టిఎంసి నుంచి పెద్ద ఎత్తున వలసలు?
కోల్‌కత: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో పార్టీ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర హోం మంతి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన కోల్‌కత చేరుకుంటారని పార్టీ వర్గాఉ తెలిపారు. అధికార తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)తో, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలితో విభేదించి టిఎంసికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగా ఆ పార్టీపై తిరుగుబాటు చేస్తున్న తరుణంలో అమిత్ షా బెంగాల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
మమతా బెనర్జీ మంత్రివర్గానికి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ, బహిష్కృత టిఎంసి ఎమ్మెల్యే వైశాలి దాల్మియా, ఉత్తరపర ఎమ్మెల్యే ప్రవీర్ ఘోషల్ తదితరులు అమిత్ షా పర్యటన సందర్భంగా బిజెపిలో చేరే అవకాశముందని ఊహాగానాలు జోరందుకున్నాయి. శనివారం ఉదయం మాయాపూర్‌లోని ఇస్కాన్ మందిరాన్ని అమిత్ షా సందర్శిస్తారని, అనంతరం ఆయన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్‌నగర్‌కు వెళతారని బిజెపి రాష్ట్ర నాయకుడు ఒకరు తెలిపారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బిజెపి సోషల్ మీడియా సెల్‌తో ఏకాంతంగా చర్చలు జరుపుతారని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై పార్టీ నాయకులతో సమావేశం జరుపుతారని ఆయన తెలిపారు.
శ్రీ అరబిందోకు నివాళులర్పించేందుకు అరబిందో భవన్‌ను ఆదివారం ఉదయం అమిత్ షా సందర్శిస్తారని ఆయన చెప్పారు. అక్కడ నుంచి భారత్ సేవాశ్రమ్ సంఘకు వెళతారని, అనంతరం హౌరాలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సాయంత్రం బేలూరు మఠాన్ని సందర్శిస్తారని చెప్పారు. హౌరాలో జరిగే అమిత్ షా ర్యాలీలో కొన్ని సంచలనాలు ఉంటాయని బిజెపి వర్గాలు తెలిపాయి. బిజెపిలో చేరే టిఎంసి నాయకుల జాబితాలపై సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా ప్రచారం అవుతున్నాయని, అయితే ఆదివారం అనేక సంచలనాలు మీరు వింటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.
Amit Shah Bengal tour starts from tomorrow