Thursday, January 16, 2025

జెకెలో భద్రత పరిస్థితిపై అమిత్ షా సమీక్ష

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లోని ఇటీవలి ఉగ్ర దాడుల నేపథ్యంలో అక్కడి భద్రత పరిస్థితిపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం అధ్యక్షత వహించారు. ఉగ్ర నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు స్థూలంగా మార్గదర్శక సూత్రాలను అమిత్ షా సమావేశంలో నిర్దేశించినట్లు అధికార వర్గాలు ‘పిటిఐ’కి తెలియజేశాయి. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై హోమ్ శాఖ మంత్రికి పూర్తిగా తెలియజేసినట్లు కూడా ఆ వర్గాలు చెప్పాయి. రానున్న రోజుల్లో ఉగ్ర నిరోధక కార్యకలాపాలను భద్రత బలగాలు ఉద్ధృతం చేయవచ్చునని వారు సూచించారు. ప్రధానిఆదేశానికి అనుగుణంగా ఉగ్రవాదులపై చర్యలు సాగుతాయని వారు తెలిపారు. జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ డెకా, సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాళ్ సింగ్,

జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్‌ఆర్ స్వెయిన్, ఇతర ఉన్నత భద్రత అధికారులు ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వార్షిక అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలను కూడా హోమ్ శాఖ మంత్రి సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిస్థితి, అంతర్జాతీయ సరిహద్దు పొడుగునా దళాల మోహరింపు, చొరబాటు యత్నాలు, ప్రస్తుతం సాగుతున్న ఉగ్ర నిరోధక కార్యకలాపాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య గురించి మంత్రికి వివరించారు. నార్త్ బ్లాక్‌లో అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగడానికి మూడు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి సమావేశమే నిర్వహించారు. యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై దాడితో సహా ఉగ్ర సంఘటనల పరంపర అనంతరం ‘ఉగ్ర నిరోధక సామర్థంతో పూర్తిగా దళాలను’ మోహరించాలని అధికారులను ప్రధాని ఆ సమావేశంలో ఆదేశించారు.

క్రితం వారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి, కథువా, దోడా జిల్లాల్లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు దాడులు జరిపి తొమ్మిది మంది యాత్రికులను, ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్‌ను హతమార్చారు. వారి దాడుల్లో ఏడుగురు భద్రత సిబ్బంది, పలువురు ఇతరులు గాయపడ్డారు. కథువా జిల్లాలో భద్రత బలగాలతో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు కూడా మరణించారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News