ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాది(ఎస్‌పి) కూటమి తుడిచి పెట్టుకు పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ను యువరాజులుగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని సహరన్‌పూర్, బిజ్నోర్, కైరానా, ముజఫర్‌నగర్, నగీన(రిజర్డ్), మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్ సీట్లలో శుక్రవారం పోలింగ్ జరిగింది. కాగా..అంతకుముందు మీరట్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాతావరణం మారిపోయిందని, తొలి దశ పోలింగ్‌లో ప్రజలు బిజెపిని తరిస్కరించారని చెప్పారు. కాగా..మథుర నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎంపి హేమమాలిని తరఫున బృందావనంలో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగిస్తూ రూ. 12 లక్షల కోట్ల కుంభకోణాలు,
అవినీతికి పాల్పడిన కాంగ్రెస్, ఎస్‌పి ఒకవైపు, 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్కపైసా అవినీతి మరక అంటని నరేంద్ర మోడీ మరో వైపు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు రెండు శిబిరాలు ఉన్నాయని, పేద కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడీ ఒకవైపు, సంపన్న కుటుంబంలో జన్మించిన రాహుల్ గాంధీ మరో వైపు ఉన్నారని, ఆ ఇద్దరిలో ఒకరిని ప్రజలే ఎంచుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. 2017లో ఇద్దరు యువరాజులు కలిసి పోటీ చేశారని, మళ్లీ 2024లో కూడా కలిశారని, ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యధిక సీట్లను బిజెపి గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుదని ఆయన చెప్పారు. అలాగే కశ్మీరులో 370 అధికరణ రద్దు కూడా ఆయన ఘనతేనని చెప్పారు. మథురతోపాటు అమ్రోహ, మీరట్, బాగ్‌పట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్ సీట్లకు రెండవ దశ కింద ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్నది.