హైదరాబాద్ విముక్తి దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన హోం మంత్రి అమిత్ షా
హైదరాబాద్: హైదరాబాద్ విముక్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారంనాడు అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, రజాకార్ల భయంతో ఆ దినోత్సవాన్ని జరుపుకోకుండా వెనుకంజవేస్తున్న వారిపై ఆయన విరుచుకుపడ్డారు. ఇక్కడ జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో షా ప్రసంగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు అందులో పాల్గొన్నారు. సర్దార్ పటేల్ లేకపోతే, హైదరాబాద్‌కు విముక్తికి చాలా ఏళ్లు పట్టేదని, నిజాం రజాకార్లను ఓడించనంత కాలం ‘అఖండ భారత్’ కల నెరవేరేది కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
‘‘ఎన్నికల సమయంలో చాలా మంది విమోచన దినోత్సవం జరుపుకుంటామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రజాకార్ల భయంతో వెనుకంజవేశారు’’ అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని మోడీ నిర్ణయించినప్పుడు, అందరూ దానిని స్వాగతించారన్నారు.
“వారైతే వేడుక జరుపుకుంటున్నారు, కానీ హైదరాబాద్ విమోచన దినోత్సవంగా కాదు, వారికి ఇంకా భయం ఉంది. నేను వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ గుండె నుండి భయాన్ని తొలగించండి, 75 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కనుక రజాకార్లు ఈ దేశానికి సంబంధించిన నిర్ణయాలు ఇక తీసుకోలేరు” అని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17, 1948న ‘ఆపరేషన్ పోలో’ అనే కోడ్‌నేమ్‌తో కూడిన పోలీసు చర్యతో భారత్(యూనియన్ ఆఫ్ ఇండియా)లో విలీనం అయిందని తెలిపారు.