Friday, December 20, 2024

మజ్లిస్ కోటలో అమిత్ షా

- Advertisement -
- Advertisement -
కాషాయమయంగా మారిన పాత బస్తీ
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీ లతను
గెలిపించి పాత బస్తీ అభివృద్ధికి బాటలు వేయాలి
రోడ్ షోలో కేంద్ర హోం మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : మజ్లిస్‌కు కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. తిరుగులేని శక్తిగా ఉన్న మజ్లిస్ స్థానంలో బిజెపి జెండా ఎగురవేసేందుకు బుధవారం రాత్రి భారీ రోడ్ షో నిర్వహించారు. మజ్లిస్ ఇలాఖా అంతా కాషామయంగా మారింది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న మాధవీ లతకు మద్దతుగా ఈ రోడ్ షో నిర్వహించారు. పాతబస్తీకి చేరుకున్న అమిత్ షా తొలుత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాల్ దర్వాజ నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మాధవీలతకు మద్దతుగా అమిత్‌షా రోడ్ షోలో పాల్గొన్నారు.

రోడ్ షోలో బిజెపి నాయకులతో కిక్కిరిసింది. రోడ్ షో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మాధవీ లతకు మద్దతు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. జై శ్రీరామ్, జై హింద్ నినాదాలతో ముందుకు సాగారు. పాత బస్తీ రోడ్లన్నీ బిజెపి కార్యకర్తలు,నాయకులతో నిండిపోయింది. రోడ్ షో ముగిసే సరికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాత్రి పది గంటల సమయం కావడంతో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై రెండే రెండు నిమిషాలు హడావుడిగా ప్రసంగించి ముగించారు.

గత 40 ఏళ్లలో మజ్లిస్‌పాలనలో పాతబస్తీ ఏమాత్రం బాగుపడలేదని, బిజెపి అభ్యర్థి, సోదరి మాధవీలతను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో బిజెపి దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించి మోడీ మూడోసారి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. దీంతొ అప్పటికే సమయం పూర్తవడంతో స్థానిక బిజెపి నాయకులు సూచించడంతో అమిత్ షా ప్రసంగాన్ని నిలిపివేశారు. అమిత్ షా వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, అభ్యర్థి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News