Monday, December 23, 2024

కసరత్తు షురూ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం ఇక్కడ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లారు. దాదాపు గంట సేపు మాజీ రాష్ట్రపతితో చర్చలు జరిపారు. దేశంలో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (జమిలి) విధానం సాధ్యాసాధ్యాల పరిశీలనకు , త్వరితగతి నివేదిక సమర్పణకు రామ్‌నాథ్ కోవింద్ సారధ్యంలో ఇటీవలే ఎనమండుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు అయింది. ఇప్పుడు ఇరువురు కీలక కేంద్ర మంత్రులు కోవింద్ నివాసాకి వెళ్లి ఆయనతో ఇతర సభ్యుల ప్రమేయం లేకుండా చర్చించడం కీలక అంశంగా మారింది. జమిలి కమిటి తరఫున తమది కోవింద్‌జీతో జరిపిన తొలి అధికారిక మర్యాదపూర్వక సమావేశం అని అక్కడున్న విలేకరులతో అమిత్ షా చెప్పారు. ఇది తొలి భేటీనా? ఏదైనా నిర్ణయం జరిగిందా? ఇక ముందు జమిలిపై ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు ఇద్దరూ జవాబివ్వలేదు. ఇక ముందు జరగబోయే అధికారిక తొలి భేటీకి ఇది ముందస్తు సమావేశంగా భావించాల్సి ఉంటుందని అమిత్ షా తెలిపారు.

అయినా పెద్దాయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు ఈ దశలో న్యాయశాఖ మంత్రి వివరించి వెళ్లారు. రామ్‌నాథ్ కోవింద్ కమిటీ తొలి భేటీ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనేది త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు. సభ్యులంతా భేటీకి హాజరు అవుతారా? అనేది చెప్పలేమని కూడా అన్నారు. ఎన్నిసార్లు భేటీలు జరుగుతాయి? అనేది చెప్పలేమన్నారు. అయితే జమిలి కమిటి పరిశీలన ప్రక్రియను వేగిరపర్చేందుకు మాజీ రాష్ట్రపతి వద్దకు కేంద్ర మంత్రులు వచ్చినట్లు వెల్లడైంది. కాగా ప్యానల్‌కు ఎప్పటికప్పుడు సహకరించేందుకు అవసరం అయిన ఆఫీసర్లను నియమించేందుకు న్యాయమంత్రిత్వశాఖ సిద్ధం అయింది. తమ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి న్యాయపరమైన అంశాలను పొందుపర్చేందుకు కసరత్తు చేస్తోంది. కాగా రామ్‌నాథ్ కోవింద్ సారధ్యం గురించి ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఇప్పటికీ కోవింద్ నుంచి దీనికి సంబంధించి సమ్మతి విషయంలో అధికారికప్రకటన ఏదీ వెలువడలేదు. కాగా కమిటీలో కాంగ్రెస్ నాయకులు అధీర్ రంజన్ చౌధురి పేరును ప్రభుత్వం ప్రకటించింది. కానీ తాను ఇందులో ఉండబోనని ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News