బళ్లారి: కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్న ఇనుప గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డి గురించి పటించుకోవడం మాని ఓటర్లను నేరుగా కలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్-కర్నాటక ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులకు హితబోధ చేశారు. కల్యాణ కర్నాటకగా కూడా పిలిచే హైదరాబాద్-కర్నాటక ప్రాంతానికి చెందిన నాయకులతో గురువారం అమిత్ షా సమావేశమై రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
బిజెపి నుంచి వేరుపడి కల్యాణ కర్నాటక ప్రగతి పక్ష(కెకెజెపి) పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్న గాలి జనార్దన రెడ్డి బళ్లారి, విజయనగర, కొప్పల్, రాయచూర్ జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తూ తనపై ఇడి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు జరిపినా తన విజయాన్ని అడ్డుకోలేరంటూ చేస్తున్న ప్రకటనలను స్థానిక నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గంగావతి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని, బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తన భార్య పోటీ చేస్తుందని ఇటీవలే జనార్దన రెడ్డి ప్రకటించిన విషయాన్ని కూడా వారు తెలియచేశారు. గాలి జనార్దన రెడ్డి కారణంగా బిజెపి విజయావకాశాలు దెబ్బతిని కాంగ్రెస్ లబ్ధి పొందవచ్చన్న అనుమానాలను కూడా వారు వ్యక్తం చేయగా అమిత్ షా వాటిని కొట్టిపారేశారు. గాలి జనార్దన రెడ్డి గురించి పట్టించుకోవద్దని, అన్నీ తాను చూసుకుంటానని, పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసునని వారికి అమిత్ షా హామీ ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి.