Wednesday, January 22, 2025

మోడీ కులాన్ని ఒబిసిలో చేర్చింది కాంగ్రెస్సే: రాహుల్ కు అమిత్ షా కౌంటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కులంపై చర్చ జరగడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బాహాటంగా అసత్యాలు పలకడం అలవాటు అని, ఆయన వాటిని పదే పదే వల్లె వేస్తుంటారని అమిత్ షా ఆరోపించారు. మోడీ కులాన్ని ఇతర వెనుకబడిన తరగతలు (ఒబిసిల) జాబితాలో 1994 చేర్చింది గుజరాత్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రధాని కులాన్ని తమ ఒబిసి జాబితాలో కేంద్రం చేర్చింది 2000లో అని అమిత్ షా తెలియజేశారు. ‘మోడీ కులాన్ని 1994 జూలై 25న ఒబిసిగా గుజరాత్‌లో చేర్చారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఛబిల్‌దాస్ మెహతా. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్.

మోడీ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు. ఆయన సంస్థ కోసం మాత్రమే పని చేస్తుండేవారు. ఆయన కులం ప్రస్తావన అసలుకే రాలేదు. ఆ తరువాత గుజరాత్ ప్రభుత్వం ఆయన కులాన్ని కేంద్ర ఒబిసి జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. అది చివరకు 2000లో కేంద్ర ఒబిసి జాబితాలో చేరింది. ఆ సమయంలో కూడా మోడీ ఎంపిగా లేదా ఎంఎల్‌ఎగా లేదా కనీసం సర్పంచ్‌గా పదవిలో లేరు.ఆయన 2001లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వ్యక్తులకు వాస్తవాల వక్రీకరణ అలవాటు’ అని అమిత్ షా న్యూఢిల్లీలో ‘ఇటి నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటు అని, ఆయన వాటిని ఆ తరువాత పునరావృతం చేస్తుంటారని మంత్రి ఆక్షేపించారు.

‘ఇక మోడీ కులానికి సంబంధించినంత వరకు నరేంద్ర మోడీ వంటి ప్రపంచ స్థాయి మహోన్నత నేత కులంపై చర్చ జరగడం అత్యంత దురదృష్టకరం. కులానికి, బ్లాక్‌కు మధ్య అంతరం రాహుల్ గాంధీకి తెలియదు’ అని అమిత్ షా అన్నారు. తాను ఒబిసిని అని, ఒబిసి ఒక బ్లాక్ అంతే, కులం కాదు అని మోడీ చెప్పారు అని హోమ్ శాఖ మంత్రి తెలిపారు. ఈ విషయం రాహుల్‌కు ఆయన గురువులు బోధించి ఉండకపోవచ్చు అని అమిత్ షా అన్నారు.

‘కులానికి సంబంధించినంత వరకు, సమస్త ప్రపంచం ఒక నేతగా ఆమోదించిన మోడీ వంటి గొప్ప నేత కులం గురించి ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు మేము సమాధానంఇవ్వవలసి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం’ అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ ఈ ప్రశ్న లేవనెత్తినందున ఒబిసి కోసం ప్రతిపక్షం ఏమి చేసిందని తాను అడగాలని అనుకుంటున్నా అని బిజెపి నేత అమిత్ షా చెప్పారు.

‘కాకా కలేల్కర్ నివేదిక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. వారు ఏమీ చేయలేదు. అటు పిమ్మట మండల్ కమిషన్ నివేదిక వచ్చింది. వారు ఏళ్ల తరబడి ఏమీ చేయలేదు. కాంగ్రెస్ అధికార చ్యుతి పొందేంత వరకు మండల్ కమిషన్ నివేదిక అమలు జరగలేదు’ అని ఆయన విమర్శించారు. ఒబిసికి రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చింది మోడీ అని, ఒబిసి కమిషన్‌ను ఏర్పాటు చేసిందిన మోడీ అని హోమ్ శాఖ మంత్రి చెప్పారు. ‘అన్ని కేంద్ర పరీక్షలలో ఒబిసి కోసం రిజర్వేషన్లు తెచ్చింది మోడీ. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఒబిసి వ్యతిరేక పార్టీ’ అని అమిత్ షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News