Monday, January 20, 2025

అగ్నికి ఆజ్యం పోయొద్దు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిపూర్‌లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని అన్నారు. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ మణిపూర్‌లో హింస తగ్గుముఖం పడుతూ ఉందని అంటూ అగ్నికి ఆజ్యం పోయవద్దని విపక్షాలకు హితవు చెప్పారు.‘మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరిగాయన్న విపక్షాల వాదనలతో నేను అంగీకరిస్తున్నాను. మణిపూర్‌లో హింస సిగ్గుచేటు. అయితే దాన్ని రాజకీయం చేయడం మరింత సిగ్గుచేటు’ అని మణిపూర్ ఘర్షణలపై మాట్లాడుతూ అమిత్ షా అన్నారు. మణిపూర్‌లో రాజకీయం చేయడానికే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని అమిత్ షా విమర్శించారు.హెలికాప్టర్ ద్వారా చురచంద్‌పూర్ వెళ్లాలని తాము ఆయనకు చెప్పామని, అయితే ఆయన అందుకు నిరాకరించి రోడ్డు మార్గంద్వారా వెళ్లడానికి యత్నించారని, అందుకే పోలీసులు ఆయనను అడ్డుకున్నారని చెప్పారు.

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తనను ఎంతగానో బాధించాయన్నారు. అక్కడ జరిగిన ఘరణల్లో 152 మంది మరణించారని వెల్లడించారు. ఈ ఘర్షణలకు సంబంధించి 14,898 మంది అరెస్టయ్యారన్నారు. మణిపూర్ ఘటనలపై 1,106 కేసులు నమోదయ్యాయన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వీడియోను కొందరు వైరల్ చేశారన్నారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చాక చర్యలు తీసుకున్నామన్నారు. మయన్మార్, మిజోరాంలనుంచి వేలాదిమంది కుకీ ఆదివాసీలు మణిపూర్‌లోకి వస్తున్నారని, ఇది వేరే వర్గాల్లో అభద్రతా భావానికి కారణమయిందన్నారు. ఇదే అల్లర్లకు ప్రధాన కారణమన్నారు. మణిపూర్‌లో యుపిఎ హయాంలో కూడా రెండు తెగల మధ్య ఘర్షణలు జరిగాయని చెప్పారు. 1993లో జరిగిన ఘర్షణల్లో 700 మందికి పైగా చనిపోయారని, అప్పట్లో ఏడాదిన్నర పాటు హింస కొనసాగిందన్నారు. గతంలో చాలా సందర్భాల్లో సహాయమంత్రులే దీనిపై లోక్‌సభలో సమాధానాలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు ఉభయసభలును స్తభింపజేస్తున్నాయన్నారు.

మే 3 వరకు మణిపూర్‌లో కర్ఫూ విధించాల్సిన అవసరం రాలేదన్నారు. మణిపూర్‌లో ఆరేళ్లుగా బిజెపి ప్రభుత్వం ఉంది. అక్కడ ఉగ్రవాదుల హింసాకాండను అంతమొందించిందన్నారు.మణిపూర్‌లో ఘటనల నేపథ్యంలో సిఎస్, డిజిపిలను బదిలీ చేశాం.సిఎం బీరేన్ సింగ్‌ను ఎందుకు తొలగించలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.సిఎం సహకరిస్తున్నందునే ఆయనను తొలగించలేదు. రాష్ట్రంలో పరిస్థితులు క్రమేపీ కుదుట పడుతున్నాయని చెప్పారు. మణిపూర్‌లో తాను మూడు రోజుల పాటు ఉండి పరిస్థితులను సమీక్షించానన్నారు. కేంద్ర సహాయమంత్రి 23 రోజులు ఉన్నారని చెప్పారు.‘మొదటి నుంచీ మణిపూర్ అంశంపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రతిపక్షాలకు చర్చ అవసరం లేదు. వాళ్లకు నిర్మాణాత్మకమైన చర్చకన్నా గొడవ ముఖ్యం. ప్రతిపక్షాలు నేను మాట్లాడడం ఇష్ట లేదు. అయితే వాళ్లు నానోరు మూయించలేరు. 130 కోట్ల మంది మమ్మల్ని ఎన్నుకున్నారు. అందువల్ల వాళ్లు మేం చెప్పేది వినాలనుకుంటున్నారు’ అని అమిత్ షా చెప్పారు.

పరిస్థితులు చక్కబడడానికి మెయితీలు, కుకీలు ప్రభుత్వంలో సహకరించాలి, రెండు తెగలతోను చర్చలు జరుపుతున్నామని చెప్పిన అమిత్ షా చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, హింసను విడనాడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఇరువర్గాలను చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. దాదాపు రెండు గంటల పాటు అమిత్ షా ప్రసంగించిన అనంతరం లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ సమాధానమిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News