Monday, December 23, 2024

ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే జమిలి ఎన్నికలు:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రస్తుత హయాంలోనే జమిలి ఎన్నికల విధానం అమలు పరచగలదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడవ విడతలో 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో అమిత్ షా ప్రసంగిస్తూ, ‘ఈ ప్రభుత్వ హయాంలోనే ఒక దేశం, ఒకే ఎన్నికల విధానం అమలుకు మేము యోచిస్తున్నాం’ అని తెలియజేశారు. విలేకరుల గోష్ఠిలో అమిత్ షా వెంట కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు. క్రితం నెల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ జమిలి ఎన్నికల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. తరచు ఎన్నికల వల్ల దేశ పురోగతికి అవరోధాలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.
కాగా, దేశంలో జన గణన నిర్వహణపై ప్రభుత్వం ‘అతి త్వరలోనే’ ప్రకటన చేస్తుందని హోమ్ శాఖ మంత్రి తెలియజేశారు.

కొవిడ్19 మహమ్మారి వల్ల వాయిదా పడిన భారత దశాబ్డపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై ప్రశ్నకు అమిత్ షా సమాధానంఇస్తూ, ‘మేము అతి త్వరలోనే ఆ విషయం ప్రకటిస్తాం’ అని చెప్పారు. కుల గణనపై ప్రశ్నలకు అమిత్ షా సమాధానంఇస్తూ, ‘జన గణన గురించి మేము ప్రకటించినప్పుడు అన్ని వివరాలూ వెల్లడిస్తాం’ అని తెలిపారు. భారత్ 1881 నుంచి ప్రతి పది సంవత్సరాలకు జన గణన నిర్వహిస్తున్నది. ఈ దశాబ్దపు జన గణన తొలి దశను 2020 ఏప్రిల్ 1న ప్రారంభించవలసి ఉన్నది. కానీ కొవిడ్19 మహమ్మారి కారణంగా దానిని వాయిదా వేయవలసి వచ్చింది. కుల గణన నిర్వహించాలని రాజకీయ పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా జన గణనపై ఆ వ్యాఖ్యలు చేశారు. తాజా డేటా లేని కారణంగా ప్రభుత్వ సంస్థలు 2011 సెన్సస్ డేటా ప్రాతిపదికపై విధానాల రూపకల్పనకు. సబ్సిడీల కేటాయింపునకు ఇప్పటికీ పూనుకుంటున్నాయి.

మణిపూర్‌లో చిరకాల శాంతి స్థాపనకు కృషి
మణిపూర్‌లో చిరకాల శాంతి నెలకొనేలా చూసేందుకు ప్రభుత్వం మైతై, కుకీ తెగలు రెండింటితో మాట్లాడుతున్నదని, చొరబాటును నియంత్రించేండుకు మయన్మార్‌తో సరిహద్దులో కంచె వేయడం ప్రారంభించినట్లు హోమ్ శాఖ మంత్రి తెలియజేశారు. క్రితం వారంలో మూడు రోజులు జరిగిని హింసాత్మక సంఘటనలు మినహా మణిపూర్‌లో మొత్తం మీద పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఆ కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో ప్రశాంతత పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. ఆ మూడు రోజుల హింసాకాండ మినహా గడచిన మూడు మాసాల్లో ప్రధాన ఘటనలు ఏవీ చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు. ‘గడచిన మూడు రోజుల్లో ప్రశాంతత నెలకొన్నది. పరిస్థితిని అదుపు చేయగలమని ఆశిస్తున్నాం. మేము రెండు తెగలతో మాట్లాడుతున్నాం.

అవి జాతుల మధ్య దౌర్జన్య సంఘటనలు. రెండు తెగల మధ్య సంభాషణలు లేనిదే ఎటువంటి పరిష్కారమూ సాధ్యం కాదు’ అని హోమ్ శాఖ మంత్రిచెప్పారు. ‘మేము కుకీ, మైతై తెగలతో మాట్లాడుతున్నాం. మేము ఒక రోడ్‌మ్యాప్ రూపొందించాం. (శాంతి సాధనకు) సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకుంటాం’ అని అమిత్ షా తెలియజేశారు. మణిపూర్ వ్యాప్తంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని మోహరించినట్లు ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వ మూడవ విడత తొలి 100 రోజుల్లో భారత్, మయన్మార్ సరిహద్దు కంచె వేసే పని మొదలైందని ఆయన చెప్పారు.

రైలు ప్రమాదాల మూల కారణంపై దర్యాప్తు జరిపిస్తాం
ఇదిఇలా ఉండగా, రైలు ప్రమాదాలకు ఏ కుట్ర అయినా చిరకాలం సాగదని, దేశవ్యాప్తంగా లక్షా పది వేల కిలో మీటర్ల రైల్వే నెట్‌వర్క్ పరిరక్షణకు ప్రభుత్వం త్వరలోనే ఒక పథకం ప్రవేశపెట్టగలదని హోమ్ శాఖ మంత్రి చెప్పారు. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. వాటిలో చాలా వరకు విద్రోహ చర్యలుగా కనిపించాయి. ఎందుకంటే రైలు పట్టాలపై బండరాళ్లు వంటి అవరోధాలు ఏర్పాటు చేశారు. రైల్వే భద్రత అంశంపై తాను గత రెండు రోజుల్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్లు అమిత్ షా తెలియజేశారు. ‘ప్రమాదాలకు సంబంధించినంత వరకు వాటికి మూల కారణంపై దర్యాప్తు జరిపిస్తాం. కారణం ఏదైనా ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నది. అది కుట్ర అయినట్లయితే దీర్ఘ కాలం కొనసాగదు. లోపాలు ఉంటే సరిచేస్తాం’ అని అమిత్ షా చెప్పారు. విద్రోహ చర్య ఏదీ లేకుండా చూసేందుకు రైల్వే నెట్‌వర్క్ పరిరక్షణకు సిబిఐ, ఎన్‌ఐఎ, రైల్వే పోలీస్ దళం, హోమ్ మంత్రిత్వశాఖ ఒక పథకాన్ని రూపొందిస్తున్నాయని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News