెలంగాణ, ఎపిలకు సంబంధించిన కృష్ణా నదీ జలాల భాగస్వామ్య వివాదం ఉందన్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ నుంచి హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.హరిరామ్, ట్రాన్సోకో జెఎండిసి శ్రీనివాసరావు, అడిషనల్ డిజిపి స్వాతిలక్రా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఐదు కౌన్సిల్‌లలో ఒకటైన సదరన్ జోనల్ కౌన్సిల్, రాష్ట్రాల మధ్య సమన్వయంతో సమిష్టి చర్యకు అవసరమయ్యే ఉమ్మడి విషయాలపై చర్చించి సిఫార్సులు చేసే అధికారాన్ని కలిగి ఉన్న చట్టబద్ధమైన సంస్థ అన్నారు. రాష్ట్రాల మధ్య పునర్ -వ్యవస్థీకరణతో సంబంధం ఉన్న, ఉత్పన్నమయ్యే ఏదైనా అంశంపై చర్చించే బాధ్యత కూడా సదరన్ జోనల్ కౌన్సిల్ పై ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు అన్నారు.
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడతూ అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ రాష్ట్రం తక్కువ వ్యవధిలో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. జాతీయ జిడిపి 2014- 15లో 4.1 శాతం నుంచి 2021- 22లో 4.9 శాతానికి మెరుగైన తోడ్పాటును అందించింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టడంలో ముందుంది. నీటి పారుదల అభివృద్ధి, పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపూర్వక వ్యవస్థ, టిఎస్ ఐపాస్ ప్రవేశపెట్టడం, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం, రైతులకు పెట్టుబడి మద్దతు (రైతుబంధు) మొదలైన అనేక కార్యక్రమాల కారణంగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా, స్థిరంగా ఉందన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, తెలంగాణ జిఎస్‌డిపి ప్రస్తుత ధరల ప్రకారం 2020- -21లో 1.21 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసిందన్నారు.అంతర్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కౌన్సిల్ ప్రశంసనీయమైన పని చేస్తోందని మహమూద్ అలీ అన్నారు. సమావేశపు ఎజెండాలో పేర్కొన్న అంశాలన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో అనవసర జాప్యం పట్ల తెలంగాణ ప్రత్యేకంగా ఆందోళన చెందుతోందన్నారు. రాష్ట్రం అవతరించి 8 సంవత్సరాలుగా గడిచింది.
ఉద్యోగుల విభజన, ప్రభుత్వ, ఇతర సంస్థల ఆస్తులు, -అప్పులకు సంబంధించిన వివిధ సమస్యలను తెరపైకి తెస్తుందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి అన్ని సమస్యల పరిష్కరించడానికి, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో శ్రద్ధగా పనిచేస్తోందన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, వివిధ క్లిష్టమైన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా, ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానని మహమూద్ అలీ అన్నారు. విభజన సమస్యలను ఎపి ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి వారు ప్రస్తావించారు. అదే విధంగా ఎపి, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఆర్థిక శాఖ, హోంశాఖ అధికారులు పాల్గొన్నారు.

Amit Shah asks southern states to explore solution for water issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News