Friday, November 15, 2024

తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్
గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల పట్ల నేతల నిర్లక్ష్యంపై చర్చ
లిక్కర్ స్కామ్‌పై మీడియాలో ఎందుకు మాట్లాడాతారు
నేతలకు అక్షింతలు
హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతల మధ్య ఐక్యత లోపంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. గ్రూపు రాజకీయాల పట్ల అగ్రహం వ్యక్తం చేసింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లపై కొందరు నేతల నిర్లక్ష వైఖరిని తప్పుబట్టింది. ముందుస్తు ఎన్నికలు వస్తే అందుకు సిద్ధంగా ఉన్నారా? అని బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం నిలదీసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన కార్యచరణను సిద్ధం చేయాలని సూచించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజా విశ్వాసం గెలిచేలా వ్యవహరించాలని హెచ్చరించింది. తాజాగా త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలపై బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టి సారించింది.

ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏమి చేయాలనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం ఢిల్లీలో తెలంగాణ బిజెపి నేతలతో మినీ కోర్ కమిటీ సమావేశాన్ని అధిష్టానం నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ నేతలు మూడు గంటల పాటు భేటీ అయ్యి బిజెపి కార్యచరణ, పార్టీ వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు అమిత్ షా దిశనిర్దేశం చేశారు.. ఇటీవల ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన రెండు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలను తెలంగాణ బిజెపి నేతల ముందు ఉంచి ఆయన సమీక్షించారు. తెలంగాణలో పార్టీ పనితీరుపై ఎప్పటికప్పడు నివేదికలు అందుతున్నాయని ఆయన తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ దూసుకుపోతుంటే, రాష్ట్ర బిజెపిలో అలాంటి వాతావరణం లేదనే విషయాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను కొందరు నేతలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని బిజెపి నేతలను ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అనుకున్న గడువులోపు కార్నర్ మీటింగ్‌లు ఎందుకు పూర్తి చేయలేదని, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో అనుకున్నస్థాయిలో ఈ మీటింగ్‌లు పూర్తి చేయడటంలో ఎందుకు విఫలమయ్యారని నిలదీసినట్లు సమాచారం. బిజెపి అధికారంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్ రాష్ట్రాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో కూడా పార్టీ కార్యక్రమాలను సక్రమంగా ఎందుకు అమలు చేయడం లేదని బిజెపి నేతలను అమిత్ షా మందలించినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణలో ఓ నేత అరెస్టు అవుతారనే ప్రచారం మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ స్కామ్‌తో బిజెపికి ఏమి సంబంధం?, పార్టీ బలోపేత అంశాలను పక్కనపెట్టి అనవసర విషయాలపై ఎందుకు మీడియాలో మాట్లాడుతున్నారని, మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని రాష్ట్ర బిజెపి నేతలను అమిత్ షా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

బిజెపి మిషన్ 90, ప్రజా సంగ్రామ యాత్ర, పార్లమెంటరీ ప్రవాసీ యోజన మీటింగ్‌లు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో జనం నుంచి వస్తున్న స్పందన, త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సభలు, అనంతరం భారీ బహిరంగ సభ వంటి అంశాలపై పార్టీ నేతలను అమిత్ షా, జెపి నడ్డా ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఎంపిలు డాక్టర్ కె. లక్ష్మణ్, అరవింద్, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, మాజీ మంత్రి డి.కె.అరుణ, మాజీ ఎంఎల్‌ఎ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపి వివేక్, విజయశాంతి సహా మొత్తం 15 మంది నేతలు పాల్గొన్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: బండి
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. దుబ్బాక హుజూరాబాద్ ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బిజెపి చేపట్టిన కార్యక్రమాలపై పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. మంగళవారం ఢిల్లీలో అధిష్టానంతో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అమిత్ షా, జెపి నడ్డా తమతో చర్చించారని అన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ప్రజా గోస బిజెపి భరోసా నినాదంతో కార్నర్ మీటింగ్‌లను విజయవంతంగా నిర్వహించామన్నారు.

త్వరలో ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి బలంగా ఉందన్నారు. రెండు ఎంపి సీట్లతో ప్రారంభమైన బిజెపి ప్రస్థానం నేడు 300 సీట్లకు దాటిందని ఆయన గుర్తు చేశారు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టుకు, తెలంగాణ బిజెపి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. లిక్కర్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News